Telugu Global
Sports

భారత్ భళా..సెమీస్ లో ఇంగ్లండ్ తో ఢీ!

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ గ్రూపు-2 టాపర్ గా భారత్ నిలిచింది. ఐదురౌండ్లలో నాలుగు విజయాలు, 8 పాయింట్లతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 10న అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే రెండోసెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

భారత్ భళా..సెమీస్ లో ఇంగ్లండ్ తో ఢీ!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్ ను భారత్ భారీవిజయంతో ముగించడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది. 11వ ర్యాంకర్ జింబాబ్వేతో ఏకపక్షంగా సాగిన పోటీలో భారత్ 71 పరుగుల భారీవిజయం నమోదు చేసింది. 8పాయింట్లతో గ్రూపు టాపర్ గా నిలిచింది.

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ గ్రూపు-2 టాపర్ గా భారత్ నిలిచింది. ఐదురౌండ్లలో నాలుగు విజయాలు, 8 పాయింట్లతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 10న అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే రెండోసెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఆఖరిరౌండ్ ఆడకుండానే సెమీస్ బెర్త్..

గ్రూప్ ఆఖరిరౌండ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించడంతోనే..తన ఆఖరిరౌండ్ మ్యాచ్ ఆడకుండానే భారత్ సెమీస్ బెర్త్ ఖాయమైపోయింది.

అంతగా ప్రాధాన్యం లేకున్నా జింబాబ్వేతో మెల్బోర్న్ వేదికగా ముగిసిన సూపర్ సండే ఫైట్ కి 80వేలకు పైగా అభిమానులు హాజరు కావడం విశేషం.

ఈ మ్యాచ్ లో భారత్ ఒకే ఒక్కమార్పుతో బరిలోకిదిగింది. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్థానంలో యువవికెట్ కీపర్ రిషభ్ పంత్ ను తుదిజట్టులోకి తీసుకొంది.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

ఆఖరాటలో సూర్య స్పెషల్ షో...

కెప్టెన్ రోహిత్ శర్మ 15, మాజీ కెప్టెన్ విరాట్ 26, రిషబ్ పంత్ 3, హార్థిక్ పాండ్యా 18 పరుగులకే అవుటైనా...ఓపెనర్ రాహుల్, మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్..మెరుపు హాఫ్ సెంచరీలతో భారత్ కు భారీస్కోరు అందించారు.

రాహుల్ 35 బాల్స్ లో 3 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 51 పరుగులకు అవుటైతే...టాప్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ కేవలం 26 బాల్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగుల అజేయ స్కోరు సాధించాడు. ఈ క్రమంలో 2022 క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

115 పరుగులకే జింబాబ్వే ప్యాకప్...

187 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన జింబాబ్వే..ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ మద్వేరా, వన్ డౌన్ చకబేవా వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. పవర్ ప్లే ఓవర్లు ముగియకుండానే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఘోరపరాజయం అంచుల్లో కూరుకుపోయింది. అయితే మిడిలార్డర్ ఆటగాళ్లు బుర్లీ, సికిందర్ రజా ఎదురుదాడికి దిగడం ద్వారా తమజట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించగలిగారు.

బుర్లీ 22 బాల్స్ లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ తో 35 పరుగులు, సికిందర్ రజా 24 బాల్స్ లో 3 బౌండ్రీలతో 34 పరుగులతో తమజట్టు పరువు దక్కించారు.

భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు, షమీ, పాండ్యా చెరో 2 వికెట్లు, భువీ, అర్షదీప్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. మెరుపు హాఫ్ సెంచరీతో భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిడ్నీ వేదికగా ఈనెల 9న జరిగే తొలిసెమీఫైనల్లో గ్రూప్ - 1 టాపర్ న్యూజిలాండ్ తో గ్రూప్ -2 రన్నరప్ పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక..నవంబర్ 10న అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే రెండోసెమీఫైనల్లో గ్రూప్ -1 రన్నరప్ ఇంగ్లండ్ తో గ్రూప్ -2 విన్నర్ భారత్ పోటీపడుతుంది.

First Published:  6 Nov 2022 5:37 PM IST
Next Story