ఆసియాకప్ సూపర్-4 రౌండ్లో భారత్, పాక్‌తో మళ్ళీ ఢీ!
2023-ఆసియాకప్ సూపర్ -4 రౌండ్‌కు భారత్ చేరుకుంది. ఆదివారం మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
పాకిస్థాన్, శ్రీలంక దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2023 ఆసియాకప్ వన్డే టోర్నీ తొలిదశ గ్రూప్ లీగ్‌ను భారత్ విజయవంతంగా ముగించి రెండో దశ సూపర్-4 రౌండ్‌కు చేరుకోగలిగింది. పాకిస్థాన్, నేపాల్ ప్రత్యర్థులుగా ఉన్న గ్రూప్- ఏ లీగ్ నుంచి భారత్, పాక్ జట్లు చెరో నాలుగు పాయింట్ల చొప్పున సాధించి సూపర్-4 రౌండ్‌లో అడుగుపెట్టాయి. భారత్-పాక్ జట్ల ప్రారంభ మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో రెండు జట్లూ చెరో పాయింటు పంచుకోగా.. పసికూన నేపాల్ ప్రత్యర్థిగా రెండు జట్లూ విజయాలు సాధించడం ద్వారా తర్వాతి రౌండ్‌లో అడుగుపెట్టాయి.
వర్షం దోబూచులాట నడుమే భారత్ గెలుపు...
టాప్ ర్యాంకర్ పాక్, 3వ ర్యాంకర్ భారత్ జట్ల పోటీని మాత్రమే కాదు..భారత్- నేపాల్ జట్ల లీగ్ మ్యాచ్‌ను సైతం వర్షం వెంటాడింది. శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 230 పరుగులు చేయగలిగింది.
సమాధానంగా 231 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ ప్రారంభంలోనే వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత.. వర్షంతో నష్టపోయిన సమయానికి అనుగుణంగా ఓవర్లను కుదించి.. 23 ఓవర్లలో భారత లక్ష్యాన్ని 145 పరుగులుగా నిర్ణయించారు.
17 బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలుపు...
అంతర్జాతీయ అనుభవం అంతంత మాత్రమే ఉన్న నేపాల్ బౌలింగ్ ఎటాక్‌ను భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ అలవోకగా ఎదుర్కొని మరో 17 బంతులు మిగిలిఉండగానే 10 వికెట్ల విజయం అందించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 59 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 74 పరుగులు, యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఒక సిక్సర్, ఎనిమిది ఫోర్లతో 67 పరుగులతో 145 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
నాలుగో అత్యుత్తమ భాగస్వామ్యం...
రోహిత్- శుభ్ మన్ గిల్ జోడీ ఆసియాకప్‌లో భారత్ తరపున నాలుగో అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేశారు. వన్డే క్రికెట్లో మొదటి వికెట్‌కు భారత అత్యుత్తమ భాగస్వామ్యం రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ - గౌతం గంభీర్‌ల పేరుతో ఉంది. 2009లో హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన పోటీలో ఈ జోడీ 201 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసింది.
ఆ తర్వాత 1998లో షార్జా వేదికగా జింబాబ్వే వేదికగా జరిగిన పోరులో భారత ఓపెనింగ్ జోడీ మాస్టర్ సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీ 197 పరుగులతో రెండో అత్యుత్తమ భాగస్వామ్యం సాధించారు. 2022లో హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్- శుభ్ మన్ గిల్ జోడీ 192 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ప్రస్తుత ఆసియాకప్ గ్రూప్ ఆఖరి లీగ్ పోరులో శుభ్ మన్ గిల్- రోహిత్ జోడీ నేపాల్ పై 147 పరుగుల అజేయ భాగస్వామ్యం సాధించారు. నేపాల్‌తో జరిగిన ఈ పోరులో భారత్ 10 వికెట్ల విజయంలో ప్రధాన పాత్ర వహించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రోహిత్ ఐదు సిక్సర్లు బాదడం ద్వారా.. వన్డేలలో అత్యధికంగా 252 సిక్సర్లు సాధించిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో చేరాడు.
పాక్‌తో భారత్ మరో సూపర్ సండే ఫైట్...
ఆసియాకప్ గ్రూప్- ఏ లీగ్ నుంచి సూపర్-4 రౌండ్ చేరిన భారత్, పాక్ జట్లు మరోసారి సెప్టెంబర్ 10న కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే పోరులో తలపడనున్నాయి. పల్లెకెలీ వేదికగా లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడిన సమయంలో భారత్ బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ ప్రాక్టీసులా ఓ ఇన్నింగ్స్ సాగిన తరువాత కుండపోతగా వానపడడంతో మ్యాచ్ రద్దుల పద్దులో చేరిపోయింది. సూపర్-4 రౌండ్ నుంచి ఈ రెండు జట్లూ ఫైనల్స్ చేరగలిగితే.. ముచ్చటగా మూడో సారి కూడా పోటీపడాల్సి ఉంటుంది.
♦