Telugu Global
Sports

ఆఖరిటెస్టులో భారత్ కు ఓటమి గండం!

India vs Bangladesh: బంగ్లాదేశ్ తో ఆఖరిటెస్టులో భారత్ కు ఓటమి గండం పొంచి ఉంది. మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరిరోజుఆటలో మరో 100 పరుగులు చేయాలి.

India vs Bangladesh
X

ఆఖరిటెస్టులో భారత్ కు ఓటమి గండం!

బంగ్లాదేశ్ తో ఆఖరిటెస్టులో భారత్ కు ఓటమి గండం పొంచి ఉంది. మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరిరోజుఆటలో మరో 100 పరుగులు చేయాలి. బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుకాని మీర్పూర్ పిచ్ పైన 6 వికెట్లతోనే పోరాడాల్సి ఉంది.....

భారత్- బంగ్లాజట్ల ఐసీసీ లీగ్ రెండో (ఆఖరి) టెస్టు రసపట్టుగా మారింది. మీర్పూర్ లోని నేషనల్ స్టేడియం వేదికగా గత నాలుగురోజులుగా జరుగుతున్న ఆఖరిటెస్టు మొదటి మూడురోజుల ఆటలో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ నాలుగోరోజుఆటలో మాత్రం దారుణంగా విఫలమయ్యింది.

రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాజట్టు ను 230 పరుగుల స్కోరు చేయనివ్వటం, 145 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగి 45 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లు నష్టపోడం పీకలోతు కష్టాలను కొని తెచ్చింది.

బంగ్లాను ఊరిస్తున్న చరిత్రాత్మక విజయం...

భారత్ ప్రత్యర్థిగా గత 22 సంవత్సరాలుగా ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు ఆడుతూ వస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఇప్పటి వరకూ ఒక్క గెలుపు లేదు. ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టు వరకూ 12 మ్యాచ్ లు ఆడిన బంగ్లాజట్టు 0-10 రికార్డుతో ఉంది. 10 పరాజయాలు, 2 డ్రాల రికార్డుతో మాత్రమే ఉంది. అయితే...విజయం లేని లోటును ప్రస్తుత సిరీస్ లోని ఆఖరిటెస్టు ద్వారా తీర్చుకొనే సువర్ణ అవకాశం వచ్చింది.

తొలిఇన్నింగ్స్ లో 227 పరుగులకే కుప్పకూలిన బంగ్లాజట్టు...రెండో ఇన్నింగ్స్ లో 231 పరుగుల స్కోరు సాధించడం ద్వారా తేరుకోగలిగింది. లిట్టన్ దాస్ 73 పరుగుల ఫైటింగ్ స్కోరుకు...లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు నూరుల్ హసన్, టాస్కిన్ అహ్మద్ చెరో 31 పరుగుల చొప్పున సాధించడం ద్వారా తమజట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అశ్విన్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.

భారత్ టాప్ లేపిన బంగ్లా స్పిన్ జోడీ...

టెస్టుమ్యాచ్ తో పాటు సిరీస్ నెగ్గాలంటే 145 పరుగుల లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్..నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్ రాహుల్, యువఓపెనర్ శుభ్ మన్ గిల్, వన్ డౌన్ పూజారా, దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ బంగ్లా స్పిన్నర్ల వలలో చిక్కి సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ ఓటమి ఊబిలో చిక్కుకొంది.

రాహుల్ 2, గిల్ 7స పూజారా 6, కొహ్లీ ఒకే ఒక్క పరుగు మాత్రమ చేయగలిగారు. స్పిన్నర్ల పాలిట స్వర్గంలా మారిన పిచ్ పైన బంగ్లా ఆఫ్ స్పిన్నర్ మహిదీ హసన్ మిరాజ్ 3 వికెట్లు, కెప్టెన్ షకీబుల్ 1 వికెట్ సాధించారు. 37 పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ ను నైట్ వాచ్ మన్ వచ్చిన జయదేవ్ ఉనద్కత్ తో కలసి అక్షర్ పటేల్ ఆదుకొన్నాడు. మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించగలిగారు.

అక్షర్ పటేల్ 26 పరుగులు, జయదేవ్ ఉనద్కత్ 3 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో నిలిచారు. ఆఖరిరోజు ఆటలో భారత్ మ్యాచ్ నెగ్గాలంటే మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. నాటౌట్ బ్యాటర్లతో పాటు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

మీర్పూర్ వేదికగా ఇప్పటి వరకూ జరిగిన టెస్టుల్లో 209, 205, 103 అత్యధిక మ్యాచ్ విన్నింగ్ స్కోర్లుగా నిలిచాయి. ఆఖరిరోజున బంగ్లా స్పిన్నర్ల ముప్పేట దాడిని భారత్ చివరి ఆరుగురు బ్యాటర్లు విజయవంతంగా అడ్డుకొని విజయలక్ష్యం 100 పరుగులను చేరుకోగలరా? తెలుసుకోవాలంటే మరో 24 గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  24 Dec 2022 7:00 PM IST
Next Story