Telugu Global
Sports

నేడు రెండోవన్డే, పదో విజయానికి భారత్ గురి!

కరీబియన్ గడ్డపై వరుసగా పదో వన్డే విజయానికి భారత్ ఉరకలేస్తోంది. బార్బడోస్ వేదికగా వెస్టిండీస్ తో రెండో వన్డే పోరుకు సిద్ధమయ్యింది.

నేడు రెండోవన్డే, పదో విజయానికి భారత్ గురి!
X

కరీబియన్ గడ్డపై వరుసగా పదో వన్డే విజయానికి భారత్ ఉరకలేస్తోంది. బార్బడోస్ వేదికగా వెస్టిండీస్ తో రెండో వన్డే పోరుకు సిద్ధమయ్యింది....

రెండుసార్లు విశ్వవిజేత, వన్డేల్లో 3వ ర్యాంకర్ భారత్ ప్రపంచ కప్ సన్నాహాలు జోరందుకొన్నాయి. రానున్న రెండుమాసాల కాలంలో వివిధ జట్లతో 12 సన్నాహక వన్డేలలో భారత్ తలపడనుంది.

ఆ పరంపరలో భాగంగా ఈ రోజు బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగే రెండోవన్డేలో వెస్టిండీస్ తో తలపడనుంది. తీన్మార్ సిరీస్ లో భాగంగా ముగిసిన లోస్కోరింగ్ తొలివన్డేలో 5 వికెట్ల విజయం సాధించిన రోహిత్ సేన వరుసగా రెండో గెలుపుతో సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

మిడిలార్డర్లో సంజు శాంసన్ కు చోటు...

పదవ ర్యాంకర్ వెస్టిండీస్ తో జరుగుతున్న ప్రస్తుత తీన్మార్ వన్డే సిరీస్ ను భారత టీమ్ మేనేజ్ మెంట్ తన ప్రయోగాలకు వేదికగా వాడుకొంటోంది. పలువురు యువఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వడం ద్వారా సత్తా చాటుకోవాలని సవాలు విసురుతోంది.

స్పిన్, పేస్ బౌలర్లకు అనువుగా ఉన్న కెన్సింగ్టన్ ఓవల్ వికెట్ పైన జరిగిన తొలివన్డే 23 ఓవర్ల షోగానే ముగిసింది. ఆతిథ్య కరీబియన్ జట్టు 23 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలితే..భారత్ 22 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరుకోడం ద్వారా విజేతగా నిలవడంతో విరాట్, రోహిత్ లాంటి సీనియర్లకు బ్యాటింగ్ చేసే అవకాశమే లేకుండాపోయింది.

ఓపెనర్ గా ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటుకొంటే..శుభ్ మన్ గిల్ విఫలమయ్యాడు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా సైతం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు.

అయితే..ఈ రోజు జరిగే రెండోవన్డేలో సూర్యకుమార్ స్థానంలో సంజు శాంసన్ ను, శుభ్ మన్ గిల్ కు బదులుగా రుతురాజ్ గయక్వాడ్ ను, జడేజా స్థానంలో అక్షర్ పటేల్ కు అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు.

వెస్టిండీస్ పైనే ఒత్తిడి...

తొలివన్డేలో పేలవమైన బ్యాటింగ్ తో చతికిలబడిన కరీబియన్ టీమ్ తీవ్రఒత్తిడి నడుమ రెండో వన్డే బరిలోకి దిగుతోంది. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన రెండో వన్డేలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలన్న పట్టుదలతో ఉంది.

టాపార్డర్లో బ్రెండన్ కింగ్, కీల్ మేయర్స్ తో పాటు కెప్టెన్ షాయ్ హోప్, మిడిలార్డర్లో హెట్ మేయర్ ..వీరికితోడుగా యువబ్యాటర్ అత్నాజే స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే భారత్ కు కష్టాలు తప్పవు.

అయితే..భారత స్పిన్ త్రయం కుల్దీవ్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లను కరీబియన్ బ్యాటర్లు దీటుగా ఎదుర్కొనగలరా అన్నది అనుమానమే.

భారత్ ను ఊరిస్తున్న మూడు రికార్డులు...

ప్రస్తుత సిరీస్ లోని రెండోవన్డేలో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లను మరో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. రోహిత్- కొహ్లీ జోడీ మరో రెండు పరుగులు చేయగలిగితే...వన్డేలలో 5వేల పరుగుల మైలురాయిని చేరిన భాగస్వాములుగా రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

రోహిత్- విరాట్ జోడీ ఇప్పటి వరకూ వన్డేలలో 85సార్లు కలసి బ్యాటింగ్ చేయడం ద్వారా 4వేల 998 పరుగులు సాధించారు. ఈ రోజు జరిగే రెండోవన్డేలో మరో రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే వన్డేలలో 5వేల పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన 8వ జోడీగా రికార్డుల్లో చోటు సంపాదించనున్నారు.

అత్యంతవేగంగా 5వేల పరుగుల రికార్డు...

వన్డేలలో ఇప్పటికే 12వేల 898 పరుగులు సాధించిన స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ మరో 102 పరుగులు సాధించగలిగితే..అత్యంతవేగంగా 13వేల పరుగుల రికార్డు సాధించిన బ్యాటర్ కా నిలిచే అవకాశం ఉంది. సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో క్రికెటర్ గా విరాట్ రికార్డుల్లో చేరనున్నాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మను సైతం 10వేల పరుగుల రికార్డు ఊరిస్తోంది. రోహిత్ మిగిలిన రెండువన్డేలలో మరో 163 పరుగులు సాధించగలిగితే 10వేల పరుగుల మైలురాయిని చేరిన 6వ బ్యాటర్ గా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. గతంలో సచిన్, విరాట్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ధోనీలకు మాత్రమే వన్డేలలో 10వేల పరుగులు సాధించిన ఘనత ఉంది.

భారత్- వెస్టిండీస్ ద్వైపాక్షిక సిరీస్ ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ఘనతను కోట్నీ వాల్ష్, రవీంద్ర జడేజా చెరో 44 వికెట్లతో సంయుక్తంగా పంచుకొన్నారు.

అయితే..ప్రస్తుత రెండో వన్డేలో వాల్ష్ రికార్డును జడేజా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

కరీబియన్ గడ్డపై వరుసగా 10వ విజయానికి...

భారతజట్టు మరో రికార్డుకు సైతం గురి పెట్టింది. వెస్టిండీస్ వేదికగా ఆడిన గత తొమ్మిది వన్డేలలోనూ అజేయంగా నిలిచిన భారత్ ఈ రోజు జరిగే రెండోవన్డేలో సైతం నెగ్గితే వరుసగా 10 విజయాలు సాధించిన రికార్డును చేరుకోగలుగుతుంద.

2006 సిరీస్ లో చివరిసారిగా వెస్టిండీస్ చేతిలో కరీబియన్ గడ్డపై 1-4తో పరాజయం పొందిన భారత్ ఆ తర్వాత నుంచి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత 15 వన్డే సిరీస్ ల్లోనూ విజేతగా నిలుస్తూ వచ్చిన భారత్ వరుసగా 16వ సిరీస్ కు గురి పెట్టింది.

ఈ రెండుజట్లూ ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే వరకూ 140 వన్డేల్లో తలపడితే భారత్ 71 విజయాలు, వెస్టిండీస్ 63 విజయాల రికార్డుతో ఉన్నాయి. రెండుమ్యాచ్ ల టై కాగా..నాలుగు వన్డేలు ఫలితం తేలకుండానే ముగిశాయి.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ పోటీప్రారంభంకానుంది. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ కు వర్షంతో పలుమార్లు అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

First Published:  29 July 2023 6:57 AM GMT
Next Story