Telugu Global
Sports

పరుగుల హోరుకు ఇండోర్ రెడీ, వన్డే సిరీస్ లో నేడే ఆఖరాట!

భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. పరుగుల అడ్డా ఇండోర్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిపోరులో తొలిగెలుపు కోసం కివీస్ ఆరాటపడుతుంటే..విజయాల హ్యాట్రిక్ కోసం భారత్ సిద్ధమయ్యింది.

పరుగుల హోరుకు ఇండోర్ రెడీ, వన్డే సిరీస్ లో నేడే ఆఖరాట!
X

భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. పరుగుల అడ్డా ఇండోర్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిపోరులో తొలిగెలుపు కోసం కివీస్ ఆరాటపడుతుంటే..విజయాల హ్యాట్రిక్ కోసం భారత్ సిద్ధమయ్యింది...

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ఇటు భారత్, అటు న్యూజిలాండ్ జట్ల సన్నాహాలు జోరుగా సాగిపోతున్నాయి. కొత్తసంవత్సరంలో తమ తొలిసిరీస్ ల్లో శ్రీలంకను భారత్ 3-0తో చిత్తు చేస్తే..పాకిస్థాన్ ను న్యూజిలాండ్ 2-1తో అధిగమించింది.

ఇప్పుడు ఈ రెండుజట్ల తలపడుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా ఆతిథ్య భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకోగలిగింది.

హైదరాబాద్ వేదికగా ముగిసిన హైస్కోరింగ్ తొలివన్డేలో భారత్ 12 పరుగులతో విజేతగా నిలవడమే కాదు..రాయ్ పూర్ వేదికగా ముగిసిన రెండోవన్డేలో 8 వికెట్ల అలవోక విజయంతో సిరీస్ పై 2-0తో పట్టు బిగించింది.

ఇండోర్ లో పరుగుల హోరు తప్పదా?

బ్యాటర్ల స్వర్గధామం, పరుగుల గని ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఈ మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరివన్డేలో పరుగులు వెల్లువెత్తడం ఖాయమని గత రికార్డులు మాత్రమే కాదు..పిచ్ క్యూరేటర్ సైతం చెబుతున్నారు.

బ్యాటింగ్ కు అనువుగా ఉండే వికెట్, కురచ బౌండ్రీలతో కూడిన చిన్నగ్రౌండ్ కావడంతో ఇండోర్ లో భారీస్కోర్లు నమోదు కావడం సాంప్రదాయంగా వస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కివీ ఆల్ రౌండర్ బ్రేస్ వెల్ , గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్, డేవిడ్ కాన్వే లాంటి సూపర్ డూపర్ హిట్టర్లకు ఇండోర్ వికెట్ మీద చేతినిండా పనే అని చెప్పక తప్పదు.

ఒక్కో ఇన్నింగ్స్ లో 350కి పైగా పరుగులు చొప్పున నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 350 కి పైగా పరుగులు సాధించినా విజయానికి గ్యారెంటీ లేకపోడం హోల్కార్ స్టేడియం ప్రత్యేకతని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐదేళ్ల తర్వాత ఇండోర్ వేదికగా వన్డే...

గత నాలుగేళ్లుగా టీ-20, టెస్టు మ్యాచ్ లకే ఆతిథ్యమిస్తూ వచ్చిన ఇండోర్ స్టేడియం ఐదేళ్ల సుదీర్ఘవిరామం తర్వాత వన్డే మ్యాచ్ కు వేదికగా నిలిచింది. గతంలో ఇదే గ్రౌండ్ వేదికగా జరిగిన టీ-20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా హిట్టర్ రిలీ రూసే 48 బంతుల్లోనే సిక్సర్లు, బౌండ్రీలతో కూడిన 27 భారీషాట్లు ఆడటం చూస్తే..ఈరోజు జరిగే మ్యాచ్ లో సైతం

కనీసం రెండు నుంచి మూడు శతకాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొదటి రెండువన్డేలలో ఓడిన న్యూజిలాండ్..ప్రస్తుత ఈ ఆఖరివన్డేలోనైనా నెగ్గడం ద్వారా పరువు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. కనీసం ఆఖరివన్డేలోనైనా నెగ్గడం ద్వారా మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు సిద్ధంకావాలని భావిస్తోంది.

మరోవైపు ఆతిథ్య భారత్ మాత్రం గత ఐదువన్డేలలో సాధించిన విజయపరంపరను కొనసాగించాలన్న లక్ష్యంతో ఉంది. భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ మాటల్లో చెప్పాలంటే..

ప్రస్తుత సిరీస్ లో ప్రతిమ్యాచ్ , ప్రతి గెలుపు కీలకమే. మొదటి రెండుమ్యాచ్ లు నెగ్గి సిరీస్ ఖాయం చేసుకొన్నామన్న ఉదాసీనత తమజట్టుకు లేదని, ఆఖరివన్డే కంటితుడుపుమ్యాచ్ కానేకాదని స్పష్టం చేశారు.

తుదిజట్టులో ఉమ్రాన్ ఖాన్...

భారత తుదిజట్టులో యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ ఖాన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలలో ఒకరికి విశ్రాంతినివ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు సైతం విశ్రాంతి నిచ్చే అవకాశాలు లేకపోలేదు. న్యూజిలాండ్ సైతం తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు చేపట్టే అవకాశం ఉంది.

జాకబ్ డుఫే, డగ్ బ్రేస్ వెల్ తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు.

కివీ థండర్ మైకేల్ బ్రేస్ వెల్, భారత 360 హిట్టర్ సూర్యకుమార్ ఇండోర్ మ్యాచ్ కే ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నారు. ఈ ఇద్దరూ క్రీజులో నిలిచారంటే..హోల్కార్ స్టేడియం బౌండ్రీలు, సిక్సర్ల మోతతో దద్దరిల్లిపోక తప్పదు.

స్టేడియం పూర్తి సామర్థ్యం మేరకు టికెట్లు హాటుకేకుల్లా అమ్ముడుపోడంతో..మైదానం కిటకిటలాడిపోక తప్పదు.

First Published:  24 Jan 2023 11:29 AM IST
Next Story