Telugu Global
Sports

భారత్-శ్రీలంక రెండోవన్డే నేడే!

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ కు చేరింది

భారత్-శ్రీలంక రెండోవన్డే నేడే!
X

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ కు చేరింది. సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ పోరులో గెలుపే లక్ష్యంగా రెండుజట్లు పోటీకి దిగుతున్నాయి..

ప్రపంచకప్ కు సన్నాహాకంగా భారత్- శ్రీలంకజట్లు ఆడుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కీలకదశకు చేరింది. గౌహతీ వేదికగా ముగిసిన తొలివన్డేలో 67 పరుగుల భారీవిజయంతో శుభారంభం చేసిన భారత్ వరుసగా రెండోమ్యాచ్ నెగ్గడం ద్వారా సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

మరోవైపు..8వ ర్యాంకర్ శ్రీలంక సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే..ఈ రోజు జరిగే రెండోమ్యాచ్ లో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. ఈ కీలక పోరు..భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమవుతుంది.

హాట్ ఫేవరెట్ గా భారత్...

రోహిత్ శర్మ నాయకత్వంలోని 4వ ర్యాంకర్ భారత్ ప్రస్తుత సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలకు ఉరకలేస్తోంది. విజయాల అడ్డా ఈడెన్ గార్డెన్స్ లో సైతం శ్రీలంకను చిత్తు చేయడం ద్వారా మూడోమ్యాచ్ వరకూ వెళ్లకుండానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

గౌహతీలో ముగిసిన తొలివన్డేలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన ఏకంగా 373 పరుగుల భారీస్కోరు నమోదు చేసిన జోరునే..కోల్ కతా వన్డే లో సైతం కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

ఓపెనర్లు శుభ్ మన్ గిల్- రోహిత్ శర్మ మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇవ్వగలిగితే విజయం కోసం భారత్ అంతగా కష్టపడాల్సిన పనిలేదు. రోహిత్, గిల్, కొహ్లీ భారీస్కోర్లతో చెలరేగడం ద్వారా టాపార్డర్ దూకుడుగా కనిపిస్తోంది.

మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రాహుల్ సైతం పూర్తిస్థాయిలో చెలరేగితే శ్రీలంక బౌలర్లకు కష్టాలు తప్పవు.

నిలకడలేమితో శ్రీలంక సతమతం..

తొలివన్డేలో 67 పరుగుల పరాజయం పొందినా శ్రీలంకజట్టు 300కు పైగా పరుగులు సాధించడం, కెప్టెన్ దాసున్ షనక అజేయ సెంచరీ సాధించడం ఆ జట్టు పోరాటపటిమను చెప్పకనే చెబుతోంది.

తొలివన్డేలో తాము కీలక టాస్ నెగ్గినా సద్వినియోగం చేసుకోలేకపోయామని, పవర్ ప్లే ఓవర్లలో విఫలం కావడం దెబ్బతీసిందని, ఆ లోపాలను రెండోవన్డేలో సరిచేసుకొంటామని శ్రీలంక కెప్టెన్ షనక ధీమాగా చెబుతున్నాడు.

రోహిత్ శర్మ లక్కీ గ్రౌండ్.....

భారత్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు అచ్చివచ్చిన గ్రౌండ్ గా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ కు పేరుంది. టీ-20, వన్డే మ్యాచ్ ల్లో రోహిత్ తన అత్యుత్తమ స్కోర్లను ఈడెన్ గార్డెన్స్ లోనే నమోదు చేయటం విశేషం.

వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగుల నాటౌట్ స్కోరును శ్రీలంక ప్రత్యర్థిగానే కోల్ కతా వేదికగా నమోదు చేసిన రోహిత్..మరోసారి భారీస్కోరు సాధించాలన్నపట్టుదలతో ఉన్నాడు. తొలివన్డేలో 83 పరుగులకే అవుటైన రోహిత్..ప్రస్తుత రెండోవన్డేలో మరింత మెరుగైన స్కోరు సాధించాలని భావిస్తున్నాడు.

2021 నుంచి స్వదేశీగడ్డపై భారత్ ఆడిన మొత్తం 10 వన్డేలలో 8 విజయాల రికార్డుతో ఉంది. అదే శ్రీలంక మాత్రం 27 వన్డేలు ఆడి..ఇంటా, బయటా 15 పరాజయాలు చవిచూసింది.

కీలకం కానున్న టాస్...

కోల్ కతా వేదికగా మ్యాచ్ లు జరిగే సమయంలో మంచు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జట్ల ప్రతిభతో పాటు మంచు ప్రభావం సైతం తుదిఫలితాన్ని నిర్ణయించనుండడంతో

టాస్ కీలకపాత్ర పోషించనుంది.

టాస్ నెగ్గినజట్టు ముందుగా ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపడం ఖాయం కానుంది. శ్రీలంక ప్రత్యర్థిగా ఇప్పటికే 22సార్లు 300కు పైగా స్కోర్లు సాధించిన భారత్ ప్రస్తుత సిరీస్ లో వరుసగా రెండోసారి 350కి పైగా స్కోరు సాధించే అవకాశం లేకపోలేదు.

భారత్ కు చెలగాటం..శ్రీలంకకు సిరీస్ సంకటంగా మారిన ఈపోటీ మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభంకానుంది.

First Published:  12 Jan 2023 11:08 AM IST
Next Story