Telugu Global
Sports

యూఎస్ ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం!

2023- గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరిటోర్నీ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ టైటిల్ డిఫెన్స్ ఆశలు అడియాసలయ్యాయి.

యూఎస్ ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం!
X

ప్రపంచ మహిళా టెన్నిస్‌లో పోలిష్ స్టార్, ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ ఇగా స్వియాటెక్ ఆధిపత్యానికి సవాలు మొదలయ్యింది. గత 18 మాసాలుగా టాప్ ర్యాంకర్ గా తిరుగులేని ఆధిపత్యం కొన‌సాగించ‌డమే కాదు.. గత ఆరు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో మూడింట విజేతగా నిలిచిన స్వియాటెక్ వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టోర్నీలో పరాజయం చవిచూసింది.

ప్రీ-క్వార్టర్స్ లోనే షాక్!

ప్రస్తుత సీజన్ మూడో టోర్నీ వింబుల్డన్ లో కంగుతిన్న స్వియాటెక్ కు ఆఖరిటోర్నీ యూఎస్ ఓపెన్‌లో సైతం అదే అనుభవం ఎదురయ్యింది. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న 2023 యూఎస్ ఓపెన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగిన స్వియాటెక్.. మొదటి మూడు రౌండ్లలో అలవోక విజయాలు సాధించినా.. నాలుగోరౌండ్లో మాత్రం మూడుసెట్ల పోరులో చిత్తు కాక తప్పలేదు. లాత్వియా ప్లేయర్ జెలెనా ఓస్టాపెంకో 3-6, 6-3, 6-1తో టాప్ సీడ్ స్వియాటెక్ ను ఇంటిదారి పట్టించింది. తొలిసెట్ ను 6-3తో సునాయాసంగా నెగ్గిన స్వియాటెక్ ..రెండోసెట్ ను మాత్రం 3-6తో చేజార్చుకుంది. నిర్ణయాత్మక ఆఖరి సెట్లో స్వియాటెక్ దారుణంగా విఫలమయ్యింది. జెలెనా 6-1తో సెట్, 2-1తో మ్యాచ్ నెగ్గడం ద్వారా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ ఓటమితో వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ చేజార్చుకొన్న స్వియాటెక్.. ఏడాదిన్నర విరామం తర్వాత తన టాప్ ర్యాంక్ ను కోల్పోనుంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విన్నర్ జెలెనా ఓస్టాపెంకోకు.. స్వియాటెక్ తో తలపడిన ప్రతిసారీ విజయం సాధిస్తూ వస్తోంది.

22 సంవత్సరాల వయసుకే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గడంతో పాటు.. నంబర్ వన్ స్థానానికి చేరుకోవ‌డం, చేజార్చుకోవ‌డం తనకు ఓ కలలాను, కష్టంగానూ అనిపిస్తోందని స్వియాటెక్ ఓటమి అనంతరం వాపోయింది. ఈ పోరులో జెలెనా 31 విన్నర్స్ సాధిస్తే.. స్వియాటెక్ 18 పాయింట్లు మాత్రమే సంపాదించింది. 20వ సీడ్ జెలెనా తనదైన శైలిలో స్వియాటెక్ జోరుకు అడ్డుకట్ట వేసింది. సహనానికి పరీక్షపెట్టి పొరపాట్లు చేయడంలో సఫలం కాగలిగింది. స్వియాటెక్ తో ఇప్పటి వరకూ తలపడిన నాలుగుకు నాలుగుసార్లు జెలెనా ఓస్టాపెంకో విజేతగా నిలవడం విశేషం.

వోజ్నియాకీకి కోకో గాఫ్ చెక్..

మరో నాలుగో రౌండ్ పోరులో ప్రపంచ మాజీ నంబర్ వన్, వెటరన్ ప్లేయర్ కారోలినా వోజ్నియాకి వరుస విజయాలకు అమెరికా యువప్లేయర్ కోకో గాఫ్ గండి కొట్టింది. మూడుసెట్ల పోరులో కోకో 6-3, 3-6, 6-1తోనే విజేతగా నిలవడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్ కరాజ్ సునాయాసంగా ప్రీ- క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించగలిగాడు.

*

First Published:  4 Sept 2023 5:23 PM IST
Next Story