నేడే రెండో టీ-20, పొంచిఉన్న వానముప్పు!
భారత్- ఐర్లాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వానదేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. డబ్లిన్ విలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఈరోజు జరిగే రెండో టీ-20కి సైతం వానముప్పు పొంచి ఉంది.
భారత్- ఐర్లాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వానదేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. డబ్లిన్ విలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఈరోజు జరిగే రెండో టీ-20కి సైతం వానముప్పు పొంచి ఉంది.......
టీ-20 12వ ర్యాంకర్ ఐర్లాండ్- టాప్ ర్యాంకర్ భారతజట్ల రెండో పోరుకు డబ్లిన్ విలేజ్ గ్రౌండ్స్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. వానముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జరిగే ఈమ్యాచ్ ను సైతం నెగ్గడం ద్వారా 2-0తో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.
అయితే..భారత్ ప్రత్యర్థిగా సంచలన విజయం కోసం పసికూన ఐర్లాండ్ తహతహలాడుతోంది.
ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లతో భారత్...
వానదెబ్బతో కేవలం 26.5 ఓవర్లకే పరిమితమైన తొలి టీ-20 మ్యాచ్ లో భారతజట్టు డక్ వర్త్ లూయిస్ ఫార్ములా ప్రకారం 2 పరుగుల విజయంతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది.
జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వంలో ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన ద్వితీయశ్రేణి భారతజట్టు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ ను సొంతం చేసుకోడమే లక్ష్యంగా పోటీకి దిగుతోంది.
భారత టీ-20 చరిత్రలోనే తొలిసారిగా ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లతో భారత్ వరుసగా రెండోమ్యాచ్ లో సైతం భారత్ పోటీకి దిగుతోంది. యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ లతో సహా మొత్తం ఆరుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లతో ఐర్లాండ్ పేస్ బౌలింగ్ ఎటాక్ కు సవాలు విసురుతోంది.
జితేశ్ శర్మకు చోటు దక్కేనా?
ప్రస్తుత సిరీస్ లోని తొలిమ్యాచ్ ద్వారా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ టీ-20 అరంగేట్రం చేస్తే..యువ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు.
సీనియర్ పేసర్ అర్షదీప్ సింగ్ స్థానంలో..ఆవేశ్ ఖాన్ లేదా ముకేశ్ కుమార్ లలో ఒకరిని తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి.
తొలిమ్యాచ్ లో కేవలం 6.4 ఓవర్లకే పరిమితమైన భారత బ్యాటింగ్..ఈ రోజు జరిగే మ్యాచ్ లో పూర్తి 20 ఓవర్లు సాగే అవకాశం ఉంది. పేసర్ల జోడీ ప్రసిద్ధ కృష్ణ, జస్ ప్రీత్ బుమ్రాతో పాటు లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ సమర్థవంతంగా బౌల్ చేసి ఐర్లాండ్ టాపార్డర్ ను కకావికలు చేసినా లోవర్ ఆర్డర్ ను అదుపు చేయలేకపోయారు.
65 పరుగులకే 6 వికెట్లు నష్టపోయిన ఐర్లాండ్ చివరకు 20 ఓవర్లలో 139 పరుగుల స్కోరుతో భారత్ కు సవాలు విసరగలిగింది.
8వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగిన బారీ మెకార్తీ మెరుపు హాఫ్ సెంచరీతో అజేయంగా నిలవడం ద్వారా భారత బౌలర్లను నిలువరించాడు.
ఆత్మవిశాసంతో ఐర్లాండ్....
పలువురు ప్రపంచ స్థాయి టీ-20 క్రికెటర్లున్న ఐర్లాండ్ ఈరోజు జరిగే రెండో పోరులో భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది.పూర్తిస్థాయిలో రాణించగలిగితే టాప్ ర్యాంకర్ భారత్ ను కంగుతినిపించడం ఏమంత కష్టంకాబోదని ఐరిష్ కెప్టెన్ అంటున్నాడు.
టాపార్డర్ నుంచి లోవర్ ఆర్డర్ వరకూ ధాటిగా ఆడే సత్తా ఉన్న పలువురు బ్యాటర్లు ఐరిశ్ జట్టులో ఉన్నారు. వీరిలో ఏ నలుగురు రాణించినా భారత్ కు గట్టిపోటీ తప్పదు.
పాల్ స్టిర్లింగ్, బాల్ బిర్నీ, టకర్, హారీ టెక్టార్, కాంఫెర్, డోక్రెల్, మెకార్తీలతో ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది.
బౌలర్లలో క్రెయిగ్ యంగ్, జోషువా లిటిల్ ల నుంచి భారత బ్యాటర్లకు సవాలు ఎదురుకానుంది.
ఐర్లాండ్ పై భారత్ కు 6-0 రికార్డు...
ఐర్లాండ్ ప్రత్యర్థిగా భారత్ ఇప్పటి వరకూ ఆడిన ఆరుకు ఆరుమ్యాచ్ ల్లోనూ అజేయంగా నిలిచింది. ఈ ఆరుమ్యాచ్ ల్లో మూడింట 200కు పైగా స్కోర్లు సాధించడం విశేషం.
అయితే..ఇటీవలి కాలంలో తమజట్టుకు బలమైన జట్లతో తలపడిన సమయంలో అత్య్తుత్తమంగా రాణించడం ఓ అలవాటుగా మారిందని, భారత్ ను కంగు తినిపించాలన్న పట్టుదలతో ఉన్నామని ఐరిష్ కెప్టెన్ ప్రకటించాడు.
వరుణుడు కరుణిస్తే ..మ్యాచ్ పూర్తి 40 ఓవర్లపాటు సాగితే..రెండుజట్లు స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే పోటీ రంజుగా సాగే అవకాశం ఉంది. భారత కాలమానప్రకారం రాత్రి 7-30 గంటలకు ఈపోరు ప్రారంభంకానుంది.