Telugu Global
Sports

100వ టెస్టులో భారత్ రికార్డుల మోత!

వెస్టిండీస్‌తో ఆఖరి టెస్టులో భారత బ్యాటర్లు, బౌలర్లు రికార్డుల మోత మోగించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్పిన్ జోడీ అశ్విన్, జడేజా సరికొత్త రికార్డులు నెలకొల్పారు.

100వ టెస్టులో భారత్ రికార్డుల మోత!
X

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా రికార్డుల మోత మోగిపోతూనే ఉంటుంది. ఇక..సాంప్రదాయ టెస్టు మ్యాచ్‌ల్లో రికార్డులకు కొదవే ఉండదు. ఐసీసీ టెస్టు లీగ్‌లో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల నడుమ..ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ వేదికగా జరుగుతున్నఆఖరి టెస్టు మూడో రోజు ఆటలో విరాట్ కొహ్లీ, నాలుగో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా- రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగించారు.

భారత జట్టు పేరుతో అరుదైన రికార్డు...

టెస్టు క్రికెట్ గత రెండు దశాబ్దాల కాలంలో అత్యంత వేగంగా మొదటి వికెట్‌కు 100 పరుగులు సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. వెస్టిండీస్- భారత్ జట్ల నడుమ జరుగుతున్న ఈ వందో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ కేవలం 12.2 ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయటం ద్వారా తమ జట్టుకు అరుదైన ఘనతను సంపాదించి పెట్టారు.

రోహిత్ శర్మ జంట రికార్డులు...

ప్రస్తుత రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ..రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 35 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ మొత్తం 44 బంతుల్లో 5 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 57 పరుగులకు అవుటయ్యాడు. టెస్ట్ క్రికెట్లో రోహిత్‌కు ఇదే అత్యంత వేగంగా సాధించిన హాఫ్ సెంచరీ కావడం విశేషం.

రెండంకెల స్కోర్ల ప్రపంచ రికార్డు...

టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా 30 సార్లు రెండంకెల స్కోర్లు సాధించిన తొలి, ఏకైక బ్యాటర్ రికార్డును రోహిత్ శర్మ తన పేరిట‌ లిఖించుకొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే పేరుతో ఉన్న 29 డబుల్ డిజిట్ స్కోర్ల రికార్డును తెరమరుగు చేశాడు.

టెస్టుమ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఆడిన గత 30 ఇన్నింగ్స్ లో( 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 31, 12, 12, 35, 15, 43, 103, 80 , 57 ) స్కోర్లు సాధించాడు. కనీసం ఒక్కసారి డకౌట్ కాకపోడం, సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటవ్వడం లేకుండా ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

500 వికెట్ల అశ్విన్- జడేజా జోడీ....

భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా కలసి 500 టెస్టు వికెట్లు పడగొట్టిన జంటగా రికార్డుల్లో చేరారు. గతంలో ఇదే రికార్డు సాధించిన అనీల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ జోడీ సరసన నిలిచారు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టడంతో జడేజా- అశ్విన్ కలసి సాధించిన వికెట్ల సంఖ్య 500కు చేరింది.

అశ్విన్- జడేజా కలసి ఆడిన మొత్తం 49 టెస్టుల్లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 274 వికెట్లు, లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 226 వికెట్లు పడగొట్టారు. 32 సార్లు ఈ జంట 5 వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు చొప్పున పడగొట్టారు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే- ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోడీ టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన భారత తొలి జోడీ కాగా..రెండో జోడీగా అశ్విన్- జడేజా నిలిచారు. 1970 దశకంలో భారత స్పిన్ దిగ్గజాలలో బిషిన్ సింగ్ బేడీ- చంద్రశేఖర్ జంట 42 టెస్టుల్లో 368 వికెట్లు సాధించారు.

First Published:  24 July 2023 5:59 PM IST
Next Story