Telugu Global
Sports

పాక్ కు భారత్ షాక్ అలవోకగా నెగ్గిన హర్మన్ సేన

కామన్వెల్త్ గేమ్స్ మహిళా క్రికెట్ గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ కీలక విజయం సాధించింది.

పాక్ కు భారత్ షాక్ అలవోకగా నెగ్గిన హర్మన్ సేన
X

కామన్వెల్త్ గేమ్స్ మహిళా క్రికెట్ గ్రూప్ -ఏ లీగ్ లో భారత్ కీలక విజయం సాధించింది. బర్మింగ్ హామ్ యూనివర్శిటీ గ్రౌండ్స్ వేదికగా జరిగిన లీగ్ రెండోరౌండ్ పోటీలో భారత్ 8 వికెట్లతో పాక్ ను చిత్తు చేసి నాకౌట్ రౌండ్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

వర్షం కారణంగా నిర్ణితసమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది.

పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బిస్మా మరూఫ్ 17, అలియా రియాజ్ 18 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో స్నేహ రాణా, రాధా యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

స్మృతి మంధానా దూమ్ ధామ్ బ్యాటింగ్...

18 ఓవర్లలో 100 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్ షెఫాలీ వర్మ ( 16 ), వన్ డౌన్ సబ్బినేని మేఘన ( 14 ) వికెట్ల నష్టపోయినా...మాజీ కెప్టెన్ స్మృతి మంధానా దూకుడుగా ఆడి ఆజేయ హాఫ్ సెంచరీ సాధించింది.

స్మృతి 42 బాల్స్ లో 8 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 63 పరుగుల తో నాటౌట్ గా నిలిచింది. దీంతో భారత్ 11.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 102 పరుగుల స్కోరుతో 8 వికెట్ల విజయం నమోదు చేసింది.

మొత్తం నాలుగుజట్ల గ్రూప్ -ఏ లీగ్ లో ఇప్పటి వరకూ రెండుమ్యాచ్ లు ఆడిన భారత్ కు ఇదే తొలిగెలుపు కాగా పాక్ జట్టు రెండుకు రెండుమ్యాచ్ లూ ఓడి నాకౌట్ రౌండ్ నుంచి నిష్క్ర్రమించింది.

పాక్ పై తిరుగులేని భారత్..

మహిళా టీ-20లో చిరకాల ప్రత్యర్థి పాక్ తో ఇప్పటి వరకూ 12సార్లు తలపడిన భారత్ కు ఇది 10 గెలుపు. ఈ విజయంతో పాక్ ప్రత్యర్థిగా భారత్ మరోసారి తనదే పైచేయిగా చాటుకోగలిగింది.

గ్రూప్- ఏ తొలిరౌండ్లో ఆస్ట్ర్రేలియా చేతిలో కంగు తిన్న భారత్...సెమీస్ చేరాలంటే తన ఆఖరిరౌండ్ పోరులో బార్బడోస్ ను ఓడించి తీరాల్సి ఉంది. తన తొలిరౌండ్ పోటీలో పాక్ ను చిత్తు చేసిన బార్బడోస్ రెండోరౌండ్లో ఆస్ట్ర్రేలియాను ఢీకోనుంది.

First Published:  31 July 2022 7:57 PM IST
Next Story