Telugu Global
Sports

నిప్పులు చెరిగిన స్టార్క్ ..విశాఖ వన్డేలో భారత్ టపటపా!

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండోవన్డేలో ఆతిథ్య భారత్ ను 117 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా ఆస్ట్ర్రేలియా బదులు తీర్చుకొంది.

నిప్పులు చెరిగిన స్టార్క్ ..విశాఖ వన్డేలో భారత్ టపటపా!
X

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ లో లోస్కోరింగ్ పరంపర కొనసాగుతోంది. విశాఖ వేదికగా జరుగుతున్న రెండోవన్డేలో భారత్ 117 పరుగులకే కుప్పకూలింది...

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంకర్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో పేస్ బౌలర్ల జోరు కొనసాగుతోంది.

ముంబై వేదికగా ముగిసిన లోస్కోరింగ్ తొలివన్డేలో ఆస్ట్ర్రేలియాను భారత్ 188 పరుగులకే ఆలౌట్ చేస్తే..విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండోవన్డేలో ఆతిథ్య భారత్ ను 117 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా ఆస్ట్ర్రేలియా బదులు తీర్చుకొంది.

తప్పిన వరుణ గండం....

వర్షం, మేఘావృతమైన వాతావరణం నడుమ అసలు జరుగుతుందో..లేదో తెలియదన్న పరిస్థతిలో విశాఖ వన్డేకి తెరలేచింది. ఆస్ట్ర్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కీలక టాస్ నెగ్గి..మరో ఆలోచన లేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడంతో భారత్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.

సిరీస్ కే కీలకంగా మారిన ఈ వన్డేలో రెండుజట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. ఓపెనర్ ఇషాన్ కిషన్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ల స్థానాలలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లతో భారత్ తుదిజట్టును ప్రకటించింది.

మరోవైపు ..ఆస్ట్ర్రేలియా..ఆల్ రౌండర్ మాక్స్ వెల్, ఇంగ్లిస్ ల స్థానంలో నేథన్ ఇల్లిస్, అలెక్స్ కేరీలను తుదిజట్టులోకి తీసుకొంది.

మిషెల్ స్టార్క్ విశ్వరూపం...

దట్టమైన మేఘాలు కమ్మిన శీతల వాతావరణంలో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియా అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొంది. ఫాస్ట్ బౌలర్ల త్రయం మిషెల్ స్టార్క్. షాన్ అబ్బోట్, నేథన్ ఇల్లిస్ ల ముప్పేట దాడితో భారత టాపార్డర్ ఉక్కిరిబిక్కిరైపోయింది.

ప్రధానంగా కంగారూ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ స్టీల్ సిటీ శీతల వాతావరణంలో నిప్పులు చెరిగే బౌలింగ్ తో భారత బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

ఓపెనర్లు శుబ్ మన్ గిల్, వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్లు కాగా...కెప్టెన్ రోహిత్ శర్మ 13, వన్ డౌన్ విరాట్ కొహ్లీ 31 పరుగులకు దొరికిపోయారు. ముంబై వన్డే హీరో కెఎల్ రాహుల్ 9, వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా 1 పరుగు స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ 15.2 ఓవర్లలో 71 పరుగులకే 6 టాపార్డర్ వికెట్లు నష్టపోయి..పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

53 పరుగులకే 5 వికెట్ల మిషెల్ గన్..

ఆస్ట్ర్రేలియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ గంటకు 140 కిలోమీటర్ల వేగానికి స్వింగ్ బౌలింగ్ ను, యార్కర్లను జోడించి..భారత టాపార్డర్ ను ఓ పట్టు పట్టాడు.

స్టార్క్ మెరుపువేగంలో రోహిత్, గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్, సిరాజ్ గల్లంతయ్యారు.

అబ్బోట్ కు 3, ఇల్లిస్ కు 2 వికెట్లు దక్కాయి. భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 29 బంతుల్లో ఓ బౌండ్రీ, 2 సిక్సర్లతో 29 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ 117 పరుగుల స్కోరుతో పరువు దక్కించుకోగలిగింది. భారత్ ఇన్నింగ్స్ కేవలం 26 ఓవర్లలోనే ముగిసిపోయింది.

మిషెల్ స్టార్క్ వన్డే కెరియర్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 9వ సారి. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 13సార్లు 5 వికెట్లు సాధించిన ప్రపంచ రికార్డు పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరుతో ఉంది. వకార్ 13సార్లు వన్డేలలో 5 వికెట్ల చొప్పున పడగొట్టాడు.

శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ 10సార్లు, స్టార్క్, బ్రెట్ లీ , షాహీద్ ఆఫ్రిదీ తలో 9సార్లు ఐదేసి వికెట్లు సాధించగలిగారు.

భారత్ మూడో అత్యల్పస్కోరు...

ప్రస్తుత విశాఖ వన్డేలో భారత్ 117 పరుగులకే కేవలం 26 ఓవర్లలో కుప్పకూలడం ద్వారా...ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా మూడో అత్యల్పస్కోరు సాధించింది. 1981లో సిడ్నీ వేదికగా 63 పరుగులు, 2000 సంవత్సరంలోనే సిడ్నీ వేదికగానే జరిగిన వన్డేలో 100 పరుగులకు కుప్పకూలిన భారత్ కు..ఆ తర్వాత ఇదే మూడో అతితక్కువ స్కోరు కావడం విశేషం.

భారతజట్టు స్వదేశంలో ఆడిన వన్డేలలో ఇది నాలుగో అత్యల్పస్కోరుగా రికార్డుల్లో చేరింది. 1986లో శ్రీలంకపై 78, 1993లో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ పై 100 పరుగులు, 2017లో ధర్మశాల వేదికగా శ్రీలంకపై 112 పరుగుల స్కోర్లకు కుప్పకూలిన భారత్..ప్రస్తుత విశాఖ వన్డేలో సాధించిన 117 పరుగులు నాలుగో అత్యల్పస్కోరుగా రికార్డుల్లో నమోదయ్యింది.

విశాఖవన్డేలో 118 పరుగుల స్వల్పలక్ష్యాన్ని అలవోకగా చేధించడం ద్వారా ప్రపంచ రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియా 1-1తో సిరీస్ ను సమం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

చెన్నై వేదికగా జరిగే ఆఖరివన్డేలోనే సిరీస్ విజేత ఎవరో తేలిపోనుంది.

First Published:  19 March 2023 5:42 PM IST
Next Story