ఆసియా క్రీడల ఫుట్‌బాల్‌లో భారత్ బోణీ!
ఆసియా క్రీడల ఫుట్‌బాల్ పురుషుల గ్రూప్ లీగ్‌లో మాజీ చాంపియన్ భారత్ తొలి విజయంతో ప్రీ- క్వార్టర్ ఫైనల్స్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది. టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలో సైతం భారత్ తొలి గెలుపు నమోదు చేసింది.
చైనాలోని హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల టీమ్ అంశాలలో భారత జట్లు విజయాలు నమోదు చేశాయి. పురుషుల ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ గ్రూప్ మ్యాచ్‌ల్లో భారత జట్లు తొలి విజయాలు సాధించాయి.
కెప్టెన్ పెనాల్టీతో భారత్ గెలుపు....
ఆతిథ్య చైనా, భారత్, బంగ్లాదేశ్, మయన్మార్ జట్లతో కూడిన పురుషుల గ్రూప్ - ఏ లీగ్‌లో భారత్ తన అదృష్టం పరీక్షించుకొంటోంది. చైనాతో జరిగిన తొలి రౌండ్ పోరులో 1-5 గోల్స్ తో పరాజయం చవిచూసిన భారత్...కీలక రెండో రౌండ్లో మాత్రం బంగ్లాదేశ్‌ను అధిగమించగలిగింది.
హాంగ్జు షియావోషాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సెంటర్ సాకర్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో హోరాహోరీగా సాగిన పోరులో భారత్‌కు లభించిన పెనాల్టీని ఆట 82వ నిమిషంలో కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌గా మలిచి కీలక విజయం అందించాడు. భారత జట్టు సభ్యులు హాంగ్జు చేరిన వెంటనే తగిన విశ్రాంతి లేకుండా తమ తొలి రౌండ్ మ్యాచ్‌ను ఆతిథ్య చైనాతోనే ఆడాల్సి వచ్చింది.
భారత్ తన ఆఖరి రౌండ్ పోరులో మయన్మార్‌తో పోటీని డ్రాగా ముగించినా లేక విజయం నమోదు చేసినా ప్రీ- క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరుకోగలుగుతుంది. ఆదివారం మయన్మార్‌తో జరిగే ఆఖరి రౌండ్ పోటీ తమకు కీలకమని, జట్టులోని ఆటగాళ్లందరికీ తగిన విశ్రాంతి, సాధన చేయటానికి సమయం ఉంటాయని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి చెప్పాడు.
24 జట్లు, ఆరు గ్రూపులు...
ఫుట్‌బాల్ పురుషుల విభాగంలో తలపడుతున్న మొత్తం 24 జట్లను ఆరు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాలు సాధించిన జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సి ఉంది. మొత్తం ఆరు జట్లలోని నాలుగు అత్యుత్తమ మూడో స్థానం సాధించిన జట్లకు సైతం క్వార్టర్స్ లో చోటు కల్పిస్తారు. పురుషుల గ్రూపు-ఏ నుంచి చైనా, భారత జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రెండు సార్లు ఏషియాడ్ విజేత భారత్....
భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆసియా క్రీడల్లో రెండు సార్లు బంగారు పతకం సాధించిన రికార్డు ఉంది. 1951లో తొలిసారిగా నిర్వహించిన ఆసియా క్రీడల తొలి పోటీల ఫుట్‌బాల్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు తిరిగి 1962 గేమ్స్ లో సైతం బంగారు పతకం సంపాదించింది. 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి భారత జట్టు ఆసియా క్రీడల ఫుట్‌బాల్ బరిలో నిలిచింది.
2002 ఆసియా క్రీడల నుంచి 23 సంవత్సరాల లోపు వయసున్నవారికి మాత్రమే ఫుట్‌బాల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. అయితే.. గతేడాది జరగాల్సిన 2022 ఆసియా క్రీడలు కరోన దెబ్బతో ఏడాది వాయిదా పడటంతో.. ప్రస్తుత ఆసియా క్రీడల్లో 23 సంవత్సరాలు పైబడిన ముగ్గురు ఆటగాళ్లకు ఆడే అవకాశం ఇచ్చారు. దీంతో సునీల్ ఛెత్రి, గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు, డిఫెండర్ సందేశ్ జింగాన్‌లకు ఆసియా క్రీడల్లో పాల్గోనే అవకాశం దక్కింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినహా మిగిలిన వారంతా 23 సంవత్సరాలలోపు వారై మాత్రమే ఉండాలి.
మహిళల గ్రూప్ - బీ లీగ్ లో థాయ్ లాండ్, చైనీస్ తైపీ జట్లతో భారత జట్టు పోటీపడనుంది.
టీటీలో భారత్ అలవోక గెలుపు....
టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ లీగ్ తొలి రౌండ్ పోరులో భారత్ 3-0తో యెమన్‌ను చిత్తు చేసింది. ప్రపంచ మేటి ప్లేయర్లు శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టుకు యెమన్ ఆటగాళ్లు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. భారత ఆటగాళ్లు వరుస గేమ్‌ల విజయాలు నమోదు చేశారు.
సింగిల్స్ తొలి పోరులో భారత స్టార్ ప్లేయర్ సత్యన్ కేవలం 14 నిమిషాలలోనే 11- 3, 11-2, 11-6తో అలీ ఒమార్ అహ్మద్‌ను చిత్తు చేశాడు. రెండో సింగిల్స్ లో భారత వెటరన్ స్టార్, 41 సంవత్సరాల శరత్ కమల్ 11-3స 11-4, 11-6తో ఇబ్రహీం అబ్దుల్ హకీమ్ మహ్మద్ గుర్బాన్ ను, భారత టాప్ ర్యాంక్ ప్లేయర్ హర్మీత్ దేశాయ్ 11-1, 11-1, 11-7తో అహ్మద్ అలీ అల్దుబానీని ఓడించారు. దీంతో భారత జట్టు 3-0 విజయంతో శుభారంభం చేయగలిగింది. గ్రూప్ రెండో రౌండ్లో సింగపూర్‌తో భారత్ తలపడనుంది.
19వ ఆసియా క్రీడలు అధికారికంగా సెప్టెంబర్ 23న హాంగ్జు క్రీడల ప్రధాన స్టేడియంలో ప్రారంభంకానున్నాయి. క్రీడల ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు.