Telugu Global
Sports

వన్డే సిరీస్ లో నేడే దిగ్గజాల తొలిసమరం!

వన్డే క్రికెట్లో టాప్ ర్యాంక్ జట్ల తీన్మార్ సిరీస్ సమరానికి ముంబైలో ఈరోజు తెరలేవనుంది.

వన్డే సిరీస్ లో నేడే దిగ్గజాల తొలిసమరం!
X

వన్డే క్రికెట్లో టాప్ ర్యాంక్ జట్ల తీన్మార్ సిరీస్ సమరానికి ముంబైలో ఈరోజు తెరలేవనుంది. ప్రపంచ నంబర్ వన్ భారత్ కు రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియా సవాలు విసురుతోంది.

భారత్ వేదికగా మరికొద్దిమాసాలలో ప్రారంభంకానున్న ఐసీసీ 2023 వన్డే ప్రపంచకప్ కు దిగ్గజజట్లు భారత్, ఆస్ట్ర్రేలియా సన్నాహాలు ప్రారంభించాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.

స్టాప్ గ్యాప్ కెప్టెన్లతోనే పోరు...

ఇటు ఆతిథ్య భారత్, అటు ఆస్ట్ర్రేలియాజట్లు తమ సారథులు రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ లేకుండానే..తాత్కాలిక కెప్టెన్లు హార్థిక్ పాండ్యా, స్టీవ్ స్మిత్ ల నాయకత్వంలో తొలిసమరానికి సై అంటున్నాయి.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన బావమరిది వివాహం కోసం తొలివన్డేకి దూరమైతే..కంగారూ కెప్టెన్ కమిన్స్ మాత్రం తల్లి మరణంతో సిరీస్ నుంచి ఉపసంహరించుకొన్నాడు.

రెండుజట్లలోనూ ప్రపంచ మేటి బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో సిరీస్ లోని ప్రతిమ్యాచ్ నువ్వానేనా అన్నట్లుగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది.

పూర్తిస్థాయి జట్టుతో భారత్...

ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ కు ఎక్కువమంది ప్రధాన ఆటగాళ్లతోనే భారత్ పోటీకి దిగుతోంది. గాయాలతో బుమ్రా, పంత్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే దూరమైనా..

సూపర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులోకి వచ్చాడు. సొంతగడ్డపై తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్న భారత్ కు కంగారూల రూపంలో అసలుసిసలు పోటీ ఎదురుకానుంది.

అయితే...పరుగుల గని ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా చివరి సారిగా 2011లోనే ఓ మ్యాచ్ నెగ్గిన భారత్..ఆ తర్వాత ఆడిన మూడు వన్డేలలోనూ పరాజయాలు చవిచూడటం టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురి చేస్తోంది.

ముంబై వేదికగా జరిగే మ్యాచ్ ల్లో టాస్ ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన గత 27 వన్డేల గణాంకాలు చూస్తే..ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు 13 విజయాలు సాధిస్తే..చేజింగ్ కు దిగిన జట్లు 14 విజయాలు నమోదు చేయటం విశేషం.

బ్యాటింగ్ స్వర్గధామంగా పేరున్న వాంఖడేలో 350 నుంచి 380కి పైగా స్కోర్లు నమోదైనా ఆశ్చర్యం లేదు.

వికెట్ కీపర్ బ్యాటర్ గా కెఎల్ రాహుల్...

పేలవ ఫామ్ తో టెస్టు తుదిజట్టులో స్థానం కోల్పోయిన ఓపెనర్ కెఎల్ రాహుల్ ..వికెట్ కీపర్ బ్యాటర్ గా మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగనున్నాడు. వెన్నెముక గాయంతో సిరీస్ కు దూరమైన మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు బదులుగా టీ-20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులో చేరనున్నాడు.

కెప్టెన్ రోహిత్ అందుబాటులో లేకపోడంతో ..ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్ తో కలసి ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

వన్డే డౌన్లో విరాట్ కొహ్లీ, రెండోడౌన్లో సూర్యుకమార్, మూడో డౌన్లో కెఎల్ రాహుల్, నాలుగో డౌన్లో హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ కు రానున్నారు. లోయర్ మిడిల్ ఆర్డర్లో రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించనున్నాడు.

పేస్ బౌలింగ్ త్రయం మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, స్పిన్ బౌలింగ్ లో యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్ లతో పాటు రవీంద్ర జడేజా కీలకం కానున్నాడు.

ఆల్ రౌండ్ పవర్ తో ఆస్ట్ర్రేలియా...

స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియా ఆల్ రౌండర్ల పవర్ తో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ట్రావిడ్ హెడ్ తో కలసి వార్నర్ బ్యాటింగ్ ప్రారంభించనున్నాడు. స్టీవ్ స్మిత్, మార్నుస్ లబుషేన్, గ్లెన్ మాక్స్ వెల్, కమెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్, మార్కుస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, సీన్ అబ్బోట్, ఆడం జంపా,మిషెల్ స్టార్క్ లతో

కంగారూజట్టు అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.

మధ్యాహ్నం 1-30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టుకే సిరీస్ పై పట్టు బిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

విరాట్ ను ఊరిస్తున్న జంట రికార్డులు..

గత ఆరుమాసాల కాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఐదు శతకాలు బాదడం ద్వారా తిరిగి గాడిలో పడిన భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని జంట రికార్డులు ఊరిస్తున్నాయి.

వన్డేలలో 13వేల పరుగుల మైలురాయికి విరాట్ 191 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా విరాట్ కు 8 వన్డే శతకాలు ఉన్నాయి. మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 9 సెంచరీల రికార్డును సమం చేయడంతో పాటు..అధిగమించే అవకాశం సైతం విరాట్ కోసం ప్రస్తుత సిరీస్ లో ఎదురుచూస్తోంది.

మరోవైపు..భారత్ ప్రత్యర్థిగా క్రికెట్ అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 14 శతకాలు బాదిన ఆసీస్ బ్యాటర్ రికార్డు రికీ పాంటింగ్ పేరుతో ఉంది. ప్రస్తుత సిరీస్ లో మరొక్క శతకం బాదగలిగితే..పాంటింగ్ రికార్డును సమం చేసే అవకాశం స్టీవ్ స్మిత్ కు దక్కనుంది. అంతేకాదు వన్డేలలో 5వేల పరుగుల రికార్డును అందుకోడానికి స్టీవ్ స్మిత్ మరో 83 పరుగులు చేస్తే చాలు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీని వన్డేలలో ఇప్పటి ఐదుసార్లు పడగొట్టిన కంగారూ లెగ్ స్పిన్నర్ ఆడం జంపా ప్రస్తుత తీన్మార్ సిరీస్ లో సైతం ఆస్ట్ర్రేలియాకు తురుపుముక్క కానున్నాడు.

సిరీస్ లో తొలిదెబ్బను భారత్ కొడుతుందా? లేక ఆస్ట్ర్రేలియాజట్టా ?..తెలుసుకోవాలంటే..మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  17 March 2023 11:01 AM IST
Next Story