Telugu Global
Sports

టాపార్డర్ టాప్ గేర్..నెదర్లాండ్స్ పై భారత్ భారీగెలుపు!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ లీగ్ లో మాజీ చాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ముగిసిన గ్రూప్-2 రెండోరౌండ్లో పసికూన నెదర్లాండ్స్ ను 56 పరుగులతో చిత్తు చేసి టాపర్ గా నిలిచింది.

టాపార్డర్ టాప్ గేర్..నెదర్లాండ్స్ పై భారత్ భారీగెలుపు!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ లీగ్ లో మాజీ చాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ముగిసిన గ్రూప్-2 రెండోరౌండ్లో పసికూన నెదర్లాండ్స్ ను 56 పరుగులతో చిత్తు చేసి టాపర్ గా నిలిచింది.

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ జోరు కొనసాగుతోంది. సూపర్ -12రౌండ్ గ్రూప్ -2 లీగ్ పోరులో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. ప్రపంచకప్ లో తన తొలి హాఫ్ సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రోహిత్, విరాట్, సూర్య తీన్మార్ షో..

ప్రపంచ 17వ ర్యాంకర్ నెదర్లాండ్స్ తో జరిగిన ఏకపక్ష పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 3వ ఓవర్లోనే ఓపెనర్ రాహుల్ వికెట్ నష్టపోయినా వెంటనే తేరుకొని పరుగుల మోత మోగించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ- మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ రెండో వికెట్ కు, విరాట్ - సూర్యకుమార్ మూడో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 179 పరుగుల స్కోరు సాధించింది.

డాషింగ్ ఓపెనర్ రోహిత్ 39 బాల్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలసి మాస్టర్ బ్యాటర్ విరాట్ కొహ్లీ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

సూర్య ప్రపంచకప్ తొలి హాఫ్ సెంచరీ..

తన కెరియర్ లో తొలిసారిగా ప్రపంచకప్ లో పాల్గొంటున్న మిస్టర్ 360 స్ట్రోక్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ కేవలం తన రెండో మ్యాచ్ లోనే మెరుపు హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ అవుటైన వెంటనే క్రీజులోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ తన స్టయిల్లో గ్రౌండ్ నలుమూలలకూ షాట్లు కొడుతూ డచ్ బౌలర్లను ఓ ఆటాడుకొన్నాడు.

విరాట్ 44 బాల్స్ లో 3 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

పాకిస్థాన్ తో ముగిసిన ప్రారంభమ్యాచ్ లో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన విరాట్...రెండోమ్యాచ్ లోనూ నాటౌట్ గా నిలవడం విశేషం.

ఇక ..సూర్యకుమార్ యాదవ్ కేవలం 25 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్సర్ షాట్ ఆడటం ద్వారా సూర్యకుమార్ ప్రపంచకప్ లో తన తొలి అర్థశతకాన్ని నమోదు చేయగలిగాడు.

విరాట్- సూర్య జోరుతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. డచ్ బౌలర్లలో క్లాసెన్, మీకెరెన్ చెరో వికెట్ పడగొట్టారు.

మేడిన్ ఓవర్లతో కట్టిపడేసిన భువీ...

180 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన నెదర్లాండ్స్ ను భారత బౌలింగ్ ఎటాక్ పూర్తిస్థాయిలో కట్టడి చేసింది. ప్రధానంగా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన తొలి స్పెల్ లో రెండు మేడిన్ ఓవర్లు వేసి ఒక్క పరుగూ ఇవ్వకుండా ఓ వికెట్ పడగొట్టడం విశేషం.

భారత పేసర్ల త్రయం, స్పిన్నర్ల ద్వయం వికెట్ కు అనుగుణంగా బౌల్ చేసి డచ్ జట్టును 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేయగలిగారు.

స్పిన్ జోడీ అశ్విన్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు, పేసర్లు అర్షదీప్, భువీ చెరో రెండు వికెట్లు, షమీ ఓ వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 56 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా వరుసగా రెండో విజయం నమోదు చేయడంతో పాటు నెట్ రన్ రేట్ ను భారీగా మెరుగుపరచుకోగలిగింది.

మొత్తం ఆరుజట్ల లీగ్ లో భారత్ మొదటి రెండుమ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా 4 పాయింట్లతో గ్రూపు టాపర్ గా నిలిచింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగే మూడోరౌండ్ పోరులో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  27 Oct 2022 4:35 PM IST
Next Story