Telugu Global
Sports

మోడీ గారికి వద్దంటే క్రీడాకానుకలు!

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు, ప్రముఖులు, వివిధవర్గాల వారి నుంచి కానుకలు, జ్ఞాపికలు అందటం సాధారణ విషయమే.

మోడీ గారికి వద్దంటే క్రీడాకానుకలు!
X

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు, ప్రముఖులు, వివిధవర్గాల వారి నుంచి కానుకలు, జ్ఞాపికలు అందటం సాధారణ విషయమే. అయితే..స్వయంగా క్రీడాకారుడు కాకున్నా, క్రీడలతో ఏమాత్రం సంబంధం లేకున్నాప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీకి విఖ్యాత క్రీడాకారులు..ప్రధానంగా మహిళా అథ్లెట్ల నుంచి కానుకుల అందుతున్నాయి.

క్రీడాకారులతో ప్రత్యేక అనుబంధం.!

అహరహం శ్రమించి, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ దేశానికి పతకాలు, ఖ్యాతి సంపాదించిపెట్టే క్రీడాకారులతో ఎలా మసులుకోవాలో భారత ప్రధానుల్లో మోదీగారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. స్వయంగా మోడీ గారికే క్రీడాస్ఫూర్తి ఉందో..లేక ఆయన వ్యూహకర్తలు సలహా ఇచ్చారో తెలియదుకానీ..

తనదైన శైలిలో క్రీడాకారులతో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు.

విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, పీవీ సింధు, లక్ష్యసేన్, మేరీ కోమ్, మీరాబాయి చాను, నిఖత్ జరీన్, హిమాదాస్,నీరజ్ చోప్రా, పారా టీటీ బంగారు విజేత బావినా పటేల్, బ్యాడ్మింటన్ డబుల్స్ గోల్డ్ మెడలిస్ట్ చిరాగ్ శెట్టి..ఇలా ఒకరేమిటి..తనను మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చిన క్రీడాకారులకు రెండుచేతులతో ఆహ్వానం పలుకుతున్నారు.

విఖ్యాత క్రీడాకారులను కలుసుకొనే సందర్భం ఏదీ దొరికినా దానిని ప్రధాని పూర్తిస్థాయిలో వినియోగించుకొంటున్నారు. భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ లాంటి క్రీడాప్రముఖులకు కమలంతీర్థం ఇచ్చి మరీ పార్లమెంటులో అడుగుపెట్టేలా చేస్తున్నారు.


అథ్లెట్లలో స్ఫూర్తి నింపుతూ...!

ప్రపంచ అథ్లెటిక్స్, ఆసియా క్రీడలు, టోక్యో ఒలింపిక్స్, బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్, చెస్ ఒలింపియాడ్...పోటీలు ఏవైనా..భారత క్రీడాకారులు పోటీలలో పాల్గనటానికి ముందు, పాల్గొని విజేతలుగా తిరిగి వచ్చిన తరువాత వారిని కలుసుకొంటూ, భుజం తడుతూ, మనోధైర్యం నింపుతూ ప్రేరణ కలిగించడంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాతే ఎవరైనా. ఒకవేళ ఓటమి ఎదురై తీవ్రనిరాశలో కూరుకుపోయినా..అలాంటి క్రీడాకారులకు నేనున్నానంటూ ట్విట్టర్ సందేశాలతో ఊరట కలిగిస్తున్నారు.

చెన్నైలోని మామల్లపురం వేదికగా ఇటీవలే ముగిసిన 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలను సైతం నరేంద్ర మోదీ ప్రారంభించడం ద్వారా మేధో క్రీడ చదరంగానికి ఆలంబనగా నిలిచారు.


మోదీకి క్రీడాకారుల కానుకలు!

పెద్దవారిని మర్యాదపూర్వకంగా కలుసుకోడానికో...లేక వారి ఆశీసులు తీసుకోడానికి వెళ్ళిన సమయంలో ఉత్తచేతులతో పోవడం మన సాంప్రదాయం ఏమాత్రం కాదు.

అదే సాంప్రదాయాన్ని మన క్రీడాకారులూ పాటిస్తున్నారు.

ప్రధాని మోదీని కలుసుకొని, తాము సాధించిన పతకాలు, ఘనతలను చాటుకోడానికి క్రీడాకారులు పోటీపడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా..తాను విసిరే బల్లాన్నే( జావలిన్ నే ) ప్రధానికి కానుకగా ఇచ్చాడు.

ఇక..ప్రపంచ బాక్సింగ్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నర్ నిఖత్ జరీన్ సైతం..ప్రధానిని కలసి సెల్ఫీ దిగడంతో పాటు..తాను ఉపయోగించే బాక్సింగ్ గ్లోవ్స్ లో ఓ జతను బహూకరించింది.

అస్సామీ రన్నర్ హిమాదాస్ మాత్రం ప్రధానిని కలిసిన సమయంలో తమ సాంప్రదాయ కండువా ( గమోచా)ను కప్పి మరీ తన గౌరవాన్ని చాటుకొంది.

ఇటీవలే బర్మింగ్ హామ్ లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో 22 బంగారు, 16 వెండి, 23 కంచు పతకాలతో సహా మొత్తం 61 పతకాలు సాధించడం ద్వారా..భారత్ ను పతకాలపట్టిక 4వ స్థానంలో నిలిపిన భారత అథ్లెట్ల బృందాన్ని తమ నివాసానికి పిలుపించుకొని మరీ ప్రధాని ఘనంగా సత్కరించారు.

ప్రధాని స్వయంగా తమను అభినందించడం, తమ నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించడంతో భారత క్రీడాకారులు పొంగిపోతున్నారు.

అన్నట్లు...స్వయంగా యోగాను పాటించే ప్రధాని నరేంద్ర మోదీకి క్రికెట్ గురించి అంతగా అవగాహన, ఆసక్తి లేకున్నా..ఆయన పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నరేంద్ర మోదీ స్టేడియం పేరుతో అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.




First Published:  19 Aug 2022 9:36 AM IST
Next Story