ఆసియా క్రీడలకు 634 మంది సభ్యుల భారత బృందం!
చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 634 మంది సభ్యుల భారీబృందాన్ని కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది. 38 క్రీడాంశాలలో భారత అథ్లెట్లు పతకాల వేటకు దిగనున్నారు
చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 634 మంది సభ్యుల భారీబృందాన్ని కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది. 38 క్రీడాంశాలలో భారత అథ్లెట్లు పతకాల వేటకు దిగనున్నారు.....
కరోనా దెబ్బతో ఏడాది ఆలస్యంగా జరుగనున్న 2022 ఆసియాక్రీడలకు చైనా నగరం హాంగ్జు ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగే ఈ క్రీడల్లో ఆసియాఖండంలోని 45 దేశాలకు పైగా అథ్లెట్లు తలపడనున్నారు.
ఈ క్రీడల్లో భాగంగా జరిగే 38 క్రీడాంశాలలో పాల్గొనటానికి మొత్తం 634 మంది సభ్యుల భారీబృందాన్ని భారత క్రీడామంత్రిత్వశాఖ ఎంపిక చేసింది.
572 నుంచి 634కు పెరిగిన అథ్లెట్లు..
2018లో జకార్తా వేదికగా ముగిసిన ఆసియాక్రీడల్లో 572 మంది అథ్లెట్ల బృందంతో పాల్గొన్న భారత్ ..ప్రస్తుత క్రీడలకు మాత్రం 62మంది అథ్లెట్లను అదనంగా ఎంపిక చేసింది. గత ఏషియాడ్ లో భారత్ 16 స్వర్ణాలతో సహా మొత్తం 70 పతకాలు సాధించింది.
వాస్తవానికి ..ప్రస్తుత ఏషియాడ్ కోసం భారత ఒలింపిక్ సంఘం 850 అథ్లెట్లను సిఫారసు చేయగా..కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం 634 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.
మొత్తం 634మంది సభ్యుల్లో 320 మంది పురుషులు, 314 మంది మహిళలు ఉన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం 2022 అక్టోబర్లో జరగాల్సిన ఈ క్రీడల్ని కరోనా కారణంగా ఏడాదిపాటు వాయిదా వేసి..2023 సెప్టెంబర్ నుంచి రెండువారాలపాటు నిర్వహించడానికి ఆసియా ఒలింపిక్ మండలి రంగం సిద్ధం చేసింది.
క్రికెట్, చెస్, ఫుట్ బాల్ క్రీడల్లోనూ భారత్ పోటీ..
దశాబ్దకాలం విరామం తర్వాత తిరిగి ప్రవేశపెట్టిన క్రికెట్ తో పాటు చదరంగం, ఫుట్ బాల్ క్రీడల్లో సైతం భారత్ పోటీకి దిగుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 65 మంది సభ్యులజట్టుతో పతకాలవేటకు దిగుతోంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో సహా 34 మంది పురుషులు, 31మంది మహిళలు భారత అథ్లెటిక్స్ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఫుట్ బాల్ పురుషుల, మహిళల విభాగాలలో 44 మంది, హాకీ పురుషుల, మహిళల విభాగాలలో 36 మంది, క్రికెట్ పురుషుల , మహిళల విభాగాలలో 30 మంది సభ్యులు భారత్ కు ప్రాతినిథ్యం వహించనున్నారు.
సెయిలింగ్ జట్టులో 33 మంది క్రీడాకారులున్నారు. వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, రగ్బీ, వెయిట్ లిఫ్టింగ్, కురాష్ క్రీడల్లోనూ భారత అథ్లెట్లు పోటీకి దిగనున్నారు.
పురుషుల 65 కిలోల కుస్తీ విభాగంలో భజరంగ్ పూనియాకు సైతం కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది.
భారత చెస్ జట్టులో ప్రఙ్జానంద్...
ఆసియా క్రీడల చెస్ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు పోటీకి దిగనున్నాయి. మహిళల జట్టులో సభ్యురాలిగా ఉన్న డబుల్ ఏషియాడ్ గోల్డ్ మెడలిస్ట్, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే..ద్రోణవల్లి హారిక, ప్రపంచకప్ రన్నరప్ ప్రఙ్జానంద్ భారత్ కు ప్రాతినిథ్యం వహించనున్నారు.
సెప్టెంబర్ 24 నుంచి హాకీ సమరం..
ఆసియాక్రీడల్లో భాగంగా నిర్వహించే హాకీ పురుషుల, మహిళల గ్రూపులీగ్ మ్యాచ్ ల వివరాలను ప్రకటించారు. ఎనిమిదిసార్లు ఆసియాక్రీడల హాకీ గోల్డ్ మెడలిస్ట్ పాకిస్థాన్, మూడుసార్లు స్వర్ణ విజేత భారతజట్లు ఒకే గ్రూపు నుంచి తమ బంగారు వేటను ప్రారంభించనున్నాయి.
గ్రూపు-ఏ లీగ్ లో పాకిస్థాన్, జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్థాన్ జట్లతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 24న తన గ్రూప్ తొలిమ్యాచ్ ను ఉజ్బెకిస్థాన్ తో భారత్ ఆడనుంది. పురుషుల గ్రూప్ - బీ లీగ్ లో దక్షిణ కొరియా, మలేసియా, చైనా, ఒమన్, థాయ్ లాండ్, ఇండోనీసియా పోటీపడతాయి.
మహిళల గ్రూపు- ఏలో భారత్ పోరు..
మహిళల పూల్ -ఏ లో దక్షిణ కొరియా, మలేసియా, హాంకాంగ్, సింగపూర్ జట్లతో భారత్ తలపడనుంది. ఆసియాక్రీడల మహిళల హాకీపోటీలు సెప్టెంబర్ 27న ప్రారంభంకానున్నాయి. మహిళల పూల్ -బీలో జపాన్, చైనా, థాయ్ లాండ్, కజకిస్థాన్, ఇండోనీసియాజట్లు పోటీపడతాయి.
30న పాకిస్థాన్ తో భారత్ పోరు..
పురుషుల గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా సెప్టెంబర్ 30న జరిగే కీలకపోరులో భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టే గ్రూపు విజేతగా నిలువనుంది.
భారతజట్టు సెప్టెంబర్ 26న సింగపూర్, 28న జపాన్ జట్లతో తలపడనుంది. పాక్, జపాన్ జట్ల నుంచే భారత్ కు గట్టిపోటీ ఎదురుకానుంది.
ఆసియాక్రీడల హాకీ పోటీలకు గాంగ్సు కెనాల్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్ అక్టోబర్ 6న, మహిళల స్వర్ణ పతకం పోరును అక్టోబర్ 7న నిర్వహిస్తారు.
భారత్ చివరిసారిగా 2014 ఇంచెన్ ఆసియాక్రీడల్లో హాకీ బంగారు పతకం సాధించగా..పాకిస్థాన్ 2010 గాంగ్జు ఆసియాక్రీడల్లో విజేతగా నిలిచింది. 2018 జకార్తా ఆసియాక్రీడల్లో మాత్రం భారత్, పాక్ జట్లను కంగు తినిపించి..జపాన్ జట్టు బంగారు పతక విజేతగా నిలిచింది.