భారత్ పదేళ్ల నిరీక్షణ ఫలించేనా?
ఈ రోజు ప్రారంభమయ్యే ప్రపంచ టెస్ట్ క్రికెట్ లీగ్ టైటిల్ సమరంలో భారత్ విజేతగా నిలిస్తే ఆ లోటు పూడ్చుకోగలుగుతుంది.
ఐసీసీ ప్రపంచక్రికెట్ టైటిల్ కోసం భారత్ గత పదేళ్లుగా ఎదురుచూస్తోంది. ఈ రోజు ప్రారంభమయ్యే ప్రపంచ టెస్ట్ క్రికెట్ లీగ్ టైటిల్ సమరంలో భారత్ విజేతగా నిలిస్తే ఆ లోటు పూడ్చుకోగలుగుతుంది.
అంత్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తూ అగ్రశ్రేణిజట్లలో ఒకటిగా నిలుస్తూ వచ్చినా..ఐసీసీ ప్రపంచ క్రికెట్ టోర్నీలలో మాత్రమే విఫలమవుతూ వస్తోంది.
2013లో చివరిసారిగా ఓ ఐసీసీ ( చాంపియన్స్ ) ట్రోఫీ నెగ్గిన భారత్..ఆ తర్వాత జరిగిన పలు టోర్నీలలో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతూ వస్తోంది.
అయితే..2023 ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా మరో ప్రపంచ టైటిల్ కు గురి పెట్టింది.
గతంలో 1983 వన్డే ప్రపంచకప్ 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలతో పాటు..2013 చాంపియన్స్ ట్రోఫీని మాత్రమే భారత్ సాధించింది. ఆ తర్వాత నుంచి మరో ప్రపంచ టైటిల్ కోసం గత దశాబ్దకాలంగా ఎదురుచూస్తూ వస్తోంది.
వరుసగా రెండోసారి ఫైనల్లో భారత్....
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం ప్రపంచ చాంపియన్ ను నిర్ణయించడానికి ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) 2019 నుంచి టెస్టు క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది.
టెస్టు హోదా పొందిన తొమ్మిది టాప్ ర్యాంక్ జట్లు మాత్రమే ఈ టైటిల్ కోసం తలపడుతూ వస్తున్నాయి. మూడేళ్లపాటు సాగే టెస్టు లీగ్ లో మొత్తం తొమ్మిదిజట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ టైటిల్ వేటలో కొనసాగుతాయి.
అత్యధిక టెస్టు విజయాలు, పాయింట్లు సాధించిన మొదటి రెండుజట్ల నడుమ టెస్ట్ లీగ్ టైటిల్ సమరం నిర్వహిస్తూ వస్తున్నారు.
2021 టెస్టు లీగ్ ఫైనల్లో ఇంగ్లండ్ లోని సాతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో తలపడిన భారత్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే..2021- 2023 సీజన్ లీగ్ లో భారత్ రెండో అత్యుత్తమజట్టుగా వరుసగా రెండోసారి ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.
ఓవల్ వేదికగా నేటినుంచే టైటిల్ పోరు...
ఇంగ్లండ్ లోని స్పిన్ ఫ్రెండ్లీ ఓవల్ స్టేడియం వేదికగా ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ కు రంగం సిద్ధమయ్యింది. లీగ్ టేబుల్ టాపర్ ఆస్ట్ర్రేలియా, రెండోస్థానంలో నిలిచిన భారత్
టైటిల్ సమరానికి సిద్ధమయ్యాయి.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియా తొలిసారిగా టెస్టు లీగ్ ఫైనల్లో తలపడుతుంటే..రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్ వరుసగా రెండోసారి తన అదృష్టం పరీక్షించుకొంటోంది.
అప్పుడు ఆస్ట్ర్రేలియా..ఇప్పుడు భారత్..
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ద్వైపాక్షిక సిరీస్ ల్లోని గత రికార్డుల్లో కంగారూజట్టుదే పైచేయిగా ఉంటే...గత దశాబ్దకాలం రికార్డుల్లో మాత్రం భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రెండుజట్ల నడుమ జరిగిన గత నాలుగు సిరీస్ ల్లోనూ భారతజట్టే విజేతగా నిలవడం విశేషం. ఆస్ట్ర్రేలియా గడ్డపైన ఆస్ట్ర్రేలియాను రెండుసార్లు ఓడించిన భారత్..స్వదేశీ సిరీస్ ల్లో సైతం మరో రెండుసార్లు సిరీస్ విజేతగా నిలిచింది.
ప్రస్తుత ఓవల్ టెస్టుకు ముందు వరకూ రెండుజట్లూ 106 టెస్టుల్లో తలపడితే..ఆస్ట్ర్రేలియా 44, భారత్ 32 టెస్టుల్లో విజయాలు సాధించాయి. 29 టెస్టులు డ్రాగా ముగిస్తే..ఓ టెస్టు మ్యాచ్ టైగా ముగిసింది.
ఓవల్ వేదికగా వచ్చే ఐదురోజుల పాటు జరిగే టెస్టు లీగ్ ఫైనల్ పోరులో రెండుజట్లూ సమానబలం కలిగిన ప్రత్యర్థులుగా ఉన్నాయి.
తుదిజట్టులో అశ్విన్ కు చోటు దక్కేనా?
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత తుదిజట్టులో చోటు కోసం మూడు విభాగాలలో పోటీ గట్టిగానే ఉంది. స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది. ఇక పేస్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ లలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, కెఎస్ భరత్ పోటీపడుతున్నారు.
మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే 18మాసాల విరామం తరువాత తిరిగి టెస్టుజట్టులో చోటు సంపాదించాడు. భారత ఇన్నింగ్స్ ను రోహిత్- శుభ్ మన్ గిల్ జోడీ ప్రారంభిస్తారు. వన్ డౌన్ లో చతేశ్వర్ పూజారా, రెండో డౌన్లో విరాట్ కొహ్లీ, మూడో డౌన్లో అజింక్యా రహానే, ఆ తరువాత భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, సిరాజ్, శార్దూల్ లేదా ఉమేశ్ బ్యాటింగ్ కు దిగనున్నారు.
తుదిజట్టులో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను ఉంచుకోవాలా? లేక నలుగురు పేసర్లు, సింగిల్ స్పిన్నర్ తో బరిలోకి దిగాలో..భారత టీమ్ మేనేజ్ మెంట్ తేల్చుకోవాల్సి ఉంది.
మరోవైపు..ఆస్ట్ర్రేలియా మాత్రం నలుగురు ఫాస్ట్ బౌలర్లు, సింగిల్ స్పిన్నర్ వ్యూహంతోనే బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్, వన్ డౌన్ లబుషేన్, ఉస్మాన్ క్వాజా, ట్రావిస్ హెడ్, గ్రీన్ ల పైనే కంగారూజట్టు పూర్తిగా ఆధారపడి ఉంది.
అందరిచూపూ విరాట్ వైపే...
గత ఏడాదికాలంగా సూపర్ ఫామ్ లో ఉన్న భారత బ్యాటింగ్ నయా మాస్టర్ విరాట్ కొహ్లీ..టెస్టు లీగ్ ఫైనల్లో సెంచరీ కోసం తహతహలాడుతున్నాడు. కంగారూ టీమ్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన 24 టెస్టుల్లో 8సెంచరీలతో సహా 1979 పరుగులు సాధించిన రికార్డు విరాట్ కు ఉంది.
వన్డే డౌన్ చతేశ్వర్ పూజారా సైతం ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఆడిన 24 టెస్టుల్లో 5 సెంచరీలతో సహా 2033 పరుగులు సాధించాడు. భారత్ విజేతగా నిలవాలంటే..వన్ డౌన్ పూజారా, రెండో డౌన్ విరాట్ పూర్తిస్థాయిలో రాణించక తప్పదు.
యువఓపెనర్ శుభ్ మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చే ఆరంభం కూడా భారత్ జయాపజయాలను నిర్ణయించనుంది.
టైటిల్ నెగ్గితే భారీ ప్రైజ్ మనీ....
ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో నెగ్గినజట్టుకు ట్రోఫీ ( గద )తో పాటు 16 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా అందచేస్తారు. ఫైనల్లో ఓడిన జట్టు మాత్రం 8 లక్షల డాలర్లతో సరిపెట్టుకోవాల్సి ఉంది.
ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే..మొత్తం ప్రైజ్ మనీని రెండుజట్లూ చెరిసగం పంచుకొంటాయి.
ఫైనల్ మ్యాచ్‌కు వీళ్లే అంపైర్లు...
టెస్టు లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగవర్త్ వ్యవహరించనున్నారు. ఇక ఇంగ్లండ్‌కే చెందిన మరో అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఈ మ్యాచ్‌కు టీవీ అంపైర్‌గా, శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన ఫోర్త్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా వెస్టిండీస్‌కు చెందిన రిచీ రిచర్డ్‌సన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించబోతున్న గఫానీ, ఇల్లింగవర్త్‌లకు అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లుగా అపారమైన అనుభవం ఉంది. వీళ్లిద్దరూ ఎమిరేట్స్ ఐసీసీ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్‌లో సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ గఫానీకి 49వ టెస్టు కాగా, ఇల్లింగ్‌వర్త్‌కు 64వ టెస్టు. ఇక టీవీ అంపైర్‌గా వ్యవహరించబోయే కెటిల్‌బరోకు ఇది వరుసగా రెండో టెస్టులీగ్ ఫైనల్ మ్యాచ్. 2021లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు కూడా కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరించారు.