విరాట్ కొహ్లీ ను ఊరిస్తున్న మూడు రికార్డులు!
వెస్టిండీస్ తో ఈరోజు ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత దిగ్గజబ్యాటర్ విరాట్ కొహ్లీని మూడు సరికొత్త రికార్డులు ఊరిస్తున్నాయి.
వెస్టిండీస్ తో ఈరోజు ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత దిగ్గజబ్యాటర్ విరాట్ కొహ్లీని మూడు సరికొత్త రికార్డులు ఊరిస్తున్నాయి.
డోమనికా రిపబ్లిక్ లోని రోసో విండ్సర్ పార్క్ వేదికగా ఈరోజు వెస్టిండీస్ తో ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డులకు వేదికగా నిలువనుంది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో గత మూడేళ్ల కాలంలో అంతంత మాత్రంగా రాణిస్తున్న విరాట్ కొహ్లీ తిరిగి పూర్తిస్థాయిలో పుంజుకోడానికి విండీస్ తో సిరీస్ వేదిక కానుంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగే రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ తో పాటు మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో సైతం భారత్ తరపున విరాట్ పాల్గోనున్నాడు.
విరాట్ వైపు భారత చూపు...
భారత క్రికెట్ పరుగులయంత్రం విరాట్ కొహ్లీ గత 25 టెస్టుల్లో ఒక్క సెంచరీ మాత్రమే సాధించడం చర్చనీయాంశంగా మారింది. విరాట్ బ్యాటింగ్ లో వాడివేడీ తగ్గిపోయాయన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్టు లీగ్ టైటిల్ సమరం రెండు ఇన్నింగ్స్ లోనూ విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించలేకపోయాడు.
వెస్టిండీస్ ప్రత్యర్థిగా గతంలో పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన విరాట్..ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లో సైతం స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలిగితే మరో మూడు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు..
క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డును విరాట్ సొంతం చేసుకోనే అవకాశాలున్నాయి. గత సిరీస్ వరకూ విరాట్ మొత్తం 3వేల 653 పరుగులు సాధించాడు.
ఇప్పటి వరకూ వెస్టిండీస్ ప్రత్యర్థిగా సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జాక్ కలిస్ సాధించిన 4120 పరుగుల రికార్డును విరాట్ అధిగమించాలంటే మరో 467 పరుగులు చేయాల్సి ఉంది.
కరీబియన్ గడ్డపై అత్యధిక పరుగుల రికార్డు...
కరీబియన్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచే రికార్డు సైతం విరాట్ ను ఊరిస్తోంది. విరాట్ మొత్తం 5 సెంచరీలు, 6 అర్థసెంచరీలతో సహా 1365 పరుగులతో 50.65 సగటు నమోదు చేశాడు.
భారత ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 1838 పరుగులతో టాపర్ గా కొనసాగుతున్నాడు. ద్రావిడ్ రికార్డును విరాట్ అధిగమించాలంటే మరో 473 పరుగులు చేసి తీరాలి.
వెస్టిండీస్ పై అత్యధిక సెంచరీల రికార్డు...
వెస్టిండీస్ ప్రత్యర్థిగా క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ అత్యధిక శతకాలు బాదిన రికార్డు సైతం విరాట్ కోసం వేచిచూస్తోంది. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్, సునీల్ గవాస్కర్ ల తర్వాతి స్థానంలో కొనసాగుతున్న విరాట్..ప్రస్తుత టెస్టు, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ల ద్వారా మరో మూడు సెంచరీలు సాధించగిలిగితే..డివిలియర్స్, గవాస్కర్ ల రికార్డులను తెరమరుగు చేసే అవకాశం ఉంది.
ప్రస్తుత సిరీస్ లోని రెండుటెస్టులు, 4 ఇన్నింగ్స్ లో విరాట్ ఎన్ని శతకాలు బాదగలడన్నది అనుమానమే.