Telugu Global
Sports

2023లో భారత క్రీడారంగం బిజీబిజీ!

కొత్త సంవత్సరంలో భారత క్రీడారంగం ఊపిరి సలుపని కార్యక్రమాలతో బిజీబిజీ కానుంది. హాకీ పురుషుల ప్రపంచకప్ తో పాటు..ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యమివ్వనుంది.....

2023లో భారత క్రీడారంగం బిజీబిజీ!
X

2023లో భారత క్రీడారంగం బిజీబిజీ!

కొత్త సంవత్సరంలో భారత క్రీడారంగం ఊపిరి సలుపని కార్యక్రమాలతో బిజీబిజీ కానుంది. హాకీ పురుషుల ప్రపంచకప్ తో పాటు..ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యమివ్వనుంది.....

2022 సంవత్సరానికి వీడ్కోలు...2023కు ఘనస్వాగతం కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. గత ఏడాదికాలంలో సాధించిన విజయాలతో పొంగిపోకుండా..ఎదురైన పరాజయాలు, వైఫల్యాలను మెట్లుగా చేసుకొని కొత్తసంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి భారత క్రీడారంగం సమాయత్తమవుతోంది.

ప్రధానంగా క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ భారతజట్లు బిజీబిజీ కానున్నాయి.

ఐసీసీ తొలిసారిగా ప్రవేశ పెట్టిన అండర్‌-19 బాలికల ప్రపంచకప్‌తో పాటు మహిళల టీ20 ప్రపంచకప్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఎప్పటిలాగే ఐపీఎల్‌, ఐఎస్‌ఎల్‌, పీకేఎల్‌ ఎలాగూ ఉండనే ఉన్నాయి.

8 టెస్టులు-18 వన్డేలు- 17 టీ-20లు...

పురుషుల విభాగంలో భారతజట్టు ఏకంగా 8 టెస్టుమ్యాచ్ లు, 18 వన్డేమ్యాచ్ లు, 17 టీ-20 మ్యాచ్ ల్లో పోటీపడాల్సి ఉంది. అంతేకాదు..ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి సైతం బీసీసీఐ ఆతిథ్యమివ్వనుంది. ఐపీఎల్ టోర్నీ కూడా కీలకం కానుంది.

భారతజట్టు 2023 స్వదేశీ సిరీస్ ల్లో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియాజట్లతో ఆరు టీ-20, 9 వన్డే, 4 టెస్టుమ్యాచ్ లు ఆడనుంది. జనవరి 3 నుంచి శ్రీలంకతో మూడుమ్యాచ్ ల టీ-20, వన్డే సిరీస్ పోటీలలో హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ భారతజట్లకు నాయకత్వం వహించబోతున్నారు.

ఆస్ట్ర్రేలియాజట్టు భారత పర్యటన నాలుగుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ సిరీస్ తో ప్రారంభంకానుంది. మార్చి 24న తీన్మార్ వన్డే సిరీస్ జరుగనుంది.

అంతేకాదు..ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో చోటు కోసం సైతం భారత్ ఉరకలేస్తోంది. ఒకవేళ ఫైనల్ చేరగలిగితే..టైటిల్ నెగ్గడమే భారతజట్టు ప్రధానలక్ష్యం కానుంది.

మహిళల విభాగంలో తొలిసారిగా ఐపీఎల్ ను నిర్వహించనుండడంతో భారత మహిళా క్రికెట్లో మేలిమలుపుకానుంది.

జనవరి 13 నుంచి హాకీ ప్రపంచకప్...

15వ హాకీ పురుషుల ప్రపంచకప్ పోటీలు జనవరి 13 నుంచి ఒడిషాలోని భువనేశ్వర్, రూర్కెలా వేదికగా జరుగనున్నాయి. మొత్తం 16 ప్రపంచ మేటిజట్లు ప్రపంచ హాకీ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

న్యూఢిల్లీ వేదికగా ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు.

హైదరాబాద్ వేదికగా ఫార్ములా - ఈ రేస్..

దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌ వీధుల్లో ఫార్ములా-ఈ రేసు జరుగనుండగా.. అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఫార్ములా-1 రేసులు అలరించనున్నాయి. టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు, బ్యాడ్మింటన్‌ టోర్నీలు, బాక్సింగ్‌, రెజ్లింగ్‌ తో సహా మరెన్నో టోర్నీలు సిద్ధంగా ఉన్నాయి.

చైనాలోని గాంగ్జు నగరం వేదికగా 2022ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ జరుగనున్నాయి.

మొత్తం మీద...2023 సంవత్సరం భారత క్రికెట్, హాకీజట్లకు మాత్రమే కాదు...అథ్లెట్లకూ కీలకం కానుంది.

First Published:  1 Jan 2023 11:53 AM IST
Next Story