Telugu Global
Sports

నేడే ఆఖరి టీ-20, సిరీస్ స్వీప్ కు భారత్ రెడీ!

ఐర్లాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ క్లీన్ స్వీప్ విజయానికి గురి పెట్టింది. ఈ రోజు జరిగే ఆఖరాటలో యువఆటగాళ్లకు అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

నేడే ఆఖరి టీ-20, సిరీస్ స్వీప్ కు భారత్ రెడీ!
X

నేడే ఆఖరి టీ-20, సిరీస్ స్వీప్ కు భారత్ రెడీ!

ఐర్లాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ క్లీన్ స్వీప్ విజయానికి గురి పెట్టింది. ఈ రోజు జరిగే ఆఖరాటలో యువఆటగాళ్లకు అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది...

టీ-20 ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్, 12వ ర్యాంకర్ ఐర్లాండ్ జట్ల తీన్మార్ సిరీస్ ఏకపక్షంగా సాగిపోతోంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వంలో ద్వితీయశ్రేణిజట్టుతోనే బరిలో నిలిచిన భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ ను ఖాయం చేసుకొంది.

డబ్లిన్ విలేజ్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన తొలి టీ-20ని డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్..రెండోపోరులో 33 పరుగుల విజయంతో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

అయితే..బౌలింగ్ విభాగంలో తేలిపోతున్నా బ్యాటింగ్ లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఐర్లాండ్ మాత్రం కనీసం ఆఖరాటలోనైనా పూర్తిస్థాయిలో రాణించడం ద్వారా భారత్ సంచలన విజయం నమోదు చేయాలని భావిస్తోంది.

భారత్ 7- ఐర్లాండ్ 0

టెస్టు హోదా కలిగిన భారత్ తో, టెస్టు హోదాలేని పసికూన ఐర్లాండ్ కు అసలు పోలిక, పొంతనేలేదు. టీ-20 ఫార్మాట్లో రెండుజట్ల నడుమ 11 ర్యాంకుల అంతరం ఉంది. అంతేకాదు..అనుభవంలోనూ, ప్రమాణాలలోనూ భారత్ ముందు ఐర్లాండ్ దిగదుడుపే.

ఈ రెండుజట్లూ ప్రస్తుత సిరీస్ లోని రెండోమ్యాచ్ వరకూ ఇప్పటి వరకూ ఏడుసార్లు తలపడితే భారతజట్టే ఏడుకు ఏడుమ్యాచ్ లూ నెగ్గడం ద్వారా సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తోంది.

ఐర్లాండ్ లాంటి అంతంత మాత్రం ప్రమాణాలు కలిగిన జట్టుతో సిరీస్ ఆడటం ద్వారా గాయాలబారిన పడిన భారత సీనియర్ ప్లేయర్లతో పాటు యువఆటగాళ్లు సత్తా చాటుకోడానికి వేదికగా ఉపయోగించుకొంటున్నారు.

మరోవైపు..పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లు కలిగిన ఐర్లాండ్ సైతం..ప్రపంచ టాప్ ర్యాంక్ జట్టుతో తలపడే అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలుగుతుంది.

ప్రపంచ మేటిజట్లతో తలపడటం తమకు గొప్పఅనుభవమని, ప్రమాణాలు, నైపుణ్యాలను మెరుగుపరచుకొనే అవకాశం దక్కుంతుందని ఐర్లాండ్ సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ అంటున్నాడు.

రెండుమార్పులతో భారత్?

సిరీస్ ముగింపు దశకు చేరడంతో ఇప్పటి వరకూ బెంచ్ కే పరిమితమైన ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్, వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మలకు ఈ రోజు జరిగే ఆఖరిమ్యాచ్ లో అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. అర్షదీప్ సింగ్ కు విశ్రాంతినిచ్చి..అతని స్థానంలో ఆవేశ్ ఖాన్ ను చేర్చుకొనే అవకాశం లేకపోలేదు.

మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ 0, 1 పరుగుల స్కోర్లతో విఫలమైన తిలక్ వర్మ స్థానంలో జితేశ్ శర్మకు చోటు కల్పించినా ఆశ్చర్యం లేదు.

ఇప్పటికే భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకోడంతో..టీమ్ మేనేజ్ మెంట్ ప్రయోగాలకు ప్రాధాన్యమివ్వడం ఖాయమని చెప్పాల్సిన పనిలేదు. మొదటి రెండుమ్యాచ్ ల్లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆఖరిమ్యాచ్ లో ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మొదటి రెండుమ్యాచ్ ల్లో భారత ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించగా..ఆ తర్వాత సంజు శాంసన్ మాత్రమే 40కి పైగా స్కోరు నమోదు చేయగలిగాడు. మిగిలిన స్టార్ బ్యాటర్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.

మిడిలార్డర్ బ్యాటర్ రింకు శర్మ ధాటిగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా సత్తా చాటుకోగలిగాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ల త్రయం బుమ్రా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణతో పాటు లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ సైతం కీలక వికెట్లతో ఐర్లాండ్ ను దెబ్బతీయ గలుగుతున్నారు.

పట్టుదలతో ఐర్లాండ్..

మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ ఐర్లాండ్ టాపార్టర్ విఫలమైతే..మిడిల్, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు కీలక ఇన్నింగ్స్ ఆడుతూ తమజట్టుకు అండగా నిలుస్తూ వస్తున్నారు.

ఈ ఆఖరిపోరులో మిడిలార్డర్ తో పాటు టాపార్డర్ ఆటగాళ్లు రాణించగలిగితే భారత్ కు గట్టిపోటీ తప్పదు.8వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ మెకార్తీ మెరుపు హాఫ్ సెంచరీతో పాటు కీలక వికెట్లు పడగొడుతు భారత్ కు కొరకరాని కొయ్యిగా మారాడు. పాల్ స్టిర్లింగ్, బాల్ బిర్నీ, టకర్, హారీ టెక్టార్, కాంఫెర్, డోక్రెల్, మెకార్తీలతో ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలర్లలో క్రెయిగ్ యంగ్, జోషువా లిటిల్, మెకార్తీ ల నుంచి భారత బ్యాటర్లకు సవాలు ఎదురుకానుంది. భారత కాలమానప్రకారం రాత్రి 7-30 గంటలకు జరిగే ఈపోరులో భారత్ హాట్ ఫేవరెట్ గా ఉన్నా..ఆతిథ్య ఐర్లాండ్ ను తక్కువగా అంచనావేస్తే మాత్రం కష్టాలు తప్పవు.

First Published:  22 Aug 2023 7:00 AM
Next Story