మహిళా టీ-20 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్!
2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు భారత్ చేరుకొంది. గ్రూప్-2 ఆఖరి లీగ్ పోటీలో ఐర్లాండ్ పై 5 పరుగుల విజయంతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు భారత్ చేరుకొంది. గ్రూప్-2 ఆఖరి లీగ్ పోటీలో ఐర్లాండ్ పై 5 పరుగుల విజయంతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు రన్నరప్ భారత్ చేరుకొంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లతో కూడిన గ్రూపు-2 లీగ్ లో భారత్ నెగ్గితీరాల్సిన తన ఆఖరిరౌండ్ పోరులో ఐర్లాండ్ పై డక్ వర్త్- లూయిస్ విధానం ప్రకారం 5 పరుగులతో విజేతగా నిలిచింది.
ఇంగ్లండ్ అత్యధిక విజయాలతో గ్రూపు టాపర్ గా నిలువగా భారత్ మూడు ( పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ లపై ) విజయాలు, ఓ ( ఇంగ్లండ్ చేతిలో )ఓటమి రికార్డుతో
6 పాయింట్లు సాధించడం ద్వారా రెండోస్థానంలో నిలవడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.
ఆఖరాటలో స్మృతి మందన జోరు..
మూడోరౌండ్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమితో కంగు తిన్న భారత్..సెమీస్ చేరాలంటే తన ఆఖరిరౌండ్ పోరులో ఐర్లాండ్ ను ఓడించి తీరాల్సి వచ్చింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఈ కీలక సమరంలో ఓపెనింగ్ జోడీ స్మృతి మందన- షెఫాలీ వర్మ ఎక్కడలేని ఓర్పుతో ఆడి చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.
స్మృతి మందన, షెఫాలీ వర్మ(24) ఐర్లాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.
స్మృతి మందన ప్రారంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడింది. ఇన్నింగ్స్ కుదురుగా సాగుతున్న తరుణంలో డెల్నె బౌలింగ్‌లో షెఫాలీ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(8)తో కలిసి మందన ఎదురుదాడికి దిగింది. అయితే ఒక్క పరుగు తేడాతో హర్మన్, రిచా ఘోష్(0) వికెట్లు నష్టపోయినా.. స్మృతి అదేజోరు కొనసాగించింది. స్మృతి తన టీ-20 కెరియర్ లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేయగలిగింది.
స్మృతి మందన 87 పరుగులు సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగుల స్కోరు నమోదు చేసింది. సమాధానంగా 156 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఐర్లాండ్ కు వానదెబ్బ తగిలింది. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 54/2 స్కోరు చేసింది. దీంతో డక్ వర్త్- లూయిస్ విధానం ప్రకారం భారత్ 5 పరుగుల తో పైచేయి సాధించడం ద్వారా విజయాన్ని అందుకొంది. భారత ఓపెనర్ స్మృతి మందనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత కెప్టెన్ ప్రపంచ రికార్డు...
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈ కీలకమ్యాచ్ లో కేవలం 8 పరుగుల స్కోరుకే అవుటైనా..మహిళా టీ-20 చరిత్రలో 150 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుజీ బేట్స్ 143, భారత ఓపెనర్ స్మృతి మందన 115 మ్యాచ్ లతో హర్మన్ తర్వాత స్థానాలలో నిలిచారు.
భారత పురుషుల టీ-20లో సైతం ఇప్పటి వరకూ ఏ ఒక్క ఆటగాడు 150 మ్యాచ్ ల రికార్డును చేరుకోలేదు. రోహిత్ శర్మ 148 టీ-20 మ్యాచ్ లు మాత్రమే ఆడగలిగాడు.
సెమీస్ లో ఆస్ట్ర్రేలియా గండం...
ప్రస్తుత ప్రపంచకప్ తో కలుపుకొని..వరుసగా మూడోసారి, మొత్తం మీద నాలుగోసారి సెమీఫైనల్స్ చేరిన భారత్...ఫైనల్లో చోటు కోసం ప్రపంచ నంబర్ వన్, మూడుసార్లు విజేత ఆస్ట్ర్రేలియాతో తలపడాల్సి ఉంది. గ్రూప్-1 నుంచి ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, గ్రూప్ -2 నుంచి ఇంగ్లండ్, భారత్ సెమీస్ చేరుకోగలిగాయి. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో ఆస్ట్ర్రేలియాతో భారత్, ఇంగ్లండ్ తో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
గత ఏడు ప్రపంచకప్ టోర్నీలలో భారత్ మూడుసార్లు సెమీఫైనల్స్ ( 2009, 2010, 2016 ), ఓసారి (2020 ) ఫైనల్స్ కు అర్హత సంపాదించగలిగింది.
ఫిబ్రవరి 23న తొలిసెమీఫైనల్స్, 24న రెండో సెమీఫైనల్స్, 26న టైటిల్ సమరం నిర్వహిస్తారు.