Telugu Global
Sports

రాజకోట టెస్టులో భారత్ లక్ష్యం 450 పరుగులు!

ఇంగ్లండ్ తో రాజకోట వేదికగా ప్రారంభమైన మూడోటెస్టు రెండోరోజుఆటలో భారత్ 450 పరుగుల లక్ష్యంగా పరుగుల వేట కొనసాగించనుంది.

రాజకోట టెస్టులో భారత్ లక్ష్యం 450 పరుగులు!
X

ఇంగ్లండ్ తో రాజకోట వేదికగా ప్రారంభమైన మూడోటెస్టు రెండోరోజుఆటలో భారత్ 450 పరుగుల లక్ష్యంగా పరుగుల వేట కొనసాగించనుంది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న పాంచ్ పటాకా సిరీస్ లోని మూడోటెస్టు తొలిరోజుఆటను భారత్ సంతృప్తిగా ముగించింది. 33 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన భారత్ ను కెప్టెన్ రోహిత్ శర్మ- ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో పాటు..వ్యక్తిగత సెంచరీలతో ఆదుకొన్నారు.

రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్....

రాజకోట లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ కీలక టెస్టులో ఆతిథ్య భారత్ కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే..యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ 10, వన్ డౌన్ శుభ్ మన్ గిల్ 0, రెండోడౌన్ రజత్ పాటిదార్ 5 పరుగుల స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ 33 పరుగులకే 3 కీలక వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

అయితే..కెప్టెన్ రోహిత్- స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 4వ వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యంతో భారత్ ను ఆదుకొన్నారు. ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన భారత బ్యాటింగ్ ఆర్డర్ కు కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దదిక్కుగా నిలిచాడు. బాధ్యతతో ఆడి జట్టును ముందుండి నడిపించాడు.

జడేజాతో కలసి ప్రారంభంలో ఆచితూచి ఆడిన రోహిత్ 196 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగుల స్కోరుతో తనజట్టుకు ఊపిరిపోశాడు.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా మూడో శతకం..

తన కెరియర్ లో కేవలం 56వ టెస్టుమ్యాచ్ మాత్రమే ఆడుతున్న రోహిత్ కు సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఇది కేవలం 11వ శతకం మాత్రమే. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా మూడో సెంచరీ సాధించిన రోహిత్ చివరకు హుక్ షాట్ ఆడబోయి అవుటయ్యాడు.

ఓపెనర్ గా ఇంగ్లండ్ పై మూడో సెంచరీ సాధించిన భారత నాలుగో బ్యాటర్ గా రోహిత్ రికార్డుల్లో చేరాడు. గతంలో ఇదే ఘనత సాధించినవారిలో విజయ్ మర్చెంట్, కెఎల్ రాహుల్, మురళీ విజయ్ ఉన్నారు.

ఇంగ్లండ్ పై అత్యధికంగా 4 శతకాలు బాదిన రికార్డు సునీల్ గవాస్కర్ పేరుతో ఉంది. ఆ తర్వాతి స్థానంలో మరో ముగ్గురితో కలసి రోహిత్ నిలిచాడు.

సరఫ్రాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ...

భారత టెస్టుజట్టులో చోటు కోసం గత మూడేళ్లుగా అంతులేని పోరాటం చేసి..చివరకు టెస్ట్ క్యాప్ సాధించిన ముంబై యువ బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ తన తొలి ఇన్నింగ్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీతో వారేవ్వా అనిపించుకొన్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సరఫ్రాజ్ ఖాన్ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. కేవలం 48 బంతుల్లోనే తన తొలిటెస్టు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు రవీంద్ర జడేజా తప్పిదంతో 66 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగుల స్కోరుకు రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 314 పరుగుల స్కోరు వద్ద 5వ వికెట్ నష్టపోయింది.

రవీంద్ర జడేజా డబుల్ రికార్డు...

ఓవైపు వికెట్లు పడుతున్నా ఆల్ రౌండర్ జడేజా మాత్రం తన పోరాటం కొనసాగించి మూడంకెల స్కోరును చేరుకోగలిగాడు. 35 సంవత్సరాల రవీంద్ర జడేజా తన హోంగ్రౌండ్ లో శతకం బాదడంతో పాటు 3వేల పరుగులు, 200 వికెట్ల ఘనత సాధించిన భారత మూడో ఆల్ రౌండర్ గా రికార్డుల్లో చేరాడు. జడేజా మొత్తం 212 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. జడేజాకు ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ఇది రెండో శతకం కాగా..టెస్టు క్రికెట్లో వ్యక్తిగతంగా నాలుగో సెంచరీ.

టెస్టు చరిత్రలో భారత్ తరపున కపిల్ దేవ్ 5248 పరుగులు, 434 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 3271 పరుగులు 499 వికెట్ల డబుల్ నమోదు చేయగా..ఇప్పుడు జడేజా 3003 పరుగులు, 280 వికెట్ల రికార్డుతో నిలిచాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి జడేజా 110 పరుగులు, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతోనూ క్రీజులో ఉన్నారు. 5 వికెట్లకు 326 పరుగుల స్కోరుతో రెండోరోజుఆట కొనసాగించనున్న భారత్ చివరి 5 వికెట్లతో మరో 150 పరుగులు స్కోరుకు జోడించగలిగితే...ఇంగ్లండ్ కు కష్ట్లాలు తప్పవు. టెస్టు చివరి రెండురోజుల ఆటలో స్పిన్నర్లకు వికెట్ అనుకూలంగా మారనుండడంతో 4వ ఇన్నింగ్స్ ఆడాల్సిన ఇంగ్లండ్ కు అంతతేలికకాదు.

First Published:  16 Feb 2024 7:27 AM IST
Next Story