Telugu Global
Sports

20 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా

మొదట టాస్‌ గెలిచిన రోహిత్‌.. బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్‌ నమ్మకాన్ని నిలబెడుతూ బుమ్రా, సిరాజ్.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.

20 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా
X

వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా తన దూకుడు కొనసాగిస్తోంది. ఆదివారం కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్స్‌ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఐసీసీ టోర్నీల్లో 20 ఏళ్ల తర్వాత కివీస్‌పై టీమిండియా గెలిచింది. చివరగా 2003 ప్రపంచకప్‌లో టీమిండియా విజ‌యం సాధించింది. కివీస్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి ఓటమి.

మొదట టాస్‌ గెలిచిన రోహిత్‌.. బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్‌ నమ్మకాన్ని నిలబెడుతూ బుమ్రా, సిరాజ్.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఫస్ట్‌ ఓవర్ మెడిన్‌ చేశాడు బుమ్రా. ఇక మరోవైపు నుంచి సిరాజ్‌ సైతం కివీస్‌ను పరుగులు చేయనివ్వలేదు. తన రెండో ఓవర్‌లో కాన్వేను అవుట్‌ చేసి.. కివీస్‌ను దెబ్బకొట్టాడు సిరాజ్. మూడో స్థానంలో వచ్చిన రచిన్‌.. రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా 8 ఓవర్లు ముగిసేసరికి కివీస్ చేసిన పరుగులు కేవలం 19 మాత్రమే. ఇక తర్వాత షమీ యంగ్‌ను పెవిలియన్ చేర్చాడు. తర్వాతి ఓవర్‌లో రచిన్‌ను సైతం ఎల్బీడబ్లూగా అవుట్ చేశాడు. కానీ, రచిన్ ఎంపైర్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ DRSకు వెళ్లి నెగ్గాడు. మొదట్లో రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డ కివీస్ ప్లేయర్లు క్రమంగా దూకుడు పెంచారు. మిచెల్ సెంచరీ సైతం పూర్తి చేశాడు. 44 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 243 రన్స్‌తో నిలిచిన కివీస్‌..300 కొట్టడం ఖాయమనుకున్నారు. కానీ చివరి స్పెల్‌లో షమీ నిప్పులు చెరిగాడు. ఆఖరి ఆరు ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టి భారత్‌ కేవలం 40 రన్స్‌ మాత్రమే ఇచ్చింది.

తర్వాత 274 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. శుభ్‌మన్‌, రోహిత్ తమదైన షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. 11 ఓవర్లలో 77 రన్స్‌ చేసి పటిష్ట స్థితికి చేరింది టీమిండియా. ఈ టైంలో ఫెర్గూసన్.. టీమిండియాను గట్టి దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో ఓపెనర్లిద్దరిని పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. శ్రేయాస్, రాహుల్‌, రవీంద్ర జడేజాతో కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. చివర్లో సెంచరీ చేస్తాడనుకున్నప్పటికీ.. సిక్స్‌కు ప్రయత్నించి కోహ్లీ పెవిలియన్ చేరాడు. తర్వాత జడేజా పనిపూర్తి చేశాడు. 5 వికెట్లు పడగొట్టిన షమీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  23 Oct 2023 3:29 AM GMT
Next Story