Telugu Global
Sports

ఆసియా క్రీడల క్రికెట్లో 'డబుల్ గోల్డ్ 'కు భారత్ గురి!

హాంగ్జు ఆసియాక్రీడల క్రికెట్లో భారత్ జంట స్వర్ణాలకు గురిపెట్టింది. మహిళల జట్టు ఫైనల్స్ కు చేరుకోగా.. పురుషుల పోరు 28న ప్రారంభంకానుంది.

ఆసియా క్రీడల క్రికెట్లో డబుల్ గోల్డ్ కు భారత్ గురి!
X

ఆసియా క్రీడల క్రికెట్లో 'డబుల్ గోల్డ్ 'కు భారత్ గురి!

హాంగ్జు ఆసియాక్రీడల క్రికెట్లో భారత్ జంట స్వర్ణాలకు గురిపెట్టింది. మహిళల జట్టు ఫైనల్స్ కు చేరుకోగా..పురుషుల పోరు 28న ప్రారంభంకానుంది.

ప్రపంచ క్రికెట్ సూపర్ పవర్ భారత్...చైనాలోని హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో బంగారు పతకాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలో నిలిచింది.

హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళాజట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకోడం ద్వారా రజత పతకం ఖాయం చేసుకొంది. పురుషుల పోటీలు సెప్టెంబర్ 28న ప్రారంభంకానున్నాయి.

9 ఏళ్ల తర్వాత ఏషియాడ్ లో క్రికెట్....

ఆసియా క్రీడల ప్రధాన అంశాలలో ఒకటిగా లేని క్రికెట్ కు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత హాంగ్జు ఏషియాడ్ ద్వారా అవకాశం కల్పించారు. పురుషుల, మహిళల విభాగాలలో టీ-20 ఫార్మాట్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీలు నిర్వహిస్తున్నారు.

గతంలో ఇంచెన్ వేదికగా 2014 లో జరిగిన ఆసియాక్రీడల్లో మాత్రమే క్రికెట్ ను పతకం అంశంగా నిర్వహించారు. ఆ తర్వాత 2018లో జరిగిన జకార్తా ఏషియాడ్ క్రీడల జాబితా నుంచి క్రికెట్ ను తొలగించారు. తిరిగి హాంగ్జు క్రీడల మెడల్ అంశాలలో చేర్చారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకూ ఆసియాక్రీడల క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు.

మహిళల ఫైనల్లో భారత్ తో శ్రీలంక ఢీ...

ఆసియాక్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా క్రికెట్ ఫైనల్స్ కు భారత్, శ్రీలంక జట్లు చేరుకొన్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్లో పాల్గొని మలేసియాను అధిగమించడం ద్వారా సెమీస్ కు చేరింది.

ఫైనల్లో చోటు కోసం జరిగిన పోరులో బంగ్లాదేశ్ ను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టింది. హాంగ్జులోని జీజియాంగ్ యూనివర్సిటీ స్టేడియం వేదికగా జరిగిన తొలి సెమీస్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా భారత్ 2 వికెట్ల నష్టానికే విజేతగా నిలిచింది.

మరో సెమీఫైనల్లో పాకిస్థాన్ ను అధిగమించిన శ్రీలంక..బంగారు పతకం పోరులో భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది. కాంస్య పతకం పోరులో పాకిస్థాన్ , బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి.

పురుషుల గోల్డ్ మెడల్ రేస్ లో భారత్..

ఆసియాక్రీడల క్రికెట్ స్వర్ణ పతకం రేస్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో..ద్వితీయ శ్రేణి జట్టుతో పోటీకి దిగనున్న భారత్ కు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్ గా వ్యవహరించనున్న భారత జట్టులోని ఇతర సభ్యుల్లో యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠీ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్, రవి బిష్నోయ్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం దూబే, ప్రభ్ సిమ్రన్ సింగ్, ఆకాశ్ దీప్ ఉన్నారు.

ఆసియాక్రీడల క్రికెట్ ప్రారంభానికి ముందు భారత జట్టు హాంగ్జు వేదికగా వారంరోజులపాటు సాధన చేయనుంది.

భారత జట్టులోని పలువురు యువ ఆటగాళ్ల సత్తాకు ఆసియా క్రీడల క్రికెట్ సమరం సవాలు కానుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల నడుమే పోటీ ప్రధానంగా జరుగనుంది.

పురుషుల, మహిళల విభాగాలలో బంగారు పతకాలు సాధించాలన్న భారత లక్ష్యం నెరవేరుతుందో..లేదో తెలుసుకోవాలంటే అక్టోబర్ మొదటి వారం వరకూ వేచి చూడక తప్పదు.

First Published:  25 Sept 2023 12:17 PM IST
Next Story