Telugu Global
Sports

ఢిల్లీటెస్టులోనూ స్పిన్నర్ల హవా!

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ జట్లు ఆస్ట్రేలియా- భారత్ నాలుగుమ్యాచ్ ల సమరం రసపట్టుగా సాగుతోంది. రెండోటెస్టు రెండోరోజుఆటలో స్పిన్నర్ల హోరు మరింత జోరందుకొంది.

ఢిల్లీటెస్టులోనూ స్పిన్నర్ల హవా!
X

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ జట్లు ఆస్ట్రేలియా- భారత్ నాలుగుమ్యాచ్ ల సమరం రసపట్టుగా సాగుతోంది. రెండోటెస్టు రెండోరోజుఆటలో స్పిన్నర్ల హోరు మరింత జోరందుకొంది.

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంకర్ భారతజట్ల..నాలుగుమ్యాచ్ ల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రంజుగా సాగుతోంది. నాగపూర్ టెస్టు మొదటి మూడురోజుల ఆటలోనే స్పిన్నర్ల మ్యాజిక్ తో భారత్ ఇన్నింగ్స్ విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఆస్ట్ర్రేలియాను కేవలం మూడురోజుల ఆటలో రెండుసార్లు ఆలౌట్ చేసిన భారత బౌలర్లలో స్పిన్నర్ల త్రయం 18 వికెట్లు పడగొట్టడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో లెఫ్టామ్ స్పిన్నర్ జడేజా 5 వికెట్లు పడగొడితే..రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 5 వికెట్లతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

రెండోటెస్టులో లయన్ స్పిన్ జాదూ...

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న కీలక రెండోటెస్టు తొలిరోజు ఆటలో భారత స్పిన్ జోడీ అశ్విన్- జడేజా కలసి 6 వికెట్లు పడగొట్టడం ద్వారా కంగారూలను తొలిఇన్నింగ్స్ లో 263 పరుగులకు పరిమితం చేయగలిగారు.

అశ్విన్ 57 పరుగులిచ్చి 3 వికెట్లు, జడేజా 68 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 100 వికెట్ల మైలురాయిని చేరిన భారత రెండో స్పిన్నర్ గా అశ్విన్ నిలిచాడు.

ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా వందకు పైగా టెస్టు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత్ స్పిన్నర్ గా అనీల్ కుంబ్లే మాత్రమే ఉన్నాడు. ప్రస్తుత ఢిల్లీ టెస్టు ద్వారా అశ్విన్ 100 వికెట్లతో కుంబ్లే సరసన చోటు సంపాదించాడు.

అత్యంత వేగంగా జడేజా 250 వికెట్లు..

మరోవైపు..భారత లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 250 వికెట్లు, 2500 పరుగులు సాధించిన రెండో ఆల్ రౌండర్ గా నిలిచాడు.

టెస్టుల్లో 250 వికెట్లు తీసి, 2500 పరుగులు చేసిన జడేజా.. టెస్టుల్లో వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.

ఢిల్లీటెస్టు తొలిరోజు ఆటలో కంగారూ ఓపెనర్ ఉస్మాన్ క్వాజా ను తొలి ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌లో పడగొట్టడం ద్వారా .. జడేజాకు 250వ టెస్టు వికెట్ ను సొంతం చేసుకోగలిగాడు.

జడేజా కేవలం తన 62వ టెస్టు మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ 65 టెస్టుల్లో సాధిస్తే..జడేజా అంతకంటే మూడుటెస్టులకు ముందే..గ్రాండ్ డబుల్ రికార్డు అందుకోడం విశేషం.

ఇంగ్లండ్‌ ఆల్ టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ 55 టెస్టుల్లోనే 2500 పరుగులు, 250 వికెట్ల మైలురాయిని చేరుకోడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

అంతేకాదు.. టెస్టుల్లో 250 వికెట్లు, 2500 పరుగులు సాధించిన నాలుగో భారత ఆల్‌రౌండర్‌గా జడేజా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

కపిల్‌ దేవ్‌, అనిల్‌ కుంబ్లే, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ జాబితాలో జడేజా కంటే ముందు ఉన్నారు.

లయన్ విశ్వరూపం...

భారత స్పిన్ జోడీ మాత్రమే కాదు..ఆస్ట్ర్రేలియా స్పిన్నర్లు సైతం తమ సత్తాను చాటుకోగలుగుతున్నారు. నాగపూర్ టెస్టులో కంగారూ యువ ఆఫ్ స్పిన్నర్ టోడ్ మర్ఫీ ఏకంగా 7 వికెట్లు పడగట్టాడు.

ఇక..ఢిల్లీ టెస్టు రెండోరోజుఆట మొదటి సెషన్ లోనే భారత టాపార్డర్ ను ఆస్ట్ర్రేలియా మ్యాజిక్ స్పిన్నర్ నేథన్ లయన్ కకావికలు చేశాడు. భారత ఓపెనింగ్ జోడీ రాహుల్, రోహిత్ శర్మలతో పాటు..వన్ డౌన్ పూజారా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లను లయన్ పెవీలియన్ దారి పట్టించాడు.

లయన్ 11 ఓవర్లలో 24 పరుగులిచ్చి నాలుగు టాపార్డర్ వికెట్లు పడగొట్టాడు. భారత ప్రత్యర్థిగా ప్రస్తుత ఈ నాలుగు వికెట్లతో కలుపుకొని మొత్తం 99 వికెట్లు సాధించిన లయన్..మరో వికెట్ పడగొట్టగలిగితే..వంద వికెట్ల రికార్డును సైతం పూర్తి చేయగలుగుతాడు.

ఢిల్లీటెస్టు రోజున్నర ఆటలోనే 14 వికెట్లు టపటపారాలడం చూస్తే..ఈమ్యాచ్ సైతం మొదటి నాలుగురోజుల్లో ముగిసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  18 Feb 2023 12:25 PM IST
Next Story