భారత్- పాక్ మ్యాచ్ కు 57 దేశాల అభిమానులు!
అహ్మదాబాద్ వేదికగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ కు నరేంద్ర మోదీ స్టేడియం కిటకిటలాడిపోయింది.
అహ్మదాబాద్ వేదికగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ కు నరేంద్ర మోదీ స్టేడియం కిటకిటలాడిపోయింది.
ఈ మ్యాచ్ కోసం 57 దేశాల నుంచి అభిమానులు తరలి వచ్చారు..
ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల మధ్య శనివారం ముగిసిన మ్యాచ్ కు రికార్డుస్థాయిలో లక్షా 30 వేల మంది హాజరయ్యారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం కిటకిటలాడి పోయింది.
ఈ మ్యాచ్ చూడటానికి 57 దేశాలకు చెందిన అభిమానులు తరలి రావడంతో అహ్మదాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు పండుగ చేసుకొన్నారు.
1,229 హోటళ్లు ఫుల్..
అహ్మదాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 1229 హోటళ్ల లోని గదులన్నీ వివిధ దేశాల నుంచి వచ్చిన అభిమానులతో నిండిపోయాయి. మ్యాచ్ కు మూడురోజుల ముందే వివిధ దేశాల నుంచి అభిమానులు అహ్మదాబాద్ కు రావడంతో సందడి సందడిగా మారింది.
మహారాష్ట్ర్ర తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, పొరుగునే ఉన్న కేంద్రపాలిత ప్రాంతం నుంచి కూడా 38వేలమంది అహ్మదాబాద్ కు వచ్చినట్లు హోటెల్ యజమానులు చెబుతున్నారు.
13వేల 390 మంది విదేశీ అభిమానులు..
అక్టోబర్ 11, 13 తేదీలలో అహ్మదాబాద్ లోని వివిధ హోటెళ్లకు చెందిన 276 గదుల్లో 13వేల 390మంది విదేశీ అతిథులు విడిది చేశారు. ఇంగ్లండ్ కు చెందిన అభిమానులు 45 గదులు, అమెరికా నుంచి వచ్చిన అభిమానులు 34 గదులు,నేపాల్, జపాన్, అల్జీరియా, సింగపూర్ దేశాలతో పాటు..రష్యా, ఐర్లాండ్, టాంజానియా, యునైటెడ్ ఎమిరేట్స్ కు చెందిన అభిమానులు సైతం భారీసంఖ్యలోనే తరలి వచ్చారు.
అహ్మదాబాద్ నగరంలోని హోటెళ్ల గదులన్నీ నిండిపోయాయని, ఒక్కో సింగిల్ రూమ్ లో ఐదుగురు చొప్పున సర్దుకున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఇటు క్రికెట్..అటు నవరాత్రి వేడుకలు..
నవరాత్రి వేడుకలు ప్రారంభమైన సమయంలోనే క్రికెట్ మ్యాచ్ జరగడంతో అమెరికా,ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా దేశాలకు చెందిన ఎన్నారైలు, విదేశీ పౌరులు సైతం గణనీయమైన సంఖ్యలోనే తరలి వచ్చారు.
అల్బేనియా, ఉజ్బెకిస్థాన్, అమెరికన్ సమోవా, ఎరిత్రియా, హాంకాంగ్, కొరియా, పాపువా న్యూగినియా దేశాలకు చెందిన అభిమానులు సైతం ప్రపంచకప్ మ్యాచ్ కు హాజరు కావడం విశేషం.
జోరుగా నఖిలీ టికెట్ల దందా!
భారత్- పాకిస్థాన్ జట్ల మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని కలలు కన్న అభిమానుల అత్యుత్సాహాన్ని నఖిలీ టికెట్ల దందా నిర్వహించిన ఘనులు పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకొన్నారు.
నరేంద్ర మోదీ స్టేడియం కెపాసిటీ లక్షా 30వేలు కాగా..లక్ష టికెట్ల ను మాత్రమే వివిధ మార్గాలలో అభిమానులకు విక్రయించారు. అయితే..నఖిలీ టికెట్లు విక్రయించిన వారిని అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు..నిఖిలీ టికెట్లకు భారీగా చెల్లించి మోసపోయినవారి సంఖ్య కూడా ఎక్కువేనని అంటున్నారు.
నిఖిలీ టికెట్లతో మ్యాచ్ చూడటానికి వచ్చినవారి ప్రవేశాన్ని గేట్ల దగ్గర ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు అడ్డుకొన్నాయి.
తక్కువ రేటున్న స్టాండ్ల టికెట్ల ప్రవేశద్వారాల వద్దే ఎక్కువగా నఖిలీ టికెట్లు నమోదయ్యాయి. టికెట్ మీది బార్ కోడ్ ను ఎలక్ట్ర్రానిక్ మెషీన్ గుర్తించకపోతే..రెడ్ లైట్ వెలుగుతుంది. దాంతో అది నఖిలీ టికెట్ నిర్ధారణ అవుతుందని పోలీసు అధికారి చెబుతున్నారు. నఖిలీ టికెట్ల దందా నడిపిన పలువురు వ్యక్తులు తమ అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు.
ఏది ఏమైనా ప్రపంచకప్ నిర్వహణ కోసం బీసీసీఐ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే...ప్రారంభమ్యాచ్ నుంచి నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ వరకూ.. వేదికగా ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం యాజమాన్యంతో పాటు..అహ్మదాబాద్ నగరంలోని వ్యాపారులు సైతం పైసా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల వ్యాపారం చేసుకొంటున్నారు.