Telugu Global
Sports

కంగారూ సునామీలో భారత్ గల్లంతు!

ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత బౌలింగ్ లో పసలేదని మరోసారి తేలిపోయింది.

కంగారూ సునామీలో భారత్ గల్లంతు!
X

ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత బౌలింగ్ లో పసలేదని మరోసారి తేలిపోయింది. మొహాలీ టీ-20 పోరులో 208 పరుగుల భారీస్కోరును కాపాడుకోడంలో భారత్ విఫలమయ్యింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా 4 వికెట్ల సూపర్ చేజింగ్ విజయంతో తీన్మార్ సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది...

అనుకున్నంతా జరిగింది. బౌలర్లు మరోసారి భారత్ ను నిలువునా ముంచారు. దుబాయ్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఆసియాకప్ లో పసలేని బౌలింగ్ తో పాక్, శ్రీలంకజట్ల చేతిలో పరాజయాలు పొందిన టాప్ ర్యాంకర్ భారత్ కు...ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో ప్రారంభమైన తీన్మార్ సిరీస్ లోని తొలిపోరులోనూ పరాజయం తప్పలేదు.

మొహాలీలో పరుగుల వెల్లువ!

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ భారత్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య ప్రారంభమైన తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ లో పరుగుల మోత మోగింది. బ్యాట్స్ మన్ స్వర్గధామం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియంలో రెండుజట్ల బ్యాటర్లు కలసి పరుగుల సునామీ సృష్టించారు.

బౌండ్రీల జోరు, సిక్సర్లహోరుతో పసందైన పరుగుల విందు చేసుకొన్నారు. బౌలర్లను ఊచకోత కోత కోయటంలో ఎవరికి వారే సాటిగా నిలిచారు.

సిరీస్ ఈ తొలిపోరులో కంగారూ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక టాస్ నెగ్గి మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

సూర్యా.. పాండ్యా సుడిగాలి బ్యాటింగ్....

రోహిత్- రాహుల్ లతో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్...ప్రారంభ ఓవర్లలోనే కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్ ల వికెట్లు నష్టపోయింది. రోహిత్ 11, విరాట్ 2 పరుగుల స్కోర్లకే వెనుదిరిగారు. 35 పరుగులకే రెండుటాపార్డర్ వికెట్లు కోల్పోయిన భారత్ ను..ఓపెనర్ రాహుల్, రెండోడౌన్ సూర్యకుమార్ యాదవ్ కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు.

మూడో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యంతో స్కోరుబోర్డును పరుగులెత్తించారు. రాహుల్ 35 బాల్స్ లో 4 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 55 పరుగులకు అవుటయ్యాడు. మరోవైపు మిస్టర్360 హిట్టర్ సూర్యకుమార్ కేవలం 25 బాల్స్ లోనే 2 బౌండ్రీలు, 4 సిక్సర్లతో చెలరేగిపోయాడు. 46 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

అయితే...రాహుల్ అవుటైన వెంటనే క్రీజులోకి అడుగుపెట్టిన సూపర్ హిట్టర్ హార్ధిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్ తో వీరవిహారం చేశాడు. కేవలం 30 బాల్స్ లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్ల తో 71 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. బారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

కంగారూ బౌలర్లలో ఎలిస్ కు 3, హేజిల్ వుడ్ కు 2 ,గ్రీన్ కు 1 వికెట్ దక్కాయి.

గ్రీన్, వేడ్ ఫటాపట్...

భారత్ భారీ స్కోరును చేధించడం ఆస్ట్ర్రేలియాకు అంతతేలిక కాదని అందరూ అనుకొన్నారు. అయితే ఆల్ రౌండర్ కమ్ ఓపెనర్ గ్రీన్ 30 బాల్స్ లోనే 8 బౌండ్రీలు 4 సిక్సర్లతో కళ్లు చెదిరే హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ ఫించ్ 22, మాజీ కెప్టెన్ స్మిత్ 35 పరుగులు సాధించగా...చివర్లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మాథ్యూ వేడ్..21 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో ఆస్ట్ర్రేలియా మరో 4 బంతులు మిగిలిఉండగానే 6 వికెట్ల నష్టానికి 211 పరుగులతో సంచలన విజయం సాధించింది. భారత తురుపుముక్కలు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. భువీ ఓ ఓవర్లో 15, హర్షల్ పటేల్ ఓవర్లో 22 పరుగులను కంగారూలు రాబట్టుకొన్నారు. భారత ప్రధానబౌలర్లు భువీ 52, చహాల్ 42, హర్షల్ 49 పరుగులు సమర్పించుకొనన్నారు. లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక్కడే తన కోటా 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్2 , చహాల్ 1 వికెట్ పడగొట్టారు.

భారత్ ప్రత్యర్థిగా టీ-20 ఫార్మాట్లో ఆస్ట్ర్రేలియాకు ఇదే అతిపెద్ద చేజింగ్ విజయం కావడం విశేషం. అంతేకాదు భారత్ తో తలపడిన మొత్తం 24 టీ-20 మ్యాచ్ ల్లో ఇది 10వ విజయం.

సిరీస్ లోని రెండోమ్యాచ్ నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 23న జరుగుతుంది.

First Published:  21 Sept 2022 4:29 AM GMT
Next Story