Telugu Global
Sports

ఆసియాక్రీడల్లో శతపతకాల దిశగా భారత్!

ఆసియాక్రీడల్లో వంద పతకాల దిశగా భారత్ దూసుకుపోతోంది. గత క్రీడల లక్ష్యానికి కేవలం ఒక్క పతకం దూరంలో మాత్రమే నిలిచింది.

ఆసియాక్రీడల్లో శతపతకాల దిశగా భారత్!
X

ఆసియాక్రీడల్లో వంద పతకాల దిశగా భారత్ దూసుకుపోతోంది. గత క్రీడల లక్ష్యానికి కేవలం ఒక్క పతకం దూరంలో మాత్రమే నిలిచింది.

ఆసియాక్రీడల చరిత్రలోనే తొలిసారిగా వంద పతకాలు సాధించడానికి భారత్ ఉరకలేస్తోంది. గత క్రీడల లక్ష్యాన్ని అలవోకగా అధిగమించడానికి సిద్ధమయ్యింది.

69 పతకాలతో 4వ స్థానంలో...

హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియాక్రీడల మొదటి 10 రోజుల పోటీలు ముగిసే సమయానికే భారత్ మొత్తం 69 పతకాలతో ..పతకాల పట్టిక 4వ స్థానంలో కొనసాగుతోంది.

జకార్తా వేదికగా 2018లో ముగిసిన 18వ ఆసియాక్రీడల్లో అత్యుత్తమంగా 17 స్వర్ణాలతో సహా 70 పతకాలు సాధించడం ద్వారా భారత్ సరికొత్త రికార్డు నమోదు చేసింది.అయితే..ప్రస్తుత క్రీడల్లో 70 పతకాల రికార్డును అధిగమించడానికి కేవలం 2 పతకాల దూరంలో మాత్రమే నిలిచింది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకాల జోరు..

క్రీడల పదోరోజు పోటీలలో భాగంగాజరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత అథ్లెట్లు మరో రెండు బంగారు పతకాలు సాధించడంతో భారత్ సాధించిన మొత్తం స్వర్ణాలు 15కు చేరాయి. 26 రజత, 28 కాంస్యాలతో సహా భారత్ మొత్తం 69 పతకాలు సాధించింది.

క్రీడలు ముగియటానికి మరో ఐదురోజులపోటీలు మిగిలిఉండడంతో భారత 100 పతకాల లక్ష్యం చేరుకోడం ఏమంత కష్టంకాబోదని భావిస్తున్నారు.

మహిళల 5 వేల మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, మహిళల జావలిన్ త్రోలో అన్ను రాణి భారత్ కు స్వర్ణపతకాలు సాధించి పెట్టారు.

డెకాథ్లాన్ లో తేజస్విని శంకర్, పురుషుల 800 మీటర్ల పరుగులో మహ్మద్ అఫ్జల్ రజత, పురుషుల ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రవేల్ కాంస్య, మహిళల 400 మీటర్ల హర్డల్స్ లో విత్యా రామ్ రాజ్ కాంస్య పతకాలు సాధించారు.

కనోయింగ్ డబుల్ 1000 మీటర్ల విభాగంలో భారత జోడీ అర్జున్ సింగ్- సునీల్ సింగ్ కాంస్య పతకం గెలుచుకొన్నారు.


స్క్వాష్ లో 3 పతకాలు ఖాయం...

స్క్వాష్ పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల సింగిల్స్ లో సౌరవ్ గోశాల్, మిక్సిడ్ డబుల్స్ లో దీపిక పల్లికల్- హరిందర్ పాల్ సింగ్, అభయ్ సింగ్- అనాహతీ సింగ్ జోడీలు సైతం మెడల్ రౌండ్ లో ప్రవేశించారు.

మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగం ఫైనల్స్ కు భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ చేరుకొంది. విలువిద్య కాంపౌడ్ విభాగంలో సైతం భారత్ కు మూడు పతకాలు ఖాయమయ్యాయి.

పురుషుల కాంపౌండ్ గోల్డ్ మెడల్ పోరులో భారత్ కే చెందిన ఓజాస్ ప్రవీణ్, అభిషేక్ వర్మ తలపడనున్నారు. మహిళల ఫైనల్స్ కు జ్యోతి సురేఖ వెన్నం చేరుకొంది.

First Published:  4 Oct 2023 6:00 AM
Next Story