ఆసియాకప్ ఫైనల్లో పాక్, పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్!
15వ ఆసియాకప్ టీ-20 టోర్నీ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ పాకిస్థాన్ చేరుకొంది.
15వ ఆసియాకప్ టీ-20 టోర్నీ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ పాకిస్థాన్ చేరుకొంది. అప్ఘనిస్థాన్ తో ముగిసిన సూపర్ -4 రెండోరౌండ్ పోరులో పాక్ జట్టు చచ్చీచెడి ఒక వికెట్ విజయంతో ఊపిరిపీల్చుకొంది.
ఆసియాకప్ గ్రూప్- బీ లీగ్ లోవరుస విజయాలతో అదరగొట్టిన సంచలనాల అఫ్ఘనిస్థాన్ సూపర్ -4 రౌండ్లో వరుసగా రెండో ఓటమితో టైటిల్ రేస్ నుంచి నిష్క్రమించింది.
షార్జా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రెండుసార్లు విజేత పాకిస్థాన్ తో జరిగిన పోరులో నెగ్గితీరాల్సిన అఫ్గనిస్థాన్ తుదివరకూ పోరాడి వెంట్రుక వాసిలో విజయం చేజార్చుకొంది.
లోస్కోరింగ్ థ్రిల్లర్లో పాక్ విన్నర్...
పాకిస్థాన్ తో ముగిసిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన అఫ్గనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. షార్జా పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుగా లేకపోడంతో పరుగుల కోసం బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది.
ఓపెనర్లు రహమానుల్లా గుర్బాజ్- హజ్రతుల్లా జజాయ్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా..అప్ఘన్ టాపార్డర్...పాక్ స్పిన్ జోడీని దీటుగా ఎదుర్కొనలేకపోయింది. కీలక సమయాలలో వికెట్లు కోల్పోయి 129 పరుగుల స్కోరుకే పరిమితమయ్యింది.
పాక్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ 26 పరుగులిచ్చి 2 వికెట్లు, నసీమ్ షా, షదాబ్ ఖాన్,మహ్మద్ నవాజ్, మహ్మద్ హస్నయిన్ తలో వికెట్ పడగొట్టారు.
పాక్ కు చెమటలుపట్టించిన అఫ్గన్ బౌలర్లు..
130 పరుగుల స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాకిస్థాన్ కు అప్ఘన్ బౌలర్లు చుక్కలు చూపించారు. కుదురైన బౌలింగ్, అదిరిపోయే ఫీల్డింగ్ తో ముచ్చెమటలు పట్టించారు.
ఓపెనింగ్ బౌలర్ ఫజుల్హక్ ఫారూకీ 3 వికెట్లు, ఫరీద్ 3 వికెట్లు, రషీద్ 2 వికెట్లు పడగొట్టారు.
పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఫకర్ జమాన్ 5 పరుగులకు, రిజ్వాన్ 20, నవాజ్ 4 పరుగులకు వెనుదిరిగారు. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ షదాబ్ ఖాన్
36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఆట ఆఖరి ఓవర్లో మ్యాచ్ నెగ్గాలంటే 11 పరుగులు చేయాల్సిన పాక్ జట్టుకు టెయిల్ ఎండర్ల జోడీ నసీమ్ ఖాన్-మహ్మద్ హస్నెయిన్ 12 పరుగుల అజేయ భాగస్వామ్యంతో విజయం అందించారు. స్పిన్ జాదూ రషీద్ ఖాన్ బౌలింగ్ లో నసీమ్ ఖాన్ రెండు సిక్సర్లు బాదడంతో పాక్ జట్టు ఒక్క వికెట్ విజయంతో ఫైనల్లో చోటు ఖాయం చేసుకోగలిగింది.
అప్ఘన్ ప్రత్యర్థిగా టీ-20 పోరులో ఆఖరి ఓవర్ విజయం సాధించడం పాకిస్థాన్ కు ఇది నాలుగోసారి. ఈనెల 11న జరిగే ఆసియాకప్ టైటిల్ సమరంలో ఐదుసార్లు విన్నర్ శ్రీలంకతో రెండుసార్లు విజేత పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
సూపర్ -4 రౌండ్లో రెండు పరాజయాలు చవిచూసిన అప్ఘనిస్థాన్ తన ఆఖరిరౌండ్ పోరులో భారత్ ను ఢీ కోనుంది.