Telugu Global
Sports

ఇండోర్ వన్డేలో భారత్ హోరు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టాప్ ర్యాంకర్ భారత్ ' టాప్ గేర్' లో పడింది. ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ సిరీస్ మొదటి రెండువన్డేలు ముగిసే నాటికే 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది.

ఇండోర్ వన్డేలో భారత్ హోరు!
X

ఇండోర్ వన్డేలో భారత్ హోరు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టాప్ ర్యాంకర్ భారత్ ' టాప్ గేర్' లో పడింది. ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ సిరీస్ మొదటి రెండువన్డేలు ముగిసే నాటికే 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది.

స్వదేశీగడ్డపై తనకు ఎదురేలేదని ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ చాటుకొంది. 2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే 2-0 ఆధిక్యంతో సిరీస్ ఖాయం చేసుకొంది.

రెండోవన్డేలోనూ అదేజోరు.....

కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, జాదూ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లాంటి నలుగురు దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో..కెఎల్ రాహుల్ నాయకత్వంలో తలపడుతున్న భారత్ వరుసగా రెండో విజయంతో తనకుతానే సాటిగా నిలిచింది.

భారత విజయాల అడ్డా ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో 399 పరుగుల భారీస్కోరు సాధించడమే కాదు...99 పరుగుల విజయంతో..సిరీస్ స్వీప్ కు గురిపెట్టింది.

గిల్, అయ్యర్, సూర్య విశ్వరూపం...

బ్యాటర్ల స్వర్గధామం హోల్కార్ స్టేడియంలో కీలక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 399 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 104, వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ 105 పరుగులతో చెలరేగిపోతే...మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ కేవలం 37 బంతుల్లోనే 6 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 72 పరుగుల నాటౌట్ స్కోరుతో విశ్వరూపం ప్రదర్శించాడు.

ఆ తర్వాత...వర్షం కారణంగా ఆస్ట్ర్రేలియా విజయలక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్ణయించారు. అయితే భారత స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు, పేసర్లు ప్రసిద్ధ కృష్ణ 2, షమీ ఒకవికెట్ పడగొట్టారు. దీంతో ఆస్ట్ర్రేలియా 217 పరుగులకే కుప్పకూలి 99 పరుగుల ఓటమి మూటగట్టుకొంది.

ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ నాయకత్వంలోని కంగారూజట్టుకు గత ఐదు వన్డేలలో ఇది వరుసగా ఐదో ఓటమి కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరివన్డే రాజ్ కోట వేదికగా జరుగనుంది.

ఇండోర్ లో ఓటమి లేని భారత్...

దేశంలోనే భారీస్కోరింగ్ గ్రౌండ్ గా పేరుపొందిన ఇండోర్ హోల్కార్ స్టేడియంలో భారత్ ఆడిన గత ఏడు వన్డేలలోనూ విజేతగా నిలవడం విశేషం. భారతజట్టు ఒక్క ఓటమి లేకుండా అత్యధిక వన్డే విజయాలు సాధించిన తొలివేదికగా ఇండోర్ నిలిచింది.

భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇండోర్ వేదికగా వరుసగా రెండు శతకాలు బాదడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. ప్రస్తుత 2023 సీజన్లో శుభ్ మన్ కు ఇది 5వ శతకం.

నలుగురు ( రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, హార్థిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ) దిగ్గజ ఆటగాళ్లు లేకుండా ఆస్ట్ర్రేలియా లాంటి మేటిజట్టుపై 2-0తో భారత్ సిరీస్ నెగ్గడం ఇదే మొదటిసారి.

ఇక..ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా వన్డేలలో భారత్ కు వరుసగా ఇది 7వ సిరీస్ గెలుపు కావడం మరో విశేషం. స్వదేశీగడ్డపై ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 1986లో 3-2, 2010లో 1-0, 2013లో 3-2, 2017లో 4-1, 2020లో 2-1, 2023లో 2-0 విజయాలతో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది.

ఆస్ట్ర్రేలియాపై అత్యధిక వికెట్ల అశ్విన్...

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండువన్డేలలోనూ కలిపి 4 వికెట్లు పడగొట్టడం ద్వారా ..ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 154 వికెట్ల రికార్డును అశ్విన్ 155 వికెట్లతో అధిగమించాడు.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత స్పిన్ బౌలర్ గా అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 20 మాసాల తర్వాత భారత వన్డేజట్టులో చోటు సంపాదించిన అశ్విన్ సత్తా చాటుకోడం ద్వారా మరోసారి సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్ మెంట్ కు సవాలు విసిరాడు.

వన్డే ప్రపంచకప్ కు అశ్విన్ లేకుండానే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.

First Published:  25 Sept 2023 11:15 AM IST
Next Story