Telugu Global
Sports

హాట్ కేకుల్లా రెండో టీ-20 మ్యాచ్ టికెట్లు!

భారత్- దక్షిణాఫ్రికాజట్ల రెండో టీ-20 మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గౌహతీలోని బార్సపారా స్టేడియం వేదికగా అక్టోబర్ 2న జరిగే ఈమ్యాచ్ కు 38 వేల మంది హాజరుకానున్నట్లు అసోం క్రికెట్ సంఘం ప్రకటించింది.

హాట్ కేకుల్లా రెండో టీ-20 మ్యాచ్ టికెట్లు!
X

భారత్- దక్షిణాఫ్రికాజట్ల రెండో టీ-20 మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గౌహతీలోని బార్సపారా స్టేడియం వేదికగా అక్టోబర్ 2న జరిగే ఈమ్యాచ్ కు 38 వేల మంది హాజరుకానున్నట్లు అసోం క్రికెట్ సంఘం ప్రకటించింది...

ప్రపంచంలో అత్యధిక క్రికెట్ అభిమానులున్న ఏకైకదేశం భారత్. అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు...స్టేడియాలు కిటకిటలాడటం సాధారణ విషయమే.

ఈనెల 16 నుంచి ఆస్ట్ర్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ ఆడుతున్న సిరీస్ లకు అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ నిర్వాహక సంఘాలతో పాటు బీసీసీఐకి కాసుల వర్షమే కురిపించింది.

కరోనాతో అభిమానులకు క్రికెట్ కరువు...

కరోనా దెబ్బతో గత మూడేళ్లుగా అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లకు భారత్ లోని లక్షలాదిమంది అభిమానులు కరువాచిపోయి ఉన్నారు. మొహాలీ, నాగపూర్, హైదరాబాద్ వేదికలుగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో ముగిసిన మొదటి మూడుమ్యాచ్ లకు అభిమానులు పోటెత్తారు. అంతేకాదు...ప్రపంచ మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో తిరువనంతపురం వేదికగా ముగిసిన తొలి మ్యాచ్ కు సైతం భారీసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

మరోవైపు...అక్టోబర్ 2న అసోం క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గౌహతీలోని డాక్టర్ భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే రెండో టీ-20 మ్యాచ్ కు సైతం మొత్తం టికెట్లు

హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని,మ్యాచ్ రోజున 38వేల మంది అభిమానులతో స్టేడియం కిటకిటలాడటం ఖాయమని నిర్వాహక సంఘం ప్రకటించింది.

హైదరాబాద్ టీ-20 అనుభవంతో...

హైదరాబాద్ టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయం సమయంలో నెలకొన్న వివాదాలను, గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకొన్న అసోం క్రికెట్ సంఘం పలురకాలుగా చర్యలు తీసుకొంది.

మొత్తం 38వేల టికెట్లలో సాధారణ క్రికెట్ అభిమానుల కోసం 21వేల 200 టికెట్లు కేటాయించింది. వీటిలో 12వేల టికెట్లను వివిధ జిల్లా క్రికెట్ సంఘాల కౌంటర్ల ద్వారా విక్రయానికి ఉంచింది. ఆన్ లైన్ ద్వారా రెండు విడతలుగా 60 శాతం టికెట్లను విక్రయించింది. మిగిలిన 40 శాతం టికెట్లను జిల్లాకేంద్రాల క్రికెట్ కౌంటర్ల ద్వారా ఆఫ్ లైన్ విక్రయం జరిపినట్లు అసోం క్రికెట్ సంఘం కార్యదర్శి దేవజీత్ సైకియా తెలిపారు.

టికెట్ల విక్రయసమయంలో పూర్తి పారదర్శకత పాటించామని, ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా చర్యలు తీసుకొన్నామని చెప్పారు. 2020లో చివరిసారిగా ఓ అంతర్జాతీయమ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది.

అసోం క్రికెట్ సంఘం స్టేడియం కెపాసిటీ 39వేల 500 కాగా...38వేల టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. ముఖ్యఅతిథులకు, అధికారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులకు భారీసంఖ్యలో కాంప్లిమెంటరీ టికెట్లు అందచేసినట్లు అసోం క్రికెట్ సంఘం వివరించింది.

ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ సిరీస్ కే నిర్ణయాత్మకం కానుంది. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే దక్షిణాఫ్రికాజట్టు ఈ మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది.

తిరువనంతపురం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ సమరంలో 8 వికెట్ల విజయం సాధించడం ద్వారా భారత్ 1-0తో పైచేయి సాధించింది.

First Published:  1 Oct 2022 2:30 AM GMT
Next Story