2036 ఒలింపిక్స్ నిర్వహణ బరిలో భారత్!
2036 లో జరిగే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని భారత్ తహతహలాడుతోంది. ఒలింపిక్స్ నిర్వహణ రేస్ లో భారత్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
2036 లో జరిగే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని భారత్ తహతహలాడుతోంది. ఒలింపిక్స్ నిర్వహణ రేస్ లో భారత్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడల పండుగ ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని భారత్ ఉవ్విళూరుతోంది. మరో 17 సంవత్సరాలలో జరిగే ఒలింపిక్స్ నిర్వహించడానికి జరిగే
పోటీలో భారత్ సైతం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. ముంబై వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఒలింపిక్ మండలి 141 వ కార్యవర్గ సమావేశం ప్రారంభించిన అనంతరం భారత ప్రధాని ఈ ప్రకటన చేశారు.
ఉట్టికెగరలేనమ్మ......
అప్పులకుప్ప భారత ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ ముందుకు రావటాన్ని క్రీడావిమర్శుకులు తప్పుపడుతున్నారు. గ్రీస్,బ్రెజిల్, జపాన్ లాంటి దేశాలు ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చి దివాళాతీసిన వాస్తవాన్ని భారత్ గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు.
గతంలో 70 దేశాలు పాల్గొన్న కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి నానాపాట్లు పడి, పలు విమర్శలు ఎదుర్కొన్న భారత ఒలింపిక్ సంఘానికి 204 దేశాలు పాల్గొనే
ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే సత్తా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఒలింపిక్స్ అంటే లక్షల కోట్ల ఖర్చు...
ఆర్థికంగా పలు రకాల సమస్యలతో సతమతమవుతున్న భారత్ కు లక్షలకోట్లు ఖర్చు చేసి ఒలింపిక్స్ నిర్వహించే సామర్థ్యం ఉందా అని ఆర్థికనిపుణులు ప్రశ్నిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్నులు, జీఎస్టీ ఆదాయంతో నడుస్తున్నభారత ప్రభుత్వం ఇప్పటికే పీకలోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ఒలింపిక్స్ నిర్వహణకు అవసరమయ్యే లక్షల కోట్ల రూపాయలను ఎక్కడ నుంచి తెస్తుందని, ప్రజలపై ఒలింపిక్ పన్ను వేస్తుందా? అని నిలదీస్తున్నారు.
130 కోట్ల జనాభా..అయినా..?
జనాభాపరంగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఉన్న భారత్...ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా కొనసాగుతూ వస్తోంది. పన్నులు, సేవల రంగం నుంచి వస్తున్న ఆదాయమే కానీ..ఉత్పత్తుల రంగం మాత్రం అలంకరణ ప్రాయంగా మారిపోయింది.
గత పదేళ్ల కాలంలో కేంద్రప్రభుత్వం చేసిన అప్పు 100 లక్షల కోట్లు దాటిపోయింది. స్వాతంత్రం వచ్చిన నాటినుంచి..నరేంద్ర మోదీ ప్రధాని కాక ముందు వరకూ వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పు ఒక ఎత్తుకాగా...గత దశాబ్దకాలంలో చేసిన అప్పు మరో ఎత్తుగా ఉంది.
భారత జనాభాలో ఎక్కువ భాగం యువజనం ఉండడంతో తాము క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ చెబుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో భారత్ 107 పతకాలు సాధించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, క్రీడాశక్తిగా భారత్ ఎదగాలని భావిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.
భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పుకోడానికి ఒలింపిక్స్ నిర్వహణకు మించిన అవకాశం మరొకటి లేదని ప్రభుత్వం అంటోంది.
అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్....?
2036 ఒలింపిక్స్ నిర్వహించడానికి భారత్ సిద్ధంగా ఉందని భారత ప్రధాని ప్రకటించినా..ఏ నగరంలో నిర్వహించేది బయటకు చెప్పకపోడంతో..అహ్మదాబాద్ వేదికగా నిర్వహించవచ్చునంటూ ఊహాగానాలు చెలరేగాయి.
అత్యాధునిక హంగులు కలిగిన అహ్మదాబాద్ నగరానికి ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే సత్తా ఉందని, ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలికసదుపాయాలు ఉండటం కూడా అహ్మదాబాద్ వైపు చూసేలా చేస్తోందని భావిస్తున్నారు.
దీనికితోడు..భారత్ లో అత్యధిక జనాదరణ పొందుతున్న క్రికెట్ క్రీడతో ప్రపంచ గుర్తింపు ఇప్పటికే వచ్చిందని, పైగా..ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ నుంచి టైటిల్ సమరం వరకూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియమే వేదికగా నిలిచిందని గుర్తుచేస్తున్నారు.
బిడ్డింగ్ కే వేలకోట్ల రూపాయల ఖర్చు...
ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోవాలంటే రానున్న మాసాలలో కోట్ల రూపాయలు మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేస్తూ ఎడతెరిపిలేని లాబియంగ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన దేశాలతో పోటీపడి, బిడ్డింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ లేకుండాపోయింది.
ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కితే అది భారత్ కే గర్వకారణం. దక్షిణాసియా దేశాలలో ఈ ఘనత దక్కించుకొన్న తొలిదేశంగా కూడా భారత్ నిలువగలుగుతుంది.
ఆసియా ఖండ దేశాలు చైనా, కొరియా,జపాన్ ఇప్పటికే ఒలింపిక్స్ ను సమర్థవంతంగా, అత్యంత విజయవంతంగా నిర్వహించడం ద్వారా తమ సత్తా చాటుకొన్నాయి.
భారత్ సైతం అదేస్థాయిలో పోటీలు నిర్వహించాలంటే మాత్రం జపాన్, కొరియా, చైనా దేశాల్లాగా శ్రమించక తప్పదు.