Telugu Global
Sports

బంగ్లాతో నేడు భారత్ డూ ఆర్ డై వన్డే!

బంగ్లాదేశ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లోని కీలక రెండో వన్డే భారత్ కు డూ ఆర్ డై గా మారింది

బంగ్లాతో నేడు భారత్ డూ ఆర్ డై వన్డే!
X

బంగ్లాదేశ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లోని కీలక రెండో వన్డే భారత్ కు డూ ఆర్ డై గా మారింది. సిరీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ పోరులో భారత్ ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

వన్డే క్రికెట్లో నాలుగోర్యాంకర్ , ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ ...బంగ్లాగడ్డపై అతిపెద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని తొలివన్డే ఓటమితో భారత్ రగిలిపోతోంది.

ఢాకాలోని మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా జరిగే రెండోవన్డేలో విజయమలక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. మీర్పూర్ స్లో పిచ్ పైన మరింత ఆచితూచి ఆడాలన్న పట్టుదలతో ఉంది.

తుదిజట్టులో ఉమ్రాన్, అక్షర్ పటేల్..

లోస్కోరింగ్ పోరుగా సాగిన తొలివన్డేలో భారత్ తుదివరకూ పోరాడి ఒక వికెట్ ఓటమితో నిరాశకు గురయ్యింది. ఆఖరి వికెట్ ను పడగొట్టడంలో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.ఈ నేపథ్యంలో రెండోవన్డేకి తుదిజట్టులో రెండుమార్పులు చేసే అవకాశం ఉంది. షాబాజ్ అహ్మద్ కు బదులుగా అక్షర్ పటేల్, కుల్దీప్ సేన్ స్థానంలో మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పోటీకి దిగే అవకాశం ఉంది.

భారీస్కోర్లకు టాపార్డర్ గురి..

తొలివన్డేలో తక్కువ స్కోర్లకే వెనుదిరిగిన ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్..భారీస్కోర్లకు గురిపెట్టారు. బంగ్లా బౌలర్ల పనిపట్టాలన్న కసితో ఉన్నారు. మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాహుల్ మరోసారి కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

మరోవైపు..ఆతిథ్య బంగ్లాదేశ్ కు స్వదేశీ సిరీస్ ల్లో 2016 తర్వాత నుంచి ఎదురేలేకుండా పోయింది. జింబాబ్వే చేతిలో ఓడినా..వెస్టిండీస్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లతో జరిగిన సిరీస్ ల్లో అలవోక విజయాలు సాధించిన జోరుతో భారత్ తో తలపడుతోంది.

తొలివన్డేలో భారత్ పై సంచలన విజయం సాధించిన జోరునే రెండోవన్డేలో సైతం కొనసాగించడం ద్వారా సిరీస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బంగ్లా ఉంది. భారత్ ప్రత్యర్థిగా ఆడిన గత 37 వన్డేలలో బంగ్లాకు కేవలం 7 విజయాలు మాత్రమే ఉన్నాయి.

చేజింగ్ జట్టుకే విజయావకాశాలు..

మీర్పూర్ స్టేడియం వేదికగా జరిగే వన్డేలలో చేజింగ్ కు దిగినజట్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నాయి. ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే వరకూ జరిగిన 114 మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగిన జట్లే 60సార్లు విజయాన్ని సొంతం చేసుకోగలిగాయి. తొలివన్డేలో సైతం చేజింగ్ కు దిగిన బంగ్లాజట్టే విజేతగా నిలిచింది.

మరోసారి టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గినజట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ఖాయమని చెప్పక తప్పదు.

గతంలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సైతం ధోనీ నాయకత్వంలో భారత్ కు 1-2తో పరాజయం తప్పలేదు. ప్రస్తుత సిరీస్ లోని మిగిలిన రెండువన్డేలలో భారత్ నెగ్గడం ద్వారా బంగ్లాగడ్డపై తొలివన్డే సిరీస్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది.

భారత కాలమానం ప్రకారం ఉదయం 11-30 గంటలకు ప్రస్తుత సిరీస్ లోని కీలక రెండోవన్డే ప్రారంభంకానుంది. బంగ్లాకు చెలగాటం..భారత్ కు సిరీస్ సంకటంగా మారినఈపోరు ఏ రేంజ్ లో సాగుతుందన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  7 Dec 2022 10:41 AM IST
Next Story