Telugu Global
Sports

భారత మహిళలు భళా! లాన్ బౌల్స్ లో అనుకోని స్వర్ణం..

2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లాన్ బౌల్స్ క్రీడలో మహిళా జట్టు తొలిసారిగా బంగారు పత‌కం సాధించింది.

భారత మహిళలు భళా! లాన్ బౌల్స్ లో అనుకోని స్వర్ణం..
X

జీవితంలో మాత్రమే కాదు...క్రీడల్లో సైతం అనుకోని, అనూహ్యమైన ఫలితాలు చోటు చేసుకోడం అత్యంత అరుదుగా జరుగుతుంది. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు అనుకోని రీతిలో ఓ అరుదైన ఫలితం వచ్చింది. భారత్ లో ఏమాత్రం ఆదరణ, ప్రచారం, చరిత్ర లేని లాన్ బౌల్స్ క్రీడలో నలుగురు సభ్యుల భారత మహిళా జట్టు తొలిసారిగా బంగారు పత‌కం నెగ్గి సంచలనం మాత్రమే కాదు..సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇదే మొదటిసారి...

కామన్వెల్త్ దేశాలు..ప్రధానంగా పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన లాన్ బౌల్స్ క్రీడలో పురుషులు, మహిళలకు వ్యక్తిగత, టీమ్ అంశాలలో పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, దక్షిణాఫ్రికా, సమోవా దేశాల ఆధిపత్యం కనిపించే ఈ క్రీడలో భారత్ కు అంతంత మాత్రం చరిత్రే ఉంది. క్రికెట్ పిచ్చితో ఊగిపోయే భారత్ క్రీడాభిమానుల్లో చాలామందికి లాన్ బౌల్స్ అన్న ఓ క్రీడ ఉన్న విషయం కూడా తెలియదు. భారత్ లో ఈ క్రీడకు ఉన్న సదుపాయాలు, ప్రోత్సాహం కూడా అంతంత మాత్రమే.

ఏ మాత్రం అంచనాలు లేకుండా...

బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్‌ మహిళల(ఫోర్స్ ) విభాగంలో నలుగురు సభ్యుల భారత జట్టు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో నిలిచింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించడం ద్వారా టైటిల్ రౌండ్లో అడుగుపెట్టే వరకూ కూడా ఈ క్రీడ, క్రీడాకారిణుల గురించి మీడియా అంతగా పట్టించుకోలేదు. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కే, పింకీ, నయన్ మోనీ సైకియా సభ్యులుగా భారత జట్టు బరిలో నిలిచింది. తొలిరౌండ్ నుంచి నిలకడగా రాణిస్తూ సెమీఫైనల్స్ చేరిన భారత జట్టు..న్యూజిలాండ్ పై 16-13తో విజయం సాధించడం ద్వారా గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టింది. సెమీస్ ప్రారంభంలో 0-5తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత పుంజుకొని సంచలన విజయం నమోదు చేసింది.

స్వర్ణపోరులోనూ పోరాటమే...

బంగారు పతకం కోసం దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో భారత్ 17-10తో విజేతగా నిలిచింది. ఫైనల్ ప్రారంభంలో దక్షిణాఫ్రికా 10-8తో ఆధిక్యం సాధించడం ద్వారా స్వర్ణ పతకం ఖాయమనుకున్న‌ తరుణంలో లవ్లీ చూబే కీలక పాయింట్లు సాధించడం ద్వారా విజయానికి మార్గం సుగమం చేసింది. ఆఖరి రౌండ్లలో పోరాడిన భారత జట్టు చివరకు 7 పాయింట్ల తేడాతో విజేతగా బంగారు పతకాన్ని అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్ బంగారు పతకం గెలుచుకొన్న సరికొత్త క్రీడ లాన్ బౌల్స్ కావడం విశేషం.

ఒకరు పోలీసు...మరొకరు టీచర్...

స్వర్ణ విజేతలు భారత జట్టులోని నలుగురు సభ్యుల నేపథ్యం భిన్నమైనది. జట్టు నాయకురాలు లవ్లీ చూబే జార్ఖండ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. 38 ఏళ్ల వయసులో లవ్లీ స్వర్ణ పతకం అందుకోవ‌డం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది. మరో సభ్యురాలు రూపారాణి టిర్కే రాంచీలోని క్రీడామంత్రిత్వశాఖలో ఉద్యోగి కాగా..న్యూఢిల్లీకి చెందిన పింకీ..స్పోర్ట్స్ టీచర్ గా పనిచేస్తున్నారు.జట్టులోని మరో సభ్యురాలు నయన్ మోనీ సైకియా అసోంలోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ఆమె అసోం అటవీశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

భిన్నరాష్ట్రాలు, రంగాలకు చెందిన ఈ నలుగురు మహిళలు జట్టుగా భారత్ కు స్వ‌ర్ణ‌ పతకం సాధించడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు. 2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ సాధించిన నాలుగో బంగారు పతకం...మహిళల టీమ్ లాన్ బౌల్స్ ద్వారా సాధించినదే.

First Published:  3 Aug 2022 11:35 AM IST
Next Story