Telugu Global
Sports

ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ సెమీస్ లో భారత్!

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మహిళల హాకీ సెమీఫైనల్స్ కు భారత్ అలవోకగా చేరుకొంది. వరుసగా 5వ విజయంతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ సెమీస్ లో భారత్!
X

ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ సెమీస్ లో భారత్!

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మహిళల హాకీ సెమీఫైనల్స్ కు భారత్ అలవోకగా చేరుకొంది. వరుసగా 5వ విజయంతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

రాంచీ వేదికగా జరుగుతున్న 2023-ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మహిళల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా ఐదో విజయంతో అజేయంగా నిలిచింది. దక్షిణ కొరియాను 5-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్స్ లో ప్రవేశించింది.

ఏకపక్షంగా ముగిసిన పోరు...

కొరియాతో భారత్ పోటీ హోరాహోరీగా సాగుతుందని భావిస్తే..చివరకు ఏకపక్షంగా ముగిసింది. భారత్ కు దక్షిణ కొరియా ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది.

ఆట మొదటి క్వార్టర్ లోనే భారత్ కు సలీమా టీటీ తొలిగోలుతో బోణీ కొట్టింది. ఆట 6వ నిముషంలో, 36వ నిముషంలో సలీమా గోల్స్ సాధిస్తే.. 36వ నిముషంలోనే నవనీత్ కౌర్ పెనాల్టీకార్నర్ గోలుతో భారత్ ఆధిక్యాన్ని 3-0కి పెంచింది. ఆట 49వ నిముషంలో వెటరన్ వందన కటారియా, 60వ నిముషంలో నేహా ఫీల్డ్ గోల్స్ తో భారత్ భారీవిజయాన్ని పూర్తి చేశారు.

15 పాయింట్లతో భారత్ టాప్...

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా తొలిరౌండ్లో థాయ్ లాండ్ ను 7-1 గోల్స్ తో చిత్తు చేసిన భారత్ రెండో రౌండ్లో మలేసియాపై 5-0తో విజయం సాధించింది. మూడోరౌండ్లో చైనా పై 2-1 గోల్స్ తో నెగ్గడం ద్వారా ఆసియాక్రీడల సెమీఫైనల్స్ ఓటమికి బదులుతీర్చుకొంది. నాలుగోరౌండ్లో జపాన్ ను 2-1తో అధిగమించిన భారత్ 5వ రౌండ్ లో కొరియాను సైతం 5-0 గోల్స్ తోనే చిత్తు చేయగలిగింది.

లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్ శనివారం జరిగే సెమీస్ పోరులో దక్షిణ కొరియాతోనే మరోసారి తలపడాల్సి ఉంది. రెండోసెమీఫైనల్లో చైనాతో జపాన్ ఢీ కొంటుంది.

2016లో ఆసియా చాంపియన్స్ ట్రోఫీని తొలిసారిగా గెలుచుకొన్న భారత్ 2013, 2018 టోర్నీలలో రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

గత నెలలో ముగిసిన హాంగ్జు ఆసియాక్రీడల్లో భారత్ కాంస్య పతకం మాత్రమే గెలుచుకొంది. సెమీఫైనల్లో 0-4తో చైనా చేతిలో ఓటమి పొందిన భారత్ చివరకు కాంస్య పతకం పోరులో తలపడాల్సి వచ్చింది.

First Published:  3 Nov 2023 12:13 PM IST
Next Story