Telugu Global
Sports

హాకీ గోల్డ్ మెడల్ రౌండ్లో భారత్..సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విజయం

గోల్డ్ మెడల్ రౌండ్లో చోటు కోసం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ గట్టిపోటీ ఎదుర్కొని దక్షిణాఫ్రికాపై 3-2 గోల్స్‌తో విజేతగా నిలిచింది.

హాకీ గోల్డ్ మెడల్ రౌండ్లో భారత్..సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విజయం
X

ఆసియా క్రీడల కాంస్య పతక విజేత భారత్...2022 కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీ ఫైనల్స్ కు చేరుకుంది. గోల్డ్ మెడల్ రౌండ్లో చోటు కోసం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ గట్టిపోటీ ఎదుర్కొని దక్షిణాఫ్రికాపై 3-2 గోల్స్‌తో విజేతగా నిలిచింది. గ్రూపు-ఏ లీగ్ టాపర్ గా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టిన భారత్‌కు సెమీస్ సమరంలో గ్రూప్- బీ లీగ్ రన్నరప్ దక్షిణాఫ్రికా నుంచి అడుగడుగునా పోటీ ఎదురైంది. ఆట మొదటి క్వార్టర్‌లో భారత్‌ను నిలువరించిన దక్షిణాఫ్రికా రక్షణ వలయం రెండో క్వార్టర్‌లో చెదరిపోయింది.

20వ నిమిషంలో అభిషేక్ సాధించిన గోలుతో భారత్ బోణీ కొట్టింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాలకే మన్ దీప్ సింగ్ రెండో గోలుతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది. మూడో క్వార్టర్ లో పుంజుకొని దక్షిణాఫ్రికా ఎదురుదాడులతో భారత్‌ను ఆత్మరక్షణలో పడవేసింది. ఆట 33వ నిముషంలో రైన్ జూల్స్ తన జట్టుకు తొలి గోలు సాధించి పెట్టాడు. ఆట 58వ నిముషంలో జుగ్ రాజ్ సింగ్ గోల్‌తో భారత్ 3-1తో పైచేయి సాధించింది. ఆ తర్వాత నిమిషం విరామంలోనే ముస్తాఫా కాశీం...సఫారీలకు రెండో గోలు అందించాడు. ఆట ఆఖరి క్వార్టర్ చివ‌రి నిమిషాలలో భారత్ కట్టుదిట్టమైన డిఫెన్స్ తో మ్యాచ్‌ను ముగించింది.

2014 తర్వాత ఫైనల్ బెర్త్...

గ్రూప్- ఏ లీగ్ లో ఘనాను 11-0, కెనడాను 8-0 గోల్స్ తో చిత్తు చేసిన భారత్...ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన కీలక పోరును 4-4 గోల్స్ తో డ్రాగా ముగించింది. ఆఖరి రౌండ్లో వేల్స్ ను 3-1తో ఓడించడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో చివరిసారిగా ఫైనల్స్ చేరిన భారతజట్టు... ఆస్ట్రేలియాతో జరిగిన గోల్డ్ మెడల్ పోరులో పరాజయం పొంది రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తిరిగి ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత ఫైనల్ చేరిన భారత జట్టు...గోల్డ్ మెడ‌ల్ కోసం...ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్ జట్లలో ఏదో ఒక జట్టుతో తలపడాల్సి ఉంది.

First Published:  7 Aug 2022 9:15 AM IST
Next Story