Telugu Global
Sports

భారత్ కు డూ ఆర్ డై, నేడే రెండో టీ-20

India Vs New Zealand, 2nd T20 Match: న్యూజిలాండ్ కు చెలగాటం, భారత్ కు సిరీస్ సంకటంగా మారిన ఈ పోరు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

India Vs New Zealand, 2nd T20 Cricket Match Today
X

భారత్ కు డూ ఆర్ డై, నేడే రెండో టీ-20

భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ కీలకదశకు చేరింది. లక్నో వేదికగా ఈరోజు జరిగే డూ ఆర్ డై సమరంలో ఆతిథ్య భారత్ తీవ్రఒత్తిడి నడుమ పోటీకి దిగుతోంది.....

అంతర్జాతీయ క్రికెట్లో ర్యాంకులకు, ఆటతీరుకు ఏమాత్రం సంబంధం ఉండదని మరోసారి తేలిపోయింది. రాంచీ వేదికగా ముగిసిన తొలి టీ-20లో టాప్ ర్యాంకర్ భారత్ ను 5వ ర్యాంకర్ న్యూజిలాండ్ 21 పరుగులతో చిత్తు చేసిన తీరే దానికి నిదర్శనం. మ్యాచ్ రోజున అన్ని విభాగాలలో రాణించినజట్టే విజేత నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

లక్నో స్లోపిచ్ పై కీలకపోరు...

తీన్మార్ సిరీస్ లో భాగంగా సూపర్ సండే ఫైట్ గా జరుగనున్నరెండో టీ-20 పోరుకు లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. మందకొడి పిచ్ గా పేరున్న లక్నో స్టేడియంలో జరిగే మ్యాచ్ లో నెగ్గితేనే ఆతిథ్య భారత్ ప్రస్తుత సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

రాంచీ వేదికగా జరిగిన తొలిపోరులో భారత్ బౌలింగ్ విభాగంలో రాణించలేకపోయింది. ప్రధానంగా మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రన్ మాలిక్, కీలక బౌలర్ అర్షదీప్ సింగ్ దారుణంగా విఫలం కావడమే భారత్ ను దెబ్బతీసింది.

అర్షదీప్ ను వేటాండుతున్న నోబాల్ భూతం..

భారత టీ-20 జట్టులో కీలక బౌలర్ గా, డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరున్న అర్షదీవ్ సింగ్ ను నోబాల్ బలహీనత ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన సిరీస్ లో వరుస నోబాల్స్ తో తీవ్రవిమర్శలకు గురైన అర్షదీప్..న్యూజిలాండ్ తో తొలి టీ-20లో ఘోరతప్పిదానికి పాల్పడ్డాడు.

ఇన్నింగ్స్ 20వ ఓవర్ లో అర్షదీప్ వేసిన నోబాల్ పుణ్యమా అంటూ కివీ హిట్టర్ మిచెల్ మూడుసిక్సర్లు, ఓ ఫోర్ తో సహా తన జట్టుకు 27 పరుగులు సాధించిపెట్టగలిగాడు,

దీంతో న్యూజిలాండ్ 176 పరుగుల భారీస్కోరు సాధించడమే కాదు..21 పరుగుల విజయంతో సిరీస్ లో 1-0తో ఆధిక్యం సాధించగలిగింది.

యువఓపెనర్ల పై ఒత్తిడి..

వన్డే సిరీస్ లో డబుల్ సెంచరీలతో చెలరేగిన భారత యువఓపెనింగ్ జోడీ శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లకు టీ-20 ఫార్మాట్ అంతతేలిక కాదని అర్థమైపోయింది.

రాంచీ మ్యాచ్ లో ఇషాన్ 4 పరుగులు, శుభ్ మన్ గిల్ 7 పరుగుల స్కోర్లకే...స్పిన్ బౌలర్లకు చిక్కారు. పవర్ ప్లే ఓవర్లు పూర్తికాకుండానే భారత్ 3 టాపార్డర్ వికెట్లు నష్టపోడం కూడా ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవాలి.

కెప్టెన్ హార్థిక్ పాండ్యా, వన్ డౌన్ రాహుల్ త్రిపాఠీ సైతం పూర్తిస్థాయిలో రాణించకపోతే భారత్ కు కష్టాలు తప్పవు. కేవలం వైస్ కెప్టెన్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ పైనే భారత్ ప్రధానంగా ఆధారపడటం మరింత ఒత్తిడిని పెంచుతోంది.

భారత తుదిజట్టులో ఒకటి రెండు మార్పులు తప్పని పరిస్థతి కనిపిస్తోంది. పేసర్ ఉమ్రాన్ కు విశ్రాంతినిచ్చి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు అవకాశం కల్పించే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పు అనివార్యంగా తయారయ్యింది. అయితే..పృథ్వీ షాకు అవకాశమిస్తారా? అన్నది అనుమానమే.

న్యూజిలాండ్ తో డేంజర్ యమడేంజర్..

సాంట్నర్ నాయకత్వంలోని న్యూజిలాండ్ అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థి అని రాంచీ దెబ్బతోనే భారత్ కు అర్థమైపోయింది. సూపర్ హిట్టర్లు మిషెల్, కాన్వే, బ్రేస్ వెల్, గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్ లను కట్టడి చేయకుంటా కష్టాలు కొని తెచ్చుకొన్నట్లే అవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యంత సమతూకంతో ఉన్న న్యూజిలాండ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రెండోసమరానికి సిద్ధమయ్యింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ కైవసం చేసుకోడం ద్వారా...వన్డే సిరీస్ ఓటమికి బదులుతీర్చుకోవాలన్న కసితో ఉంది.

న్యూజిలాండ్ కు చెలగాటం, భారత్ కు సిరీస్ సంకటంగా మారిన ఈ పోరు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

First Published:  29 Jan 2023 7:55 AM IST
Next Story