Telugu Global
Sports

ప్రో-హాకీలీగ్ లో భారత్ భళా!

2023 ప్రపంచ హాకీ పురుషుల లీగ్ లో భారత్ సంచలన విజయాలతో టాపర్ గా నిలిచింది.

ప్రో-హాకీలీగ్ లో భారత్ భళా!
X

2023 ప్రపంచ హాకీ పురుషుల లీగ్ లో భారత్ సంచలన విజయాలతో టాపర్ గా నిలిచింది. వారం రోజుల వ్యవధిలో రెండు ప్రపంచ అగ్రశ్రేణిజట్లపై సంచలన విజయాలు సాధించింది. రూర్కెలా అంచె పోటీలలో ఆల్ విన్ రికార్డు నమోదు చేసింది.....

ప్రపంచ హాకీ మొదటి పది అగ్రశ్రేణి జట్ల కోసం అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహిస్తున్న ప్రొపెషనల్ లీగ్ లో 4వ ర్యాంకర్ భారత్ అనూహ్యవిజయాలు సాధించింది.

వారం రోజుల వ్యవధిలోనే ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా, విశ్వవిజేత జర్మనీజట్లను రెండంచెల సమరంలో కంగు తినిపించి..లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

రూర్కెలా అంచెలో అజేయం.....

ప్రపంచ హాకీ మొదటి పది అత్యుత్తమజట్ల నడుమ స్వదేశీ, విదేశీ అంచెలుగా డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో నిర్వహిస్తున్న ఈ లీగ్ లో భారత్ మొదటి 8 రౌండ్ మ్యాచ్ లు ముగిసే సమయానికి 10 పాయింట్లతో టేబుల్ టాపర్ గా అవతరించింది.

రూర్కెలా వేదికగా గత వారం రోజులుగా ప్రపంచ చాంపియన్ జర్మనీ, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాతో ఆడిన డబుల్ లెగ్ ..నాలుగుకు నాలుగుమ్యాచ్ ల్లోనూ భారత్ కళ్లు చెదిరే విజయాలతో అజేయంగా నిలిచింది.

కంగారూలపై బ్యాక్ టు బ్యాక్ విజయాలు...

మూడుసార్లు విశ్వవిజేత, ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను రూర్కెలా అంచెలో భాగంగా జరిగిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ భారత్ అధిగమించింది. బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం వేదికగా జరిగిన తొలి అంచెపోరులో 5-4 గోల్స్ తో నెగ్గిన భారత్..కీలక రెండో అంచెపోరులో సైతం 4-3 గోల్స్ తో విజేతగా నిలిచింది.

రెండో అంచె పోరు నిర్ణితసమయంలో రెండుజట్లు చెరో రెండు గోల్స్ చేసి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో ..విజేతను నిర్ణయించడానికి పెనాల్టీషూటౌట్ పాటించారు.

భారత సీనియర్ గోల్ కీపర్..పెనాల్టీ షూటౌట్లో ప్రత్యర్థి ఆస్ట్ర్రేలియా మూడు ప్రయత్నాలను వమ్ము చేయడం ద్వారా తనజట్టుకు అనూహ్య విజయం అందించాడ.

అంతకుముందు ఆట తొలి క్వార్టర్ ఆట రెండో నిముషంలోనే వివేక్ సాగర్ ప్రసాద్ భారత్ కు తొలిగోలు అందించాడు.

ఆ తర్వాత ఆస్ట్ర్ర్రేలియా వెంటవెంటనే రెండుగోల్స్ చేయడం ద్వారా భారత్ పై 2-1తో ఆధిక్యం సంపాదించింది. అయితే ఆట ఆఖరి క్వార్టర్ లో సుఖ్ జీత్ సింగ్ సాధించిన సూపర్ గోల్ తో భారత్ 2-2తో సమఉజ్జీగా నిలువగలిగింది.

ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్లో శ్రీజేష్ అపూర్వ ప్రతిభతో భారత్ 4-3 గోల్స్ విజయం సొంతం చేసుకోగలిగింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన పెనాల్టీకార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

జర్మనీపైన రికార్డు గెలుపు...

రూర్కెలా అంచెలో భాగంగా ప్రపంచ చాంపియన్ జర్మనీతో జరిగిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ భారత్ తిరుగులేని విజయాలు సాధించింది. తొలి అెంచెపోరులో జర్మనీని 3-2 గోల్స్ తో ఓడించిన భారత్..రెండో అంచెపోరులో విశ్వరూపమే ప్రదర్శించింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ తర్వాత జర్మనీ ప్రత్యర్థిగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఆట అన్ని విభాగాలలోనూ చెలరేగిపోయిన భారత్ 6-3 గోల్స్ విజయం నమోదు చేసింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ సమరంలో భారత్ 8-1 గోల్స్ తో జర్మనీ పై సాధించిన విజయమే ఇప్పటికీ అతిపెద్ద గెలుపు రికార్డుగా కొనసాగుతూ వస్తోంది.

జర్మనీతో ఏకపక్షంగా సాగిన రెండో అంచె సమరంలో భారత్ తరపున ఆట 22, 51 నిముషాలలో అభిషేక్ ,24, 46 నిముషాలలో సెల్వమ్ కార్తీ చెరో రెండుగోల్స్ సాధించడం ద్వారా భారత్ భారీవిజయంలో ప్రధానపాత్ర వహించారు. జుగ్ రాజ్ సింగ్ ఆట 21వ నిముషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోలు సాధించగా...కెప్టెన్ హర్మన్ ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ ను గోలుగా మలిచాడు.

ప్రస్తుత టోర్నీలో హర్మన్ ప్రీత్ 11వ గోల్ సాధించడం ద్వారా అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు.

భారత్ ఇప్పటి వరకూ ఆడిన మొత్తం ఎనిమిది మ్యాచ్ ల్లో 5 విజయాలతో 17 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా అవతరించింది. 2023 ప్రో-హాకీ లీగ్ లో భారత్ తో పాటు..జర్మనీ, ఆస్ట్ర్రేలియా, అర్జెంటీనా, నెదర్లాండ్స్, స్పెయిన్, ఇంగ్లండ్, బెల్జియం, న్యూజిలాండ్ జట్లు సైతం తలపడుతున్నాయి.

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకోడం ద్వారా పడిలేచిన కెరటంలా అంతర్జాతీయ హాకీలోకి దూసుకొచ్చిన భారత్..2023 ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ చేరుకోడంలో విఫలమయ్యింది. అయితే ..ప్రో-హాకీలీగ్ లో నిలకడగా రాణిస్తూ 8 మ్యాచ్ ల్లో 5 విజయాలు, 2 డ్రా, ఓ ఓటమి రికార్డుతో సత్తా చాటుకొంది.

2023 సీజన్ లో భారత్ కేవలం వారం రోజుల వ్యవధిలో ప్రపంచ మేటి ఆస్ట్ర్రేలియా, జర్మన్ జట్లపై రెండేసి విజయాలు సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

First Published:  16 March 2023 12:00 PM IST
Next Story