నేడే ఆఖరి వన్డే..వెంటాడుతున్న వానగండం!
భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే ఆఖరివన్డేకి వానముప్పు పొంచిఉంది.
భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే ఆఖరివన్డేకి వానముప్పు పొంచిఉంది. ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టే సిరీస్ విజేత కాగలుగుతుంది...
భారత్- దక్షిణాఫ్రికాజట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో రెండుజట్లూ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో ఈరోజు జరిగే ఆఖరిపోరాటం రసపట్టుగా మారనుంది.
లక్నో వేదికగా జరిగిన తొలివన్డేను వానదెబ్బతో 40 ఓవర్లమ్యాచ్ గా నిర్వహించారు. ఈ పోరులో దక్షిణాఫ్రికా 9 పరుగులతో విజేతగా నిలవడం ద్వారా 1-0 ఆధిక్యం సంపాదించింది. అయితే..రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో భారత్ చెలరేగి ఆడి 7 వికెట్ల విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.
యువఆటగాడు ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ దూకుడుగా ఆడటం ద్వారా భారత్ విజేతగా నిలపడమే కాదు..సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపగలిగారు.
భయపెడుతున్న వరుణదేవుడు..
సిరీస్ లోని నిర్ణయాత్మక ఆఖరివన్డే కు వేదికగా ఉన్న న్యూఢిల్లీలో గత రెండురోజులుగా కుండపోతగా వర్షం కురిసింది. మ్యాచ్ జరిగే ఈరోజు సైతం భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గత రెండురోజులుగా 121.7 మిల్లీమీటర్ల వర్షంతో ఢిల్లీ తడసి ముద్దయ్యింది. అయితే ..అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ , అవుట్ ఫీల్డ్ లను కవర్లతో కప్పి ఉంచడం ద్వారా మ్యాచ్ నిర్వహించడానికి సిద్ధంగా ఉంచారు.
మ్యాచ్ జరిగేంత సేపూ 63 శాతం మేఘాలు కమ్మే ఉంటాయని, 40 శాతం ఉక్కబోత వాతావరణం తప్పదని వాతావరణశాఖ తెలియచేసింది.
వాతావరణం 21 నుంచి 29 డిగ్రీల సెలీషియస్ నడుమ అస్థిరంగా ఉంటుందని ప్రకటించింది.ఈ నేపథ్యంలో జరిగే మ్యాచ్ రెండుజట్లకూ సవాలు కానుంది.
యువఆటగాళ్ల సత్తాకు పరీక్ష...
వరుణుడు కరుణించి పూర్తి 50 ఓవర్ల మ్యాచ్ జరిగితే...రెండుజట్ల పేస్, స్వింగ్ బౌలర్లకు చేతినిండా పనేనని చెప్పక తప్పదు. ఆకాశం మేఘావృతం కావడంతో స్వింగ్ బౌలర్లు కీలకపాత్ర పోషించనున్నారు.
భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్ తో పాటు స్పిన్ జోడీ వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ కీలకం కానున్నారు. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లతో పాటు...యువఆటగాళ్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ స్థాయికి తగ్గట్టుగా ఆడితే సఫారీలకు కష్టాలు తప్పవు.
మరోవైపు...ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ల త్రయం పార్నెల్, రబడ, నోర్జేలతో దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎటాక్ అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో క్లాసెన్, మర్కరమ్, రీజా హెండ్రిక్స్, డి కాక్, డేవిడ్ మిల్లర్ ..భారత బౌలర్లకు సవాలు కానున్నారు.
రెండుజట్లూ సిరీస్ విజయమే లక్ష్యంగా పోటీకి దిగనుండడంతో..పోరు నువ్వానేనా అన్నట్లుసాగే అవకాశం ఉంది. వరుణుడు అడ్డుపడకుంటే..మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ రసపట్టుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత ప్రధాన ఆటగాళ్లంతా ప్రపంచకప్ లో పాల్గొనటానికి ఆస్ట్ర్రేలియాకు బయలుదేరి వెళ్లడంతో..పలువురు యువఆటగాళ్లతో కూడిన భారతవన్డే జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు.