Telugu Global
Sports

శాఫ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్లో భారత్!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ 13వసారి చేరుకొంది. పెనాల్టీ షూటౌట్లో లెబనాన్ ను అధిగమించింది.

శాఫ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్లో భారత్!
X

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ 13వసారి చేరుకొంది. పెనాల్టీ షూటౌట్లో లెబనాన్ ను అధిగమించింది.

భారత్ లోని బెంగళూరు వేదికగా జరుగుతున్న 2023 శాఫ్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు ఎనిమిదిసార్లు విజేత భారత్ చేరుకొంది. శ్రీకంఠీరవ స్టేడియంలో గత రెండువారాలుగా సాగుతున్న ఈ టోర్నీ నాకౌట్ సెమీస్ పోరులో భారత్ అజేయంగా నిలుస్తూ టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

ఫైనల్లో చోటు కోసం లెబనాన్ తో జరిగిన రెండో సెమీఫైనల్స్ లో భారత్ గట్టి పోటీ ఎదుర్కొని పెనాల్టీషూటౌట్ ద్వారా 4-2 గోల్స్ తో విజేతగా నిలిచింది.

హోరాహోరీగా పోరు....

ఆట నిర్ణితసమయంలో ఏ జట్టూ గోలు చేయలేకపోయింది. ఆట మొదటి భాగంలో లెబనాన్ దే పైచేయిగా నిలిచింది. రెండుసార్లు గోల్స్ చేసే అవకాశాలు వచ్చినా లెబెనాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.

ఆట రెండోభాగంలో పుంజుకొన్న భారత్ కు సైతం రెండుసార్లు గోల్స్ చేసే అవకాశం లభించినా కెప్టెన్ సునీల్ ఛెత్రీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ఆట 93. 95 నిముషాలలో సునీల్ కు గోల్స్ సాధించే అవకాశం వచ్చింది. అయితే ..సునీల్ షాట్లు గతి తప్పాయి.

మొత్తం 120 నిముషాల పోరులో స్కోరు 0-0గా మిగలడంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు.

భారత గోల్ కీపర్ గురుప్రీత్ షో....

పెనాల్టీ షూటౌట్లో భారత గోల్ కీపర్ గురుప్రీత్ సంధు తన సత్తా చాటుకొన్నాడు. లెబనాన్ కెప్టెన్ హసన్ మాటౌక్ పెనాల్టీని అడ్డుకొని భారత విజయానికి మార్గం సుగమం చేశాడు. ఖలీల్ బదేర్ కొట్టిన కిక్ క్రాస్ బార్ ను తాకి బయటికో పోడంతో..లెబనాన్ రెండు పెనాల్టీలను చేజార్చుకొన్నట్లయ్యింది.

మరోవైపు..భారత్ తన 4 పెనాల్టీలను గోల్సుగా మలచుకోగలిగింది. సునీల్ ఛెత్రీ,అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత్ సింగ్ గోల్స్ సాధించారు.

1993లో ప్రారంభమైన శాఫ్ కప్ సాకర్ టోర్నీలో భారత్ 13వసారి ఫైనల్ చేరుకోడం ద్వారా తన రికార్డును తానే అధిగమించింది. వరుసగా తొమ్మిదిసార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టు ఘనతను సైతం భారత్ దక్కించుకొంది.

2021 టోర్నీ వరకూ 12 ఫైనల్స్ ఆడిన భారత్ 8సార్లు విజేతగా నిలిచింది. మరో నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.2003 శాఫ్ కప్ లో మాత్రమే భారత్ ఫైనల్స్ చేరుకోడంలో విఫలమయ్యింది.

కువైట్ తో భారత్ టైటిల్ సమరం...

జులై 4న బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో కువైట్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో కువైట్ తో జరిగిన మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించిన భారత్ మరోసారి అదేజట్టుతో తలపడాల్సి వచ్చింది.

లీగ్ దశలో భారత్ ఆడిన మొత్తం మూడురౌండ్ల మ్యాచ్ ల్లోనూ 5 గోల్స్ సాధించిన కెప్టెన్ సునీల్ ఛెత్రీ పైనే భారత టైటిల్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ ఫుట్ బాల్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రస్తుతం 100వ ర్యాంక్ లో కొనసాగుతున్న భారత్ 9వసారి శాఫ్ కప్ ను అందుకోగలిగితే..తన రికార్డును తానే మరోసారి తిరగరాసినట్లు అవుతుంది.

First Published:  2 July 2023 3:00 PM IST
Next Story