Telugu Global
Sports

ఆసియా కప్‌లో రెండు స్తంభాలాట!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న ఆరు దేశాల ఆసియా కప్ టోర్నీ రెండు స్తంభాలాట కానుంది. దాయాది జట్లు భారత్, పాక్‌ ప్రధాన ప్రత్యర్థులు కానున్నాయి.

ఆసియా కప్‌లో రెండు స్తంభాలాట!
X

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగనున్న టీ-20 ప్రపంచ కప్‌కు సన్నాహకంగా 2022 ఆసియాకప్ టోర్నీకి దుబాయ్ వేదికగా ఈ రోజు తెరలేవనుంది. ఆరు దేశాలు తలపడుతున్న ఈ టోర్నీని టీ-20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.

రెండేళ్లు ఆలస్యంగా...

వాస్తవానికి...2020లో శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్ టోర్నీ కరోనా దెబ్బతో గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాదు..టోర్నీకి ఆతిథ్యం ఇవ్వ‌లేనంటూ శ్రీలంక బోర్డు సైతం చేతులెత్తేసింది...అక్కడి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దివాళా స్థాయికి చేరడంతో...ఈ టోర్నీ నిర్వహణ బాధ్యతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు అప్పజెప్పారు. దుబాయ్, షార్జా, అబుదాబీ వేదికలుగా ఈ టోర్నీని ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నారు. ఐదు జట్లు మెయిన్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తే, క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా హాంకాంగ్‌ అర్హత సాధించింది. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్‌ 11న ఫైనల్‌ నిర్వహిస్తారు.

ఆరు జట్లు, రెండు గ్రూపులుగా జరిగే ఈ టోర్నీని లీగ్ కమ్ నాకౌట్‌గా నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. గ్రూప్- ఏ లీగ్‌లో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్, గ్రూప్- బీ లీగ్‌లో శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ లీగ్‌లో ఒక్కోజట్టు రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సూపర్-4 రౌండ్ చేరతాయి. మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు టైటిల్ సమరంలో పాల్గొంటాయి.గ్రూప్- బీ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ శ్రీలంకతో అఫ్ఘనిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7-30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ టోర్నీ ప్రత్యక్ష ప్రసారం కోసం స్టార్ స్పోర్ట్స్ విస్తృత‌స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

భారత్ తిరుగులేని రికార్డు...

1984 నుంచి 2018 వరకూ ఆసియాకప్‌లో భాగంగా 14 టోర్నీలు జరిగాయి. అంతేకాదు.. ఆసియాకప్ టోర్నీలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటి వరకూ ఏడు సార్లు విజేతగా నిలిచిన ఘనత భారత్ కు ఉంటే..పాకిస్థాన్ రెండు సార్లు మాత్రమే విన్నర్ కాగలిగింది. భారత్ తర్వాత అత్యధికంగా శ్రీలంక 5 సార్లు టోర్నీ గెలిచింది. ప్రస్తుత టోర్నీలో భాగంగా విరాట్ కోహ్లీ తన వందో టీ-20 మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుండడం, భారత్, పాకిస్తాన్‌ జట్లు రెండు సార్లు తలపడే అవకాశం ఉండడంతో ఆసక్తికరంగా మారింది.

బలమైన జట్టుతో భారత్...

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ టైటిల్ వేటకు దిగుతోంది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టులో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, రవి బిష్నోయ్ ప్రధాన స్పిన్నర్లుగాను, రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్లుగాను వ్యవహరించనున్నారు. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగానూ ఉన్నారు. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్లుగా సేవలు అందించనున్నారు. యార్కర్ల కింగ్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గాయంతో అందుబాటులో లేకపోడంతో...భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.

భారత ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోడంతో...జట్టు తాత్కాలిక కోచ్ బాధ్యతలను జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పజెప్పారు. సూపర్ సండే ఫైట్ గా జరిగే గ్రూప్- ఏ ప్రారంభ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆసియా దేశాల క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 2018లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో రోహిత్‌ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్‌ సాధించింది. 2016లో కూడా ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు ఈ టోర్నీని టీ-20 ఫార్మాట్‌లోనే నిర్వహించారు. సెప్టెంబర్ 11న జరిగే టైటిల్ సమరం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్యనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  27 Aug 2022 6:05 AM GMT
Next Story