Telugu Global
Sports

భారత్ సత్తాకు అసలు పరీక్ష, నేడే న్యూజిలాండ్ తో పోరు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అతిపెద్ద సమరానికి భారత్, న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ధర్మశాల వేదికగా ఈరోజు జరిగే సూపర్ సండే సమరంలో తలపడనున్నాయి.

భారత్ సత్తాకు అసలు పరీక్ష, నేడే న్యూజిలాండ్ తో పోరు!
X

భారత్ సత్తాకు అసలు పరీక్ష, నేడే న్యూజిలాండ్ తో పోరు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అతిపెద్ద సమరానికి భారత్, న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ధర్మశాల వేదికగా ఈరోజు జరిగే సూపర్ సండే సమరంలో తలపడనున్నాయి...

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హాట్ ఫేవరెట్లు న్యూజిలాండ్, భారత్ అతిపెద్ద పరీక్షకు సిద్ధమయ్యాయి.

హిమాలయ పర్వతపాదాలలో..ప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ హాట్ హాట్ ఫైట్ ప్రారంభంకానుంది.

సమఉజ్జీల సమరం......

ప్రస్తుత ప్రపంచకప్ 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగురౌండ్ల పోరులోనూ అజేయంగా నిలవడం ద్వారా లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన 5వ ర్యాంకర్ న్యూజిలాండ్, టాప్ ర్యాంకర్ భారత్ కీలకవిజయం కోసం తహతహలాడుతున్నాయి.

ప్రారంభమ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా, రెండోరౌండ్లో అప్ఘనిస్థాన్, మూడోరౌండ్లో పాకిస్థాన్, నాలుగోమ్యాచ్ లో బంగ్లాదేశ్ లను చిత్తు చేసిన భారత్ కు ఐదోరౌండ్లో న్యూజిలాండ్ నుంచి అసలు సిసలు పోటీ ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో భారత్ కు సరిజోడీగా ఉన్న న్యూజిలాండ్ కు గత రెండు దశాబ్దాల కాలంలో ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలలో భారత్ పై తిరుగులేని రికార్డే ఉంది.

కొరకరాని కొయ్య న్యూజిలాండ్....

భారత్ ప్రధానప్రత్యర్థిజట్లలో న్యూజిలాండ్ కు కొరకరాని కొయ్యగా పేరుంది. తుదివరకూ పోరాడే తత్వం, పవర్ ఫుల్ బ్యాటింగ్ ఆర్డర్, పదునైన పేస్ ఎటాక్, మిషెల్ సాంట్నర్ లాంటి మ్యాజిక్ స్పిన్నర్ తో న్యూజిలాండ్ ప్రత్యర్థిజట్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఓపెనింగ్ జోడీ డేవన్ కాన్వే, విల్లీ యంగ్, యంగ్ గన్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచిల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిల్పిప్స్ లతో కివీ బ్యాటింగ్ ఆర్డర్ భారత బౌలింగ్ ఎటాక్ కు సవాలు కానుంది.

పైగా స్వింగ్ కింగ్ ట్రెంట్ బౌల్ట్, పేస్ త్రయం టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ లతో పాటు స్పిన్నర్ సాంట్నర్ లతో కూడిన కివీ బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొనడం భారత టాపార్డర్ కు నిజమైన పరీక్షే. రోహిత్ శర్మను 5సార్లు, విరాట్ కొహ్లీని 6సార్లు పడగొట్టిన స్వింగ్ బౌలర్ టిమ్ సౌథీని తుదిజట్టులోకి తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

న్యూజిలాండ్ 8- భారత్ 1...

1990 నుంచి జరిగిన ఐసీసీ టోర్నీలలో భారత్ ప్రత్యర్థిగా న్యూజిలాండ్ కు 8 విజయాలు, ఒకే ఒక్క ఓటమి రికార్డు ఉన్నాయి. అయితే..ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యుత్తమంగా రాణిస్తూ వస్తున్న భారత్ స్థాయికి తగ్గట్టుగా ఆడితే న్యూజిలాండ్ ను ఓడించడం ఏమంత కష్టంకాబోదు.

బ్యాటింగ్ లో ఓపెనింగ్ జోడీ శుభ్ మన్ గిల్- రోహిత్ శర్మ ఇచ్చే ఆరంభంపైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఆడిన గత ఆరుమ్యాచ్ ల్లో శుభ్ మన్ గిల్ కు 50, 45, 13, 208, 40, 112 పరుగుల స్కోర్లు ఉండడంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో కీలకంకానున్నాడు. ఇక..కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఆడిన 4 రౌండ్లమ్యాచ్ ల పవర్ ప్లే ఓవర్లలో 32 సిక్సర్లు బాదడం ద్వారా టాపర్ గా నిలిచాడు.

ప్రస్తుత సీజన్లో కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్న రన్ మెషీన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్ సైతం భారత బ్యాటింగ్ ఆర్డర్ కు కీలకం కానున్నారు.

అదనపు బౌలరా? లేక బ్యాటరా?

ఆల్ రౌండర్ కమ్ వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరంకావడం భారత్ కు లేని తలనొప్పిని తెచ్చిపెట్టింది. పైగా ధర్మశాల వికెట్ , వాతావరణం బౌలర్ల పాలిట స్వర్గంగా ఉండడంతో..తుదిజట్టులోకి పాండ్యా స్థానంలో అదనపు బ్యాటర్ ను తీసుకోవాలా? లేక బౌలర్ ను తీసుకోవాలో అర్థంకాక భారత టీమ్ మేనేజ్ మెంట్ సతమతమవుతోంది.

కివీ బ్యాటింగ్ ఆర్డర్లో ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండడంతో.. భారత తుదిజట్టులో మూడో స్పిన్నర్ గా వెటరన్ అశ్విన్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదనపు బ్యాటర్ కావాలని భావిస్తే సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్ లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.

గత నాలుగుమ్యాచ్ లుగా బెంచ్ కే పరిమితమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి తుదిజట్టులో చోటు కల్పించాలన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

చేజింగ్ జట్టుకే విజయావకాశం...

బ్యాటర్ల సత్తాకు సవాలుగా నిలిచే ధర్మశాల పిచ్ పైన టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 280 నుంచి 300 వరకూ పరుగులు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి.

మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 20 శాతమే వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ నివేదిక చెబుతోంది.

ఫాస్ట్, స్వింగ్ బౌలర్లతో పాటు స్పిన్నర్లకూ అనుకూలించే ఇక్కడి పిచ్ పైన పదునైన ఫీల్డింగ్ కూడా కీలకమే. మిడిల్ ఓవర్లలో పట్టు బిగించిన జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి.

గత ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ నేటి ఈమ్యాచ్ లో నెగ్గడం ద్వారా బదులుతీర్చుకొంటుందా? తెలుసుకోవాలంటే ఈ సూపర్ సండే ఫైట్ ముగిసే వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  22 Oct 2023 9:44 AM IST
Next Story