Telugu Global
Sports

ఇండోర్ టెస్టులో బౌలర్ల హవా, వికెట్లు టపటపా!

ఇండోర్ టెస్టులో బౌలర్ల హవా కొనసాగుతోంది. ఐదురోజుల ఈమ్యాచ్ రోజున్నర ఆటలోనే 20 వికెట్లు టపటపా రాలిపోయాయి. బౌలర్ల హోరులో బ్యాటర్లు గజగజలాడి పోతున్నారు.

ఇండోర్ టెస్టులో బౌలర్ల హవా, వికెట్లు టపటపా!
X

ఇండోర్ టెస్టులో బౌలర్ల హవా కొనసాగుతోంది. ఐదురోజుల ఈమ్యాచ్ రోజున్నర ఆటలోనే 20 వికెట్లు టపటపా రాలిపోయాయి. బౌలర్ల హోరులో బ్యాటర్లు గజగజలాడి పోతున్నారు......

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్లు ఆస్ట్ర్రేలియా- భారతజట్ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మూడోటెస్టు రసపట్టుగా సాగిపోతోంది. ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ టెస్టు సమరం బౌలర్లకు చెలగాటం..బ్యాటర్లకు ప్రాణసంకటంగా పరిణమించింది.

బ్యాటర్ల స్వర్గం కాదు..నరకం!

మధ్యభారత్ లోని ప్రధానటెస్టు వేదిక ఇండోర్ కు సాంప్రదాయంగా బ్యాటర్ల స్వర్గంగా పేరుంది. తక్కువ నిడివికలిగిన బౌండ్రీలైన్, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్, బ్యాటింగ్ కు అనువుగా ఉండే పిచ్ కాస్త...ఆస్ట్ర్రేలియాతో మూడోటెస్టుకు మాత్రం బౌలర్ల స్వర్గంగా మారిపోయింది. నల్లమట్టితో తీర్చిదిద్దిన పిచ్ ను మ్యాచ్ కు ఉపయోగించడంతో ఆట తొలిరోజు..ప్రారంభ ఓవర్ల నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. స్పిన్ బౌలర్ ఎవరైనా బంతి మాత్రం బొంగరంలా తిరగడం మొదలు పెట్టింది.

నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టులను మూడురోజుల ఆటలోనే గెలుచుకొని 2-0తో ఇప్పటికే సిరీస్ ను నిలబెట్టుకొన్న భారత్..మూడోటెస్టులో కీలక టాస్ నెగ్గినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

చెత్త షాట్లతో కుప్పకూలిన భారత్...

టెస్టు మొదటిరోజు ఆట టీ విరామానికి ముందే భారత్ కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. కంగారూ స్పిన్ త్రయం ధాటికి భారత టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, యువఆటగాడు శుభ్ మన్ గిల్, నయావాల్ పూజారా, శ్రేయస్ అయ్యర్, జడేజా, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ..ఇలా ఒకరి తర్వాత ఒకరుగా చెత్తషాట్లు ఆడి కంగారూ స్పిన్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకొన్నారు.

లోయర్ ఆర్డర్ బ్యాటర్ అక్షర్ పటేల్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కొహ్లీ 22 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే కంగారూ లెఫ్టామ్ స్పిన్నర్ కున్ మన్ 5 వికెట్లు, లయన్ 3 వికెట్లు, మర్ఫీ ఒక వికెట్ పడగొట్టారు.

కంగారూలకు 88 పరుగుల ఆధిక్యం..

భారత్ ను 109 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్ర్రేలియా తొలిరోజు ఆటను ఘనంగా ముగించినా..రెండోరోజు ఆట మొదటి గంటలోనే కుప్పకూలింది. భారత స్పిన్ జోడీ రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టడంతో..కంగారూటీమ్ 197 పరుగులకే పరిమితమయ్యింది. ఆఖరి 6 వికెట్లను ఆస్ట్రేలియాజట్టు 11 పరుగుల తేడాలో నష్టపోయింది.

భారత్ పైన ఆస్ట్ర్రేలియా 88 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సంపాదించగలిగింది. రెండోరోజుఆట మొదటి గంటకే రెండుజట్లూ ఆలౌట్ కావడం, మొత్తం 20 వికెట్లలో 16 వికెట్లు స్పిన్నర్లకు, 3 వికెట్లు ఓ ఫాస్ట్ బౌలర్ కు మాత్రమే దక్కాయి.

స్వదేశంలో 100 వికెట్ల ఉమేశ్ యాదవ్...

రివర్స్ స్వింగ్ స్పెషలిస్ట్, భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్‌ యాదవ్ 5 ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో వంద వికెట్లు పడగొట్టిన రికార్డు సాధించాడు.

గతంలో ఇదే ఘనతను సాధించిన భారత దిగ్గజ పేసర్లలో కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఇశాంత్ శర్మఉన్నారు.

తన కెరియర్ లో పరిమితంగా లభించిన అవకాశాలను ఉమేశ్ యాదవ్ సద్వినియోగం చేసుకొని మరీ అరుదైన ఈ రికార్డు సాధించాడు. 35 సంవత్సరాల విదర్భ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ప్రస్తుత సిరీస్ లోని ఇండోర్ టెస్టు వరకూ 55 మ్యాచ్ లు ఆడి 168 వికెట్లు సాధించాడు. ఇందులో మూడుసార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్ల రికార్డు నమోదు చేశాడు. ఉమేశ్ సాధించిన 168 వికెట్లలో స్వదేశంలో 100 వికెట్లు, విదేశీ సిరీస్ ల్లో 68 వికెట్లు ఉండటం విశేషం.

ప్రస్తుత ఇండోర్ టెస్టు సైతం మూడురోజుల్లోనే ముగిసిపోడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  2 March 2023 3:13 PM IST
Next Story