లంకపై గెలుపుతో ఆసియాకప్ ఫైనల్లో భారత్!
2023 -వన్డే ఆసియాకప్ ఫైనల్స్ కు భారత్ చేరుకొంది. సూపర్ -4 రౌండ్ లోస్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ లో ఆతిథ్య శ్రీలంకను భారత్ 41 పరుగులతో చిత్తు చేసింది.
2023 -వన్డే ఆసియాకప్ ఫైనల్స్ కు భారత్ చేరుకొంది. సూపర్ -4 రౌండ్ లోస్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ లో ఆతిథ్య శ్రీలంకను భారత్ 41 పరుగులతో చిత్తు చేసింది.
కొలంబో వేదికగా జరుగుతున్న 2023- ఆసియాకప్ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ దూసుకెళ్లింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న సూపర్ -4 రెండోరౌండ్ మ్యాచ్ లో సైతం భారత్ విజేతగా నిలవడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది.
పదోసారి టైటిల్ రౌండ్లో భారత్...
ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్న ప్రస్తుత ఆసియాకప్ సూపర్ -4 తొలిరౌండ్లో పాకిస్థాన్ ను 228 పరుగుల భారీతేడాతో చిత్తు చేయడం ద్వారా బోణీ కొట్టిన భారత్...ఆతిథ్య శ్రీలంకతో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో 41 పరుగులతో విజేతగా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో 4 పాయింట్లు సాధించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది.
ఆసియాకప్ చరిత్రలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన భారతజట్టు టైటిల్ రౌండ్ చేరడం ఇది పదోసారి.
బౌలింగ్ బలంతో నెగ్గిన రోహిత్ సేన...
గత ఆసియాకప్ సూపర్-4 రౌండ్ నుంచే నిష్క్ర్రమించిన భారత్..ప్రస్తుత టోర్నీలో మాత్రం టాప్ గేర్ లో దూసుకుపోతోంది. డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకతో జరిగిన స్పిన్ వార్ లో భారత్ ను బౌలర్లే విజేతగా నిలిపారు.
ఈ కీలకమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటయ్యింది.ఒకదశలో 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగుల స్కోరు సాధించిన భారత ఆ తర్వాత...శ్రీలంక స్పిన్ జోడీ వెల్లాలగే, అసలంకల స్పిన్ మాయలో చిక్కుకొని కేవలం 213 పరుగులకే పరిమితమయ్యింది.
ఆలౌట్లలో భారత్ అరుదైన రికార్డు...
పాకిస్థాన్ తో జరిగిన లీగ్ పోరులో కేవలం ఫాస్ట్ బౌలర్లకే 10 కి 10 వికెట్లు అప్పజెప్పిన భారత్..రెండోమ్యాచ్ లో శ్రీలంక స్పిన్నర్లకు మొత్తం వికెట్లు కోల్పోడం విశేషం.
భారత టాపార్డర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వన్డేలలో రోహిత్ కు ఇది 51వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
పాక్ తో మ్యాచ్ లో సెంచరీహీరో విరాట్ కొహ్లీ 3, శుభ్ మన్ గిల్ 19, ఇషాన్ కిషన్ 33, కెఎల్ రాహుల్ 39, లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ 26 పరుగులు సాధించడంతో భారత్ 213 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు సాధించగలిగింది.
శ్రీలంక స్పిన్నర్లలో వెల్లలాగే 10 ఓవర్లలో 40 పరుగులిచ్చి 5 వికెట్లు, అసలంక 4 వికెట్లు, తీక్షణ 1 వికెట్ పడగొట్టారు.
భారత బౌలర్ల ఎదురుదాడి...
మ్యాచ్ నెగ్గాలంటే 214 పరుగులు చేయాల్సిన శ్రీలంకను భారత పేసర్లు, స్పిన్నర్లు కలసి కుప్పకూల్చారు. కేవలం 41.3 ఓవర్లలోనే శ్రీలంక 172 పరుగులకే ఆలౌటయ్యింది.
శ్రీలంక బ్యాటర్లలో ధనుంజయ డి సిల్వా 41 పరుగులకు అవుట్ కాగా..కుర్ర ఆల్ రౌండర్ వెల్లలాగే 42 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా చెరో 2 వికెట్లు, సిరాజ్, పాండ్యా చెరో వికెట్ , చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 9.3 ఓవర్లలో 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.
కుల్దీప్ ఈ క్రమంలో 150 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.
వన్డే చరిత్రలోనే అత్యంత వేగంగా 150 వికెట్ల రికార్డు చేరిన నాలుగో బౌలర్ గా కుల్దీప్ రికార్డుల్లో చేరాడు. శ్రీలంక స్పిన్ ఆల్ రౌండర్ వెల్లలాగేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆసియాకప్ చరిత్రలోనే 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 42 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన తొలి ఆల్ రౌండర్ గా వెల్లలాగే నిలిచాడు.
శ్రీలంక వరుస విజయాలకు తెర...
వన్డే క్రికెట్లో ఆడిన గత 13 మ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చిన శ్రీలంక విజయపరంపరకు 14వ మ్యాచ్ లో భారత్ గండి కొట్టింది. 214 పరుగుల అతితక్కువ లక్ష్యాన్ని భారత్ కాపాడుకోగలిగింది.
పాకిస్థాన్ తో జరిగిన హైస్కోరింగ్ తొలిమ్యాచ్ లో బ్యాటర్లు విజయం అందిస్తే..లోస్కోరింగ్ రెండోమ్యాచ్ లో బౌలర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు.
సూపర్ -4 రౌండ్ తన ఆఖరిమ్యాచ్ లో సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్ తో భారత్ పోటీపడాల్సి ఉంది. ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్..బంగ్లాతో పోరులో సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్ళకు తుదిజట్టులో అవకాశం ఇచ్చే యోచనలో ఉంది.