Telugu Global
Sports

హైదారాబాద్ వన్డే సూపర్ హిట్...!

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నాలుగేళ్ల విరామం తర్వాత జరిగిన భారత్- న్యూజిలాండ్ జట్ల వన్డే మ్యాచ్ సూపర్ హిట్ గా నిలిచింది.

హైదారాబాద్ వన్డే సూపర్ హిట్...!
X

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నాలుగేళ్ల విరామం తర్వాత జరిగిన భారత్- న్యూజిలాండ్ జట్ల వన్డే మ్యాచ్ సూపర్ హిట్ గా నిలిచింది.

ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో మొత్తం 686 పరుగులతో పాటు పలు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి...

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ రాకతో కళతప్పిన 50 ఓవర్ల వన్డే క్రికెట్ కు...2023 సీజన్ హైదరాబాద్ వన్డేమ్యాచ్ కొత్తఊపిరి పోసింది. పరుగులు, సెంచరీలు, రికార్డుల హోరుతో ఇటు నిర్వాహక సంఘం, అటు అభిమానులూ పైసా వసూల్ అనుకొనేలా చేసింది.

100 ఓవర్లు- 686 పరుగులు

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా టాప్ ర్యాంకర్ న్యూజిలాండ్, 4వ ర్యాంకర్ భారత్ జట్ల తీన్మార్ సిరీస్ లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డే మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఎనలేని ఉత్కంఠతో సాగింది. స్టేడియంలోని 39వేల మంది అభిమానులను మాత్రమే కాదు...టీవీల ముందు కూర్చొన్న కోట్లాదిమంది అభిమానులను సైతం ఊపిరిబిగబట్టి మ్యాచ్ ను చూసేలా చేసింది.

నాలుగేళ్ల తర్వాత వన్డేకి ప్రేక్షకరథం..

నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వన్డేమ్యాచ్ హౌస్ ఫుల్ షోలాగా సాగింది.స్టేడియం పూర్తి సామర్థ్యం 39వేలమందితో కిటకిటలాడిపోయింది.

మ్యాచ్ ప్రారంభానికి రెండురోజుల ముందే టికెట్లు హాటుకేకుల్లా అమ్ముడుపోయాయి.

ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమజట్ల నడుమ జరిగిన ఈపోరులో 686 పరుగులు నమోదు కావడమే కాదు..భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ రికార్డులతో మోతతో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా తనజట్టుకు 349 పరుగుల భారీస్కోరు అందించాడు.

సమాధానంగా..350 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఒకదశలో 126 పరుగులకే మొదటి ఆరు వికెట్లు నష్టపోయినా...7వ నంబర్ బ్యాటర్ బ్రేస్ వెల్ రివర్స్ ఎటాక్ తో మెరుపు సెంచరీ సాధించడం ద్వారా మ్యాచ్ ను ఆఖరి ఓవర్ వరకూ తీసుకువెళ్లాడు. ఆఖరి 4 వికెట్లకు న్యూజిలాండ్ 206 పరుగులు జోడించి భారత బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. చివరకు భారత్ 12 పరుగుల తేడాతో నెగ్గడంతో స్టేడియంలోని అభిమానులు ఊపిరిపీల్చుకోగలిగారు.

శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు..

వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన ఆటగాడిగా శుభ్ మన్ గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 149 బంతుల్లోనే 208 పరుగులు చేసిన శుభ మన్ 23 సంవత్సరాల 132 రోజుల వయసులో ఈ ఘనత సాధించగలిగాడు.

వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన భారత 5వ క్రికెటర్ గా నిలిచాడు. వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ నమోదు చేసిన 8వ బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. కేవలం 19 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు చేసిన భారత తొలి క్రికెటర్ గా మరో రికార్డు నెలకొల్పాడు.

వన్డే క్రికెట్లో శుభ్ మన్ కంటే ముందే డబుల్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఉన్నారు.

రోహిత్ ఒక్కడే మూడుసార్లు డబుల్ సెంచరీలు బాదడం విశేషం.

భారత్ తరపున 41 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన తరువాత..హోంగ్రౌండ్ వేదికగా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకొన్న హైదరాబాద్ కమ్ భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టడం ద్వారా అభిమానులను అలరించాడు.

మొత్తం మీద ...హైదరాబాద్ వన్డే పలు అరుదైన రికార్డులతో అభిమానులకు కలకాలం గుర్తుండిపోయేలా జరగటం విశేషం.

First Published:  19 Jan 2023 10:45 AM IST
Next Story