కామన్వెల్త్ గేమ్స్ 4వ స్థానంలో భారత్..
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన భారత అథ్లెట్లుగా నిలిచిన ఇద్దరూ తెలుగువారే కావడం విశేషం. గత ఐదు కామన్వెల్త్ గేమ్స్ లో క్రమం తప్పకుండా పాల్గొంటూ వచ్చిన దిగ్గజ టేబుల్ టెన్నిస్ ఆటగాడు
భారత్.. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. అలనాటి బ్రిటీష్ పాలిత సమాఖ్యలో అతిపెద్ద దేశం. అయితే..గత ఏడుదశాబ్దాలుగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టిక మొదటి రెండుస్థానాలలో భారత్ చోటు సంపాదించలేకపోతోంది. బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టిక నాలుగోస్థానంలో నిలవడం ద్వారా భారత్ ఊపిరి పీల్చుకొంది. కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తం 72 దేశాలజట్లు పాల్గొంటే 44 దేశాలు మాత్రమే ఏదో ఒక పతకం నెగ్గి పతకాల పట్టికలో చోటు సంపాదించడం ద్వారా తమ ఉనికిని కాపాడుకోగలిగాయి.
16 క్రీడల్లో 22 స్వర్ణ పతకాలు..
బర్మింగ్ హామ్ గేమ్స్ లో భాగంగా మొత్తం 19 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తే..భారత్ కు చెందిన 215 మంది అథ్లెట్ల బృందం 16 క్రీడాంశాల బరిలో నిలిచింది. భారత బృందంలో 108 మంది పురుషులు, 107 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. కుస్తీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో సత్తా చాటుకోవడం ద్వారా భారత్ మొత్తం 61 పతకాలు సాధించడం ద్వారా నాలుగో స్థానం దక్కించుకోగలిగింది. ఇందులో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ( 67 స్వర్ణ- 57 రజత- 54 కాంస్య-మొత్తం 178 ), ఇంగ్లండ్ (57-66-53 -76 ), కెనడా ( 26-32-34-92 ), న్యూజిలాండ్ ( 20-12 -17 -49 ) మొదటి ఐదు అగ్రశ్రేణి జట్లుగా నిలిచాయి.
3 నుంచి 4వ స్థానానికి..
నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్ లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో 26 స్వర్ణాలతో సహా మొత్తం 66 పతకాలు సాధించడం ద్వారా మూడో స్థానంలో నిలిచిన భారత్ ప్రస్తుత క్రీడల్లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. బంగారు పతకాల సంఖ్య 26 నుంచి 22కి పడిపోయింది. దీనికి కారణం..భారత్ అత్యధిక పతకాలు గెలుచుకొనే వీలున్న షూటింగ్, విలు విద్య లాంటి క్రీడల్ని బర్మింగ్ హామ్ క్రీడల జాబితా నుంచి తొలగించారు. గత కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ సాధించిన మొత్తం 66 పతకాలలో..షూటింగ్ ద్వారా 16, కుస్తీలో 12, వెయిట్ లిఫ్టింగ్ లో 9, బాక్సింగ్ లో 9, టేబుల్ టెన్నిస్ లో 6, బ్యాడ్మింటన్ లో 6 ఉన్నాయి.
సింధు పేరుతో 200వ స్వర్ణం..
1930 నుంచి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తుంటే.. భారత్ 1934 నుంచి మాత్రమే పాల్గొంటూవస్తోంది. 1934లో భారత మల్లయోధుడు రషీద్ అన్వర్ దేశానికి తొలి పతకాన్ని (కాంస్యాన్ని) అందించాడు. అదే భారత్ సాధించిన తొలి కామన్వెల్త్ గేమ్స్ పతకం గా రికార్డుల్లో నమోదయ్యింది. అయితే..కాంస్య పతకం నుంచి బంగారు పతకం సాధించడానికి భారత్ కు 24 సంవత్సరాల సమయం పట్టింది. 1958లో జరిగిన కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్‌లో దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్.. దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. అప్పట్నుంచి భారత్ ప్రతి కామన్వెల్త్ గేమ్స్ లో తన బంగారు పతకాల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ ఆఖరిరోజు పోటీల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సింధు సాధించిన బంగారు పతకం.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలుచుకొన్న 200వ స్వర్ణంగా నమోదయ్యింది. 2022 కామన్వెల్త్ క్రీడలు ప్రారంభానికి ముందు భారత్.. 181 స్వర్ణాలతో ఉంది. బర్మింగ్‌హామ్ గేమ్స్ లో భారత అథ్లెట్లు మొత్తం 22 స్వర్ణాలు సాధించారు. సింధు గెలిచిన స్వర్ణం 19వది కాగా.. భారత్ బంగారు పతకాల సంఖ్య 200 కి చేరుకొంది.
ఓవరాల్ గా నాలుగో స్థానంలో భారత్..
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో నాలుగో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది. 1934 నుంచి 2022 వరకూ జరిగిన క్రీడల్లో భారత్ మొత్తం 564 పతకాలు సాధించింది. ఇందులో 203 స్వర్ణ, 189 రజత, 172 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది.
శరత్ కమల్ 13, సింధు 5 పతకాలు..
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన భారత అథ్లెట్లుగా నిలిచిన ఇద్దరూ తెలుగువారే కావడం విశేషం. గత ఐదు కామన్వెల్త్ గేమ్స్ లో క్రమం తప్పకుండా పాల్గొంటూ వచ్చిన దిగ్గజ టేబుల్ టెన్నిస్ ఆటగాడు, 40 సంవత్సరాల ఆచంట శరత్ కమల్ 13 పతకాలతో అత్యధిక పతకాలు సాధించిన మొనగాడిగా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో 27 సంవత్సరాల పీవీ సింధు గత పుష్కరకాలంలో మూడు కామన్వెల్త్ గేమ్స్ ( 2014, 2018, 2022 ) లో పాల్గొనడం ద్వారా రెండు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 5 పతకాలు గెలుచుకొంది. ఇందులో ..2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళ సింగిల్స్ కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్ మహిళలసింగిల్స్ రజతం, 2018 గోల్డ్ కోస్ట్ మిక్సిడ్ టీమ్ స్వర్ణం, 2022 బర్మింగ్‌హామ్ మిక్సిడ్ టీమ్ రజతం, 2022 బర్మింగ్‌హామ్ మహిళల సింగిల్స్ స్వర్ణం ఉన్నాయి.