Telugu Global
Sports

వన్డే క్రికెట్లో హిట్ మ్యాన్ మరో అరుదైన రికార్డు!

భారత కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..వన్డే క్రికెట్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్ ప్రత్యర్థిగా జరిగిన ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.

వన్డే క్రికెట్లో హిట్ మ్యాన్ మరో అరుదైన రికార్డు!
X

భారత కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..వన్డే క్రికెట్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్ ప్రత్యర్థిగా జరిగిన ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న 2023 ఆసియాకప్ వన్డే టోర్నీలో భారత కెప్టెన్ కమ్ సూపర్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస హాఫ్ సెంచరీలతో పరుగుల మోత మోగిస్తున్నాడు.

లీగ్ దశ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో నేపాల్ పై అజేయహాఫ్ సెంచరీ సాధించిన రోహిత్..కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న సూపర్ -4 రౌండ్ మ్యాచ్ లో సైతం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.

9వ భారత బ్యాటర్ రోహిత్...

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఈ కీలక మ్యాచ్ లో సహఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి మొదటి వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యంతో హిట్ మ్యాన్ రోహిత్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేయడం ద్వారా తన వన్డే కెరియర్ లో 50 హాఫ్ సెంచరీల మైలురాయిని చేరుకోగలిగాడు.

వన్డే క్రికెట్లో 50 అర్థశతకాలు సాధించిన భారత 9వ బ్యాటర్ గా రోహిత్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

గతంలో ఇదే ఘనత సాధించిన భారత దిగ్గజ క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, మహ్మద్ అజరుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు.

30 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు...

అంతేకాదు..వన్డే క్రికెట్లో 30 శతకాలు, 50 అర్థశతకాలు సాధించిన ఘనత కూడా రోహిత్ కు దక్కింది. ఈ రికార్డును సాధించిన భారత 6వ క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు. సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ, రాహువ్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, ధోనీ సైతం 80సార్లు 50కి పైగా స్కోర్లు సాధించిన మొనగాళ్లలో ఉన్నారు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత ఉంది. విరాట్ కొహ్లీ 45 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు, రాహుల్ ద్రావిడ్ 12 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు, సౌరవ్ గంగూలీ 22 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు, ధోనీ 9 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు, రోహిత్ శర్మ 30 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో 80సార్లు 50కి పైగా స్కోర్లు సాధించిన బ్యాటర్లుగా నిలిచారు.

నేడు భారత ఇన్నింగ్స్ కొనసాగింపు!

కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్- పాక్ జట్ల నడుమ జరుగుతున్న సూపర్ -4 రౌండ్ మ్యాచ్ ను ..వర్షంతో నిలిచిపోయిన సమయానికి సాధించిన స్కోరుతోనే నేడు( రిజర్వ్ డే రోజున ) కొనసాగించనున్నారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 24. 1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసిన సమయంలో కుండపోతగా వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు.

వన్ డౌన్ విరాట్ కొహ్లీ 8 పరుగులు, రెండో డౌన్ రాహుల్ 17 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు.

ఈ రోజు కొనసాగించనున్న మ్యాచ్ లో భారత్ మరో 25.5 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ రిజర్వ్ డే ఆటకు సైతం వర్షంతో అంతరాయం కలిగి రద్దుల పద్దులో చేరితే రెండుజట్లు చెరోపాయింట్ పంచుకొంటాయి.

First Published:  11 Sept 2023 1:30 PM IST
Next Story