Telugu Global
Sports

స్మృతి, యాస్టికాజోరుతో భారత్ బోణీ!

ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో భారత మహిళాజట్టు బోణీ కొట్టింది. వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి వీడ్కోలుగా జరుగుతున్న ఈ సిరీస్ లో ఓపెనర్ స్మృతి మంధానా, యువబ్యాటర్ యాస్టికా భట్ చెలరేగి ఆడటం ద్వారా భారత విజయంలో ప్రధానపాత్ర వహించారు.

స్మృతి, యాస్టికాజోరుతో భారత్ బోణీ!
X

ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో భారత మహిళాజట్టు బోణీ కొట్టింది. వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి వీడ్కోలుగా జరుగుతున్న ఈ సిరీస్ లో ఓపెనర్ స్మృతి మంధానా, యువబ్యాటర్ యాస్టికా భట్ చెలరేగి ఆడటం ద్వారా భారత విజయంలో ప్రధానపాత్ర వహించారు...

భారత మహిళా క్రికెట్ కు గత రెండుదశాబ్దాల కాలంగా అసమాన సేవలు అందించిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామికి వీడ్కోలు సిరీస్ గా ఇంగ్లండ్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలిపోరులో భారత్ కళ్లు చెదిరే విజయం సాధించింది.

మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో 1-2తో పోరాడి ఓడిన భారత మహిళాజట్టు వన్డే సిరీస్ లోని తొలిపోరులో మాత్రం సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

హోవ్ వేదికగా ముగిసిన ఈ 50 ఓవర్ల సమరంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను 7 వికెట్లకు 227 పరుగుల స్కోరుకే భారత బౌలర్లు పరిమితం చేయగలిగారు.

42 డాట్ బాల్స్ తో జులన్ షో...

తన రిటైర్మెంట్ సిరీస్ గా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఈ పోరులో 39 సంవత్సరాల పేస్ బౌలర్ జులన్ గోస్వామి అత్యుత్తమంగా రాణించింది. తన బౌలింగ్ లో వాడివేడీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి చాటుకొంది.

జులన్ తన కోటా 10 ఓవర్లలో 42 డాట్ బాల్స్ వేయటం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ టాపార్డర్ ను పూర్తిస్థాయిలో అదుపు చేయగలిగింది. తన బౌలింగ్ లో జులన్ కనీసం ఒక్క బౌండ్రీ లేదా సిక్సర్ ఇవ్వకుండా బౌల్ చేయటం విశేషం.

ఇంగ్లండ్ బ్యాటర్లలో డాని వెయిట్ 50 బాల్స్ లో 43 పరుగులు, యాలిస్ డేవిడ్సన్ 61 బాల్స్ లో 50 పరుగులు చేయటంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులు చేయగలిగింది.

ఒకదశలో ఆట మొదటి 34 ఓవర్లు ముగిసే సమయానికే 6 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసి పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన ఇంగ్లండ్ ఆఖరి 16 ఓవర్లలో చివరి 4 వికెట్లకు 99 పరుగులు సాధించడం ద్వారా పుంజుకోగలిగింది.

భారత బౌలర్లలోదీప్తిశర్మ 2 వికెట్లు, మేఘనా సింగ్, రాజేశ్వరీ గయక్వాడ్ చెరో వికెట్ పడగొట్టారు.


స్మృతి చేజారిన సెంచరీ...

సమాధానంగా 228 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. మంధానా- యాస్టికా భట్ రెండో వికెట్ కు 16.1 ఓవర్లలో 96 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ అలవోక విజయం ఖాయమైపోయింది.

స్మృతి మంధానా 99 బాల్స్ ఎదుర్కొని 91 పరుగుల స్కోరుకు అవుటయ్యింది. ఇప్పటికే వన్డేలలో ఐదు శతకాలు బాదిన మంధాన కేవలం 9 పరుగుల దూరంలో ఆరోశతకం పూర్తి చేయడంలో విఫలమయ్యింది.మంధానా 10 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 91 పరుగులు సాధించింది.

ఆట 45వ ఓవర్లో మంధానా అవుట్ కావడంతో భారత్ మూడో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 94 బాల్స్ లో 74 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచింది.

యువప్లేయర్ యాస్టికా భట్ 47 బాల్స్ లో 50 పరుగుల అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ 7 వికెట్ల విజయం సాధించగలిగింది.

జులన్ అక్కకోసమే...

ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ తర్వాత రిటైర్ కావాలనుకొంటున్న వెటరన్ పేసర్ జులన్ దీదీ కోసమే తాము ఈ విజయం సాధించామని మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్మృతి మంధానా చెప్పింది. సిరీస్ విజయం సాధించడం ద్వారా జులన్ కు ఘనంగా వీడ్కోలు పలుకుతామని ప్రకటించింది.

గత రెండుదశాబ్దాలుగా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందిస్తున్న 39 సంవత్సరాల జులన్ కు 12 టెస్టుల్లో 44 వికెట్లు, 202 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ-20 మ్యాచ్ ల్లో 56 వికెట్లు పడగొట్టిన అసాధారణ రికార్డు ఉంది.

First Published:  19 Sept 2022 12:17 PM IST
Next Story