Telugu Global
Sports

మొహాలీలో నేడే తొలి టీ-20, రోహిత్, విరాట్ వైపే అందరి చూపు!

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్..టాప్ ర్యాంకర్ భారత్ కు సమఉజ్జీగా నిలువగలుగుతుందా? తెలుసుకోవాలంటే మరి కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

మొహాలీలో నేడే తొలి టీ-20, రోహిత్, విరాట్ వైపే అందరి చూపు!
X

కొత్తసంవత్సరంలో ఓ సరికొత్త టీ-20 సిరీస్ కు టాప్ ర్యాంకర్ భారత్, 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ సై అంటే సై అంటున్నాయి. తీన్మార్ సిరీస్ లోని తొలి సమరానికి మొహాలీ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలో ఓ ఆసక్తికరమైన సిరీస్ కు భారతగడ్డపై రంగం సిద్ధమయ్యింది. మరో ఆరుమాసాలలో జరుగనున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీకి మాజీ చాంపియన్ భారత్, సంచలనాల అప్ఘనిస్థాన్ ప్రస్తుత ఈ సిరీస్ లో సన్నాహాలు ప్రారంభించనున్నాయి.

ర్యాంకులలోనే తేడా..ఆటలో కాదు....

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంటే..అప్ఘనిస్థాన్ మాత్రం 10వ ర్యాంక్ లో ఉంది. ఈ రెండుజట్ల నడుమ ర్యాంకుల్లో మాత్రమే తేడా ఉంది. ఆటలో, ప్రమాణాలలో మాత్రం కాదు.

సంచలన విజయాలకు మరో పేరుగా నిలిచిన అఫ్ఘనిస్థాన్ జట్టులో ప్రతిభావంతులైన పలువురు ప్రపంచ మేటి టీ-20 క్రికెటర్లు ఉన్నారు. మ్యాచ్ విన్నర్ గా పేరున్న లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అందుబాటులో లేకపోడం అప్ఘన్ జట్టుకు లోటుగానే కనిపిస్తోంది. ముజీబుర్ రెహ్మాన్, నవీనుల్ హక్, నూర్ మహ్మద్ కీలకం కానున్నారు.

భారతజట్టుకు సీనియర్ జోడీ దన్ను...

టీ-20 ఫార్మాట్లో దిగ్గజాలుగా పేరున్న రోహిత్ శర్మ 14 మాసాల తరువాత తిరిగి భారతజట్టు పగ్గాలు చేపట్టాడు. రన్ మెషీన్ విరాట్ కొహ్లీ సైతం గత ప్రపంచ కప్ తరువాత తిరిగి జట్టులో చేరడంతో భారత్ కు వెయ్యేనుగుల బలం చేకూరినట్లయ్యింది.

ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2022 టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే పరాజయం పొందిన భారత్ 2024 టీ-20 ప్రపంచకప్ బరిలోకి హాట్ ఫేవరెట్ గా మరోసారి బరిలోకి దిగుతోంది.

ఆరునూరైనా టైటిల్ సాధించాలన్న పట్టుదలతో పూర్తిస్థాయి జట్టుతో సన్నాహాలు ప్రారంభించింది. మాజీ కెప్టెన్లు హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల నుంచి తేరుకొంటున్న కారణంగా జట్టుకు అందుబాటులో లేకపోడంతో..సంజు శాంసన్, రింకూ సింగ్ లాంటి పలువురు యువఆటగాళ్లకు అవకాశం దక్కింది.

సంజు శాంసన్ కు కొత్తఊపిరి...

అపారప్రతిభ ఉన్నా భారతజట్టులో తగిన అవకాశాలు లేక సతమతమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు ప్రస్తుత సిరీస్ ద్వారా జట్టులో పాదుకొనే అవకాశం దక్కింది.

రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రాహుల్ లాంటి వికెట్ కీపర్ బ్యాటర్లు వేర్వేరుకారణాలతో అందుబాటులో లేకపోడంతో...వికెట్ కీపర్ స్థానం కోసం సంజు శాంసన్, జితేశ్ శర్మ పోటీపడుతున్నారు. అయితే..ఈ రోజు జరిగే మ్యాచ్ లో మాత్రం సంజు వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది.

సూర్యకుమార్ లాంటి ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ లేని లోటును రోహిత్, విరాట్, రింకూ, సంజులతో పూడ్చుకోవాలని భారతజట్టు భావిస్తోంది. ఫాస్‌ బౌలింగ్ విభాగంలో మాత్రమే భారత్ కొంత బలహీనంగా కనిపిస్తోంది.

అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ లతో కూడిన పేస్ ఎటాక్ కీలకపాత్ర పోషించనుంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్ తమవంతు బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

రోహిత్- యశస్వి జైశ్వాల్ జోడీ భారత ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. వన్ డౌన్ లో శుభ్ మన్ గిల్, రెండో డౌన్లో విరాట్ కొహ్లీ, మూడో డౌన్లో సంజు శాంసన్, ఆ తరువాత రింకూసింగ్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు దిగనున్నారు.

మహి రికార్డు దిశగా రోహిత్....

టీ-20 ఫార్మాట్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ రికార్డు ఇప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతోనే ఉంది. ప్రస్తుతం ధోనీ తర్వాతి స్థానంలోనే రోహిత్ కొనసాగుతున్నాడు.

ధోనీ నాయకత్వంలో భారత్ ఆడిన 72 మ్యాచ్ ల్లో 42 విజయాల రికార్డు ఉంది. ప్రస్తుత అప్ఘన్ సిరీస్ ను భారత్ 3-0తో నెగ్గగలిగితే ధోనీ అత్యధిక విజయాల రికార్డును సమం చేసే అవకాశం రోహిత్ శర్మకు దక్కుతుంది.

ఇప్పటి వరకూ భారత్ కు 39 విజయాలు అందించడం ద్వారా రోహిత్ శర్మ 76.74 విజయశాతంతో అగ్రస్థానంలో నిలిచాడు. విరాట్ కొహ్లీ విజయశాతం 60గా మాత్రమే ఉంది. 50 మ్యాచ్ ల్లో భారత్ కు టీ-20 కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ 30 విజయాలు అందించగలిగాడు.

టీ-20 చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల వరుసలో అస్గర్ అప్ఘానీ , మహేంద్ర సింగ్ ధోనీ, బాబర్ అజమ్, వోయిన్ మోర్గాన్, ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా తలో 42 విజయాలతో అగ్రస్థానంలో నిలిచారు.

ఆస్ట్ర్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 40 విజయాలతో రెండు, రోహిత్ శర్మ 39 విజయాలతో మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.

అత్యధిక పరుగుల రికార్డు దిశగా...

టీ-20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ ఘనత కోసం విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ తిరిగి తమ పోటీని ప్రస్తుత సిరీస్ ద్వారా కొనసాగించనున్నారు. గత ప్రపంచకప్ వరకూ విరాట్ ఆడిన 115 మ్యాచ్ ల్లో 4008 పరుగులతో ప్రపంచంలోనే రెండోస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 148 మ్యాచ్ ల్లో 3853 పరుగులు మాత్రమే సాధించగలిగాడు.

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్..టాప్ ర్యాంకర్ భారత్ కు సమఉజ్జీగా నిలువగలుగుతుందా? తెలుసుకోవాలంటే మరి కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  11 Jan 2024 11:49 AM IST
Next Story