45వ శతకంతో సచిన్ సరసన విరాట్!
విరాట్ కొహ్లీ 2023లో తొలివన్డే సెంచరీ సాధించాడు. తన వన్డే శతకాలను 45కు, అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 73కు పెంచుకొన్నాడు.మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న మరో రికార్డును తెరమరుగు చేశాడు.
విరాట్ కొహ్లీ 2023లో తొలివన్డే సెంచరీ సాధించాడు. తన వన్డే శతకాలను 45కు, అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 73కు పెంచుకొన్నాడు.మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న మరో రికార్డును తెరమరుగు చేశాడు....
భారత క్రికెట్లో నయాపరుగుల యంత్రం విరాట్ కొహ్లీ...కొత్తసంవత్సరాన్ని, 2023 సీజన్ ను వన్డే శతకంతో మొదలు పెట్టాడు. గౌహతీ బారస్పారా స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో 113 పరుగులతో తన వన్డే సెంచరీల సంఖ్యను 45కు పెంచుకొన్నాడు.
శ్రీలంకపై 9వ శతకం..
2022 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ తో మీర్పూర్ వేదికగా ముగిసిన సిరీస్ ఆఖరివన్డేలో తన 44వ వన్డే శతకం బాదిన విరాట్..కొత్తసంవత్సరంలో శ్రీలంకతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలివన్డేలోనే మూడంకెల స్కోరు సాధించాడు. కేవలం 87 బాల్స్ లోనే 12 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 113 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.
శ్రీలంకపైన వన్డేల్లో విరాట్ కు ఇది తొమ్మిదవ శతకం. ఈ సెంచరీతో గతంలోనే 9 సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును సమం చేయగలిగాడు. మూడేళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ వన్డే సెంచరీలు సాధించిన ఘనత దక్కించుకొన్నాడు.
శ్రీలంక ప్రత్యర్థిగా సచిన్ 84 వన్డేలు ఆడి 3వేల 113 పరుగులు సాధించాడు. కొహ్లీ మాత్రం 48 వన్డేలలోనే 2వేల 343 పరుగులు సాధించడంతో పాటు 50 అర్థశతకాలు సైతం నమోదు చేయగలిగాడు.
రెండుజట్ల పైన 9 శతకాల రికార్డు..
వన్డే క్రికెట్ చరిత్రలో రెండుజట్ల పైన తొమ్మిదేసి వన్డే సెంచరీలు సాధించిన అరుదైన రికార్డును విరాట్ దక్కించుకొన్నాడు. వెస్టిండీస్, శ్రీలంకజట్లపైన 9 సెంచరీలు చొప్పున సాధించిన బ్యాటర్ గా విరాట్ నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్లో తన 71వ శతకం కోసం మూడేళ్లపాటు ఎదురుచూసిన విరాట్..దుబాయ్ వేదికగా ముగిసిన 2022 ఆసియాకప్ టీ-20 టోర్నీ ఆఖరిమ్యాచ్ లో అఫ్గనిస్థాన్ పై సాధించాడు. టీ-20 అంతర్జాతీయమ్యాచ్ ల్లో తన తొలి సెంచరీ నమోదు చేయగలిగాడు. ఇక..బంగ్లాదేశ్ తో జరిగిన 2022 వన్డే సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో మూడంకెల స్కోరుతో వన్డేల్లో తన 44వ శతకం సైతం సాధించగలిగాడు. ఇప్పుడు శ్రీలంకపైన శతకంతో వన్డే సెంచరీల సంఖ్యను 45కు, అంతర్జాతీయ శతకాల సంఖ్యను 73కి పెంచుకొన్నాడు.
2019 నవంబర్ 23న బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ టెస్టులో తన 70వ శతకం బాదిన విరాట్ తన 71వ శతకాన్ని 1214 రోజుల సుదీర్ఘవిరామం తర్వాత కానీ సాధించలేకపోయాడు.
సచిన్ సరసన విరాట్..
స్వదేశీగడ్డపై 20 వన్డే శతకాలు సాధించిన రెండో క్రికెటర్ గా విరాట్ నిలిచాడు. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న రికార్డును విరాట్ ప్రస్తుత సీజన్ తొలిశతకంతో సమం చేయగలిగాడు.
సచిన్ స్వదేశీ గడ్డపై 20 సెంచరీలు సాధించడానికి 160 ఇన్నింగ్స్ ఆడితే..విరాట్ మాత్రం..అంతకంటే 61 ఇన్నింగ్స్ కు ముందే 20 శతకాల రికార్డును అందుకోగలిగాడు.
విరాట్ కొహ్లీ స్వదేశంలో ఆడిన 102 మ్యాచ్ ల్లోనే 20 శతకాలతో 12వేల 582 పరుగులు సాధించాడు. ప్రస్తుత సిరీస్ లో విరాట్ మరో 70 పరుగులు చేయగలిగితే..మొదటి ఐదుగురు అత్యుత్తమ బ్యాటర్ల సరసన చేరగలుగుతాడు.
వన్డే క్రికెట్లో సచిన్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే అత్యధిక పరుగులు సాధించిన మొదటి ఐదుగురు బ్యాటర్లుగా ఉన్నారు.
శ్రీలంకపైన టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్- గిల్ జోడీ అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ 70, రోహిత్ 83 పరుగుల స్కోర్లకు అవుటైనా...విరాట్ తన దైనశైలిలో ఆడి శతకం బాదడంతో భారత్ 373 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.